తెలంగాణలో రోజంతా నడుద్దామా?.. నిర్ఘాంతపోయిన రేవంత్‌!

Bharat Jodo Yatra: Rahul Gandhi Ask Congress Leaders To Walk Without Break - Sakshi

 విరామం లేకుండా వాకింగ్‌ మారథాన్‌ చేద్దామన్న రాహుల్‌గాంధీ 

మహారాష్ట్రలో ప్లాన్‌ చేసుకోవాలంటూ రేవంత్‌ సరదా వ్యాఖ్య

రాహుల్‌ నడక, స్పీడ్‌పై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ

52 ఏళ్ల వయసులో రోజుకు 20–25 కిలోమీటర్లు నడుస్తున్న వైనం 

సాక్షి, హైదరాబాద్‌: యాభై రెండేళ్ల వయసు.. చుట్టూ వందలు, వేల సంఖ్యలో పార్టీ కార్యకర్తలు, నాయకులు.. పెద్ద ఎత్తున పోలీసు భద్రత... ఈ సవాళ్లన్నింటినీ అధిగమించి వేగంగా, వడివడిగా రాష్ట్రంలో భారత్‌ జోడో యాత్ర చేస్తున్న కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ ఓ అనూహ్య ప్రతిపాదనను తీసుకువచ్చారు. రోజంతా విరామం లేకుండా ‘వాకింగ్‌ మారథాన్‌’చేద్దామని, ఒక్కరోజులో వీలున్నన్ని కిలోమీటర్ల దూరం నడుచుకుంటూ వెళ్దామని రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలతో అన్నారు. రాహుల్‌గాంధీ చేసిన ఈ అనూహ్య ప్రతిపాదనతో నిర్ఘాంతపోవడం అక్కడే ఉన్న ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ఇన్‌చార్జి కేసీ వేణుగోపాల్, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తదితరుల వంతయింది. 

100 కి.మీ రికార్డు యోచనలో రాహుల్‌? 
మంగళవారం టీ బ్రేక్‌ సమయంలో రాహుల్‌గాంధీ చేసిన ఈ మారథాన్‌ ప్రతిపాదనకు ఎలా స్పందించాలో అర్ధం కాక వేణుగోపాల్, రేవంత్‌రెడ్డిలు కొంతసేపు మౌనంగా ఉన్నారని సమాచారం. ఆ తర్వాత తేరుకున్న రేవంత్‌రెడ్డి ‘విరామం లేకుండా వాకింగ్‌ మారథానా?.. ఇప్పటికే మీ వేగాన్ని అందుకోవడానికి చాలామంది ఇబ్బంది పడుతున్నారు. మహారాష్ట్రలోకి వెళ్లి నాందేడ్‌ దాటిన తర్వాత మీరు మారథాన్‌కు ప్లాన్‌ చేసుకోండి.’అని రాహుల్‌తో సరదాగా వ్యాఖ్యానించారు.

రేవంత్‌ వ్యాఖ్యలతో కేసీ వేణుగోపాల్‌ కూడా ఏకీభవించడంతో ప్రస్తుతానికి వాకింగ్‌ మారథాన్‌ ప్రతిపాదనను రాహుల్‌ పక్కన పెట్టారని, కశ్మీర్‌ వరకు వెళ్లేలోపు కచ్చితంగా ఆయన మారథాన్‌ చేస్తారనే చర్చ కాంగ్రెస్‌ వర్గాల్లో జరుగుతోంది. దేశంలోని అనేక రాష్ట్రాల్లో 3 వేల కిలోమీటర్లకు పైగా పాదయాత్ర చేయడం ప్రపంచ స్థాయిలో చర్చనీయాంశమవుతోందని, ఈ నేపథ్యంలోనే ఒకేరోజు దాదాపు 100 కిలోమీటర్లు నడిచి రికార్డు సృష్టించాలన్నది రాహుల్‌ ఆలోచన అయి ఉంటుందని చెబుతున్నారు.  

