‘చలో ప్రగతి భవన్‌’లో ఉద్రిక్తత 

BJP Leaders Tried To Block Pragat​hi Bhavan At Punjagutta - Sakshi

ప్రగతిభవన్‌ ముట్టడికి బీజేపీ నేతల యత్నం 

పోలీసులకు, బీజేపీ శ్రేణుల మధ్య తీవ్ర వాగ్వాదం.. తోపులాటలో కిందపడిన ఆందోళనకారులు, పోలీసులు 

పంజగుట్ట/ సాక్షి, హైదరాబాద్‌: జీవో నెంబర్‌ 317 వల్ల నష్టపోయిన ఉద్యోగులకు న్యాయం చేయాలంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఇచ్చిన పిలుపుమేరకు సోమవారం వివిధ బీజేపీ మోర్చా నాయకులు చేపట్టిన చలో ప్రగతిభవన్‌ కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తంగా మారింది. పెద్ద సంఖ్యలో మోర్చా నాయకులు ప్రగతిభవన్‌ చేరుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

వీరిని అదుపులోకి తీసుకునే క్రమంలో పోలీసులకు, బీజేపీ నేతలకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పరస్పరం దూషించుకునే స్థాయికి వెళ్లింది. తోపులాటలో బీజేపీ నాయకులతో పాటు పోలీసులు కూడా కిందపడటంతో పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. బీజేవైఎం నేత రవికుమార్, మైనార్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు అప్సర్‌ పాషా, బీజేపీ ఓబీసీ మోర్చా అధ్యక్షులు ఆలె భాస్కర్, ఎస్సీ మోర్చా అధ్యక్షులు కొప్పు బాషాతో పాటు పలువురిని అదుపులోకి తీసుకుని వివిధ పోలీస్‌స్టేషన్‌లకు తరలించారు. 

ఉద్యోగులు, టీచర్లకు సీఎం క్షమాపణలు చెప్పాలి..
ఉద్యోగులు, ఉపాధ్యాయుల అరెస్ట్‌ల సందర్భంగా పోలీసులు అమానుషంగా వ్యవహరించడంపై సీఎం కేసీఆర్‌ బేషరతుగా ఆయా వర్గాలకు క్షమాపణ చెప్పాలని బండి సంజయ్‌ డిమాండ్‌ చేశారు.. 317 జీవోను సవరించి వారికి న్యాయం చేయాలని, భార్యాభర్తలు ఒకే చోట పనిచేసే అవకాశం కల్పించాలన్నారు. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో స్పౌజ్‌ బదిలీలను లంచాల కోసమే నిలిపేశారని ఆరోపించారు. జిల్లా కేంద్రాల్లో ఖాళీలు చూపకుండా పోస్టులన్నీ బ్లాక్‌ చేశారని ఆరోపించారు.

సోమవారం సంజయ్‌ మీడియాతో మాట్లాడుతూ తమ సమస్యలు మెరబెట్టుకునేందుకు ప్రగతిభవన్‌కు వెళితే మహిళా టీచర్లు, చిన్న పిల్లలపై కేసీఆర్‌ ప్రభుత్వం రాక్షసంగా వ్యవహరించిందని సంజయ్‌ మండిపడ్డారు. పసిపిల్లలు ధర్నాలో రోదిస్తుండడాన్ని చూసి అందరి మనసు ద్రవించినా కేసీఆర్‌ మనసు మాత్రం కరగలేదన్నారు. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే సకల జనుల సమ్మె నాటి పరిస్థితులు గుర్తుకొస్తున్నాయన్నారు. కష్టపడి తెలంగాణ సాధించుకున్నాక స్థానికత కోసం మళ్లీ ఉద్యమించే దుస్థితి ఏర్పడిందని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, యువకులు ఉద్యమించకపోతే, 42 రోజులు సకల జనుల సమ్మె చేయకపోతే ఇయాళ తెలంగాణ వచ్చేదా? కేసీఆర్‌ సీఎం అయ్యేవారా? అని ప్రశ్నించారు.  

(చదవండి: రైలును అపరిశుభ్రంగా మార్చేసిన ప్రయాణికులు)

మరిన్ని వార్తలు :

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top