నాలుగు వరుసలుగా చేవెళ్ల రహదారి విస్తరణకు మార్గం సుగమం!
915 మర్రిచెట్లు తొలగించాల్సి ఉండటంతో విస్తరణపై గతంలో హరిత ట్రిబ్యునల్ స్టే
ఎన్‌హెచ్‌ఏఐ రోడ్డు డిజైన్ మార్చడంతో ఆ చెట్లకు తప్పిన ముప్పు
నేడు స్టే ఎత్తేసే అవకాశం.. రెండేళ్లలో పూర్తికానున్న నిర్మాణం
సాక్షి, హైదరాబాద్: చేవెళ్ల రోడ్డు ఎట్టకేలకు లోపాలు సరిదిద్దుకొని విశాలంగా మారనుంది. గత పదకొండేళ్లలో రోడ్డు ప్రమాదాల రూపంలో 300 మంది మృతికి కారణమైన ఈ రోడ్డు మరో రెండేళ్లలో నాలుగు వరుసలుగా మారి ప్రయాణికులు పదిలంగా గమ్యం చేరేందుకు దోహదపడనుంది. ఈ విస్తరణ వల్ల 915 మర్రి చెట్లకు ముప్పు పొంచి ఉందంటూ వృక్ష ప్రేమికులు గతంలో వేసిన కేసు వల్ల జాతీయ హరిత ట్రిబ్యునల్‌లో కొనసాగుతున్న స్టేకు అడ్డంకులు తొలగనుండటమే అందుకు కారణం.
రోడ్డు డిజైన్‌ను మార్చడం ద్వారా ఆ చెట్లను కాపాడనున్నట్లు ఎన్‌హెచ్‌ఏఐ చేసిన విన్నపానికి ట్రిబ్యునల్ సానుకూలంగా స్పందించిన నేపథ్యంలో సోమ, మంగళవారాల్లో స్టేను ఎత్తేసే అవకాశం ఉందని తెలుస్తోంది. దీంతో రోడ్డు విస్తరణ పనులు మొదలు కానున్నాయి. గతంలోనే టెండర్ల ప్రక్రియను పూర్తి చేయడంతో ఇప్పుడు జాప్యం లేకుండా రోడ్డు పనుల్లో కదలిక రానుంది. 46.405 కి.మీ. నిడివిగల ఈ రోడ్డును 60 మీటర్లకు విస్తరించే పని రెండేళ్లలో పూర్తి చేస్తామని ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు అంటున్నారు.
తెలంగాణ వచ్చాక 300 మరణాలు...
హైదరాబాద్ శివారులోని అప్పా జంక్షన్ నుంచి మన్నెగూడ కూడలి వరకు ఉన్న రోడ్డును 60 మీటర్ల మేర నాలుగు వరుసలుగా ఎన్‌హెచ్‌ఏఐ విస్తరించనుంది. ప్రస్తుతం రోడ్డు బాగా ఇరుకుగా ఉండటంతో తరచూ రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. 2014 నుంచి 2025 వరకు జరిగిన ప్రమాదాల్లో ఏకంగా 300 మంది మరణించారు. వాస్తవానికి ఈ రోడ్డును విస్తరించాలని పదేళ్ల క్రితమే నిర్ణయించినా పలు కారణాల వల్ల జాప్యం జరుగుతూ వచ్చింది.
ప్రధానంగా ఈ మార్గంలో ఉన్న భారీ మర్రి చెట్లు రోడ్డు విస్తరణకు అడ్డంకిగా మారాయి. మిగతా రోడ్లను విస్తరించే సమయంలో భారీ మర్రి చెట్లను తొలగించడంతో ఈ రోడ్డుపై ఉన్న 915 మర్రి చెట్లను కాపాడాకే రోడ్డు విస్తరణ జరిగేలా చూడాలని వృక్ష ప్రేమికులు జాతీయ హరిత ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు. అధికారుల వద్ద సరైన ప్రణాళిక లేకపోవడంతో రోడ్డు విస్తరణపై ట్రిబ్యునల్ స్టే విధించింది. ఇప్పుడు విస్తరణకు పక్కా ప్రణాళికను రూపొందించి తాజాగా ట్రిబ్యునల్‌కు సమర్పించారు.
మార్పులతో ముందుకు..
రోడ్డు సెంట్రల్ మీడియన్‌కు ఉద్దేశించిన ఐదు మీటర్ల స్థలాన్ని ఒకటిన్నర మీటర్‌కు అధికారులు కుదించారు. ఫలితంగా మిగిలే మూడున్నర మీటర్ల స్థలాన్ని రోడ్డు విస్తరణకు జోడించారు. దీనివల్ల రోడ్డు పక్కనున్న చెట్లను తొలగించాల్సిన అవసరం ఉండదని ప్రణాళికలో పేర్కొన్నారు. చెట్లు తక్కువగా ఉన్న వైపు విస్తరణ స్థలాన్ని పెంచడం వల్ల చెట్లు పోకుండా కాపాడతామని తెలిపారు.
కేవలం 136 వృక్షాలే ఈ డిజైన్‌కు సరిపోవట్లేదని.. వాటిని మాత్రం ఉన్న స్థలం నుంచి తొలగించి ట్రాన్స్‌లొకేట్ చేయడం ద్వారా రోడ్డు పక్కన తిరిగి నాటుతామని చెప్పారు. తద్వారా ఒక్క మర్రి చెట్టు కూడా పోకుండా కాపాడే అవకాశం ఉంటుందన్నారు. దీనికి ట్రిబ్యునల్ సానుకూలంగా ఉంది.
కేసు దాఖలు చేసిన వృక్ష ప్రేమికులు ఈ ప్రణాళికను స్వాగతిస్తూనే దాని అమలు విషయంలో లిఖితపూర్వక హామీలు కోరుతున్నారు. వాటిని సోమవారం ట్రిబ్యునల్‌కు సమరి్పంచనున్నారు. ఆ హామీలపై ఎన్‌హెచ్‌ఏఐ లిఖితపూర్వక భరోసా ఇస్తే ట్రిబ్యునల్ స్టే ఎత్తేసే అవకాశం ఉంది.