8 రోజులు.. 170కి పైగా కిలోమీటర్లు 
ఈ నెల 23వ తేదీన నాగర్‌కర్నూల్‌ జిల్లా కృష్ణా మండలం గూడేబల్లూరు గ్రామం వద్ద తెలంగాణలోకి ప్రవేశించిన రాహుల్‌గాంధీ బుధవారం నాటికి ఎనిమిది రోజుల్లో 170కి పైగా కిలోమీటర్లు నడిచారు. తొలి రోజు కేవలం 4 కిలో మీటర్లు మాత్రమే నడిచిన ఆయన మిగిలిన ఏడు రోజుల్లోనే 166 కిలోమీటర్లకు పైగా పాదయాత్ర చేయడం గమనార్హం.  

అభివాదం చేస్తూ.. ఆప్యాయంగా పలకరిస్తూ 
పాదయాత్ర అంటే కేవలం నడుచుకుంటూ వెళ్లడమే కాదు. దారిలో కనిపించిన వారందరినీ పలకరించుకుంటూ రాహుల్‌ యాత్ర సాగుతోంది. ఆయన ఉదయం, సాయంత్రం నడిచే సమయంలో వేల సంఖ్యలో పార్టీ కార్యకర్తలు, నాయకులు ఆయన ముందూ, వెనుకా నడుస్తున్నారు. ముందు భాగంలో పోలీసులు ఏర్పాటు చేసిన వలయంలో నడుస్తున్న రాహుల్‌.. పార్టీ కార్యకర్తలకు అభివాదం చేస్తూ ముందుకు సాగుతున్నారు. తనతో కలిసి నడుస్తున్న వారిలో కొందరిని దగ్గరకు పిలిచి మాట్లాడుతున్నారు.

దారిలో వచ్చే గ్రామాల్లో రోడ్డుకిరువైపులా, మిద్దెల మీద, చెట్లు, వాహనాలపైనా తన కోసం ఎదురుచూస్తున్న ప్రజలందరినీ రాహుల్‌ పలకరిస్తున్నారు. చిన్నారులు, వృద్ధులు, పాఠశాలల విద్యార్థులు, కూలీలు, బస్సులు, ఇతర వాహనాల్లో వెళుతున్న ప్రయాణికుల వద్దకు ఆయనే వెళ్లి మాట్లాడుతున్నారు. పరుగెత్తడం, బస్సు ఎక్కడం, పిల్లలతో కలిసి ఆడుకోవడం, జిమ్నాస్టిక్స్, కళారూపాలను వీక్షించడం లాంటివి చేస్తున్నారు. కాంగ్రెస్‌ పార్టీ నేతలను కూడా నడిచే సమయంలోనే కలుస్తున్నారు.  

విశ్రాంతి, విసుగు లేకుండా..
మధ్యాహ్నం విశ్రాంతి సమయంలోనూ పలువురిని కలుస్తున్న రాహుల్‌గాంధీ వారితో కూడా ఆప్యాయంగా వ్యవహరిస్తున్నారు. తనను కలిసేందుకు వెళ్లినవారితో కలివిడిగా మాట్లాడడమే కాకుండా వారి సమస్యలను శ్రద్ధగా వినడం, వారి కుటుంబ పరిస్థితులను ఆరా తీయడం, పిల్లల చదువుల గురించి అడగడం, చిన్నారులను దగ్గరకు తీసుకుని ఒళ్లో కూర్చోబెట్టుకోవడం లాంటివి చేస్తున్నారు. మొత్తం మీద పాదయాత్రను రాహుల్‌ జనాకర్షకంగా కొనసాగిస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సెక్యూరిటీ కారణాల రీత్యా కూడా రాహుల్‌ పాదయాత్ర వేగంగా సాగుతోందని పోలీసులు చెబుతుండగా.. 3,750 కిలోమీటర్లు 150 రోజుల్లో నడవాలి కదా, ఆమాత్రం స్పీడ్‌ లేకపోతే ఎలా? అంటూ ఆయనతో కలిసి నడుస్తున్నవారు వ్యాఖ్యానిస్తుండడం గమనార్హం.    

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top