
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మరోసారి రాజకీయం వేడెక్కింది. కాళేశ్వరం ప్రాజెక్టు విషయమై మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు హరీష్‌రావు, ఈటల రాజేందర్‌కు పీసీ ఘోష్ కమిషన్ మంగళవారం నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులపై మాజీ మంత్రి, బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు.
తాజాగా ఈటల రాజేందర్ సాక్షితో మాట్లాడుతూ..‘నోటీసులకు భయపడేది లేదు. ఇంకా నోటీసులు అందలేదు. కాళేశ్వరం కమిషన్ విచారణకు సహకరిస్తాను. చట్టాలు, కోర్టులు, కమిషన్‌పై నమ్మకం ఉంది. కాంగ్రెస్ పార్టీలో కొంత మంది చిల్లర ఆరోపణలు చేస్తున్నారు. విచారణకు భయపడేది లేదు. తప్పు ఎవరు చేసినా శిక్ష పడాల్సిందే. నేను ఆర్థిక శాఖమంత్రిగా పని చేసిన సమయంలో ఆ శాఖ కార్యదర్శిగా ఉన్న రామకృష్ణారావు ప్రస్తుత రాష్ట్ర సీఎస్‌గా ఉన్నారని చెప్పారు. పీసీ కమిషన్‌ను ఎందుకు ఇన్నిసార్లు పొడిగించారో చెప్పాలని ఈటల డిమాండ్ చేశారు. తుమ్మల, కడియం, జూపల్లికి ఏం జరిగిందో తెలియదా? అని ప్రశ్నించారు.
ఇదిలా ఉండగా.. కాళేశ్వరంపై జూన్ ఐదో తేదీన విచారణకు రావాలని కేసీఆర్‌కు, జూన్ ఆరో తేదీన హరీష్ రావు, జూన్ తొమ్మిదో తేదీన ఈటల రాజేందర్‌ను విచారణకు రావాలని పీసీ కమిషన్ జారీ చేసిన నోటీసుల్లో స్పష్టం చేసింది. మరోవైపు కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇచ్చిన వెంటనే మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్ రావు బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్‌తో భేటీ అయ్యారు. అయితే, పీసీ ఘోష్ కమిషన్ విచారణకు కేసీఆర్ హాజరు అవుతారా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది.