నేటి నుంచే వార్షిక ఫాస్టాగ్‌ | Annual FASTag from today | Sakshi
Sakshi News home page

నేటి నుంచే వార్షిక ఫాస్టాగ్‌

Aug 15 2025 5:06 AM | Updated on Aug 15 2025 5:06 AM

Annual FASTag from today

ఎన్‌హెచ్‌ఏఐ నిర్వహించే జాతీయ రహదారులపై మాత్రమే

రూ.3 వేలతో రీచార్జ్‌తో ఏడాది ప్రయాణం లేదా 200 ట్రిప్పులు

నాన్‌ కమర్షియల్‌ వాహనాలకు మాత్రమే ఈ విధానం అమలు

సాక్షి ప్రతినిధి, నల్లగొండ: ఎక్కువసార్లు ప్రయాణించే వాహనదారులకు ఉపయోగపడేలా జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) వార్షిక ఫాస్టాగ్‌ విధానాన్ని నేటి నుంచి (15వ తేదీ) నుంచి అమల్లోకి తీసుకురానుంది. జాతీయ రహదారులపై ప్రయాణించే నాన్‌ కమర్షియల్‌ వాహనాలకు ఇది అమలు కానుంది. 

వాహనదారులు ఫాస్టాగ్‌లో డబ్బులు అయిపోయిన ప్రతిసారి రీచార్జ్‌ చేసుకోవాల్సిన అవసరం లేకుండా ఒకేసారి రూ.3 వేలు చెల్లించి వార్షిక ఫాస్టాగ్‌ రీచార్జ్‌ చేసుకుంటే 200 ట్రిప్పులు లేదంటే ఏడాది గడువుతో (ఏది ముందు అయితే అది) ఈ పాస్‌ వర్తిస్తుంది. వాహనదారులు కొత్తగా ఫాస్టాగ్‌ కొనాల్సిన అవసరం లేకుండా ప్రస్తుతం వాహనంపై అతికించిన ఫాస్టాగ్‌కే ఆ మొత్తాన్ని రీచార్జ్‌ చేసుకునేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఇందుకోసం రాజ్‌మార్గ్‌ యాత్ర యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది.

పాత ఫాస్టాగ్‌ లైన్లలోనే..
రాష్ట్రంలోని 24 జాతీయ రహదారులపై ఉన్న దాదాపు 50 టోల్‌ ప్లాజాల వద్ద ఈ వార్షిక ఫాస్టాగ్‌ అమలు కానుంది. వాణిజ్య వాహనాలకు, ట్యాక్సీలకు ఇది వర్తించదు. వార్షిక ఫాస్టాగ్‌ అమల్లోకి వచ్చినా దానికోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయాల్సిన అవసరం లేదని టోల్‌ప్లాజా నిర్వాహకులు చెబుతున్నారు. ప్రస్తుతం ఉన్న ఫాస్టాగ్‌ లైన్లలోనే వార్షిక ఫాస్టాగ్‌ పాస్‌ కలిగిన వాహనాలు కూడా వెళ్లిపోవచ్చని తెలిపారు. వార్షిక ఫాస్టాగ్‌ పాసును వాహనదారులు తమ వాహన నంబర్, ఫాస్టాగ్‌ ఐడీ ఉపయోగించి రాజ్‌మార్గ్‌ యాత్ర యాప్‌ లేదా ఎన్‌హెచ్‌ఏఐ/ ఎంఓఆర్‌టీహెచ్‌ వెబ్‌సైట్‌లో రీచార్జ్‌ చేసుకోవచ్చు. 

ఫాస్టాగ్‌ వార్షిక పాసు ఇతరులకు బదిలీ కాదు. రిజిస్టర్డ్‌ వాహనానికి మాత్రమే పనిచేస్తుంది. డబ్బు వాపస్‌ చేయడం ఉండదు. పాస్‌ గడువు తీరిన తర్వాత మళ్లీ రీచార్జ్‌ చేసుకోవాలి. వార్షిక ఫాస్టాగ్‌ ఎన్‌హెచ్‌ఏఐ శాఖ నిర్వహించే జాతీయ రహదారులు, ఎక్స్‌ప్రెస్‌వేలలో మాత్రమే పనిచేస్తుంది. రాష్ట్ర రహదారులు, ఔటర్‌ రింగ్‌ రోడ్లు, మున్సిపాలిటీలు నిర్వహించే రోడ్లలో పనిచేయదు. ఈ వార్షిక ఫాస్టాగ్‌ తప్పనిసరి కాదని, వాహనదారుల ఇష్టమని అధికారులు తెలిపారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement