Krishna Water Dispute: అదే బందోబస్తు..!

Andhra Telangana Water Dispute,tension Creates On Krishna Water River Project - Sakshi

ఇరువైపులా భారీగా పోలీసు పహారా  

రెండు రాష్ట్రాల సరిహద్దుల్లో తనిఖీలు, నిఘా

నాగార్జునసాగర్‌/దోమలపెంట(అచ్చంపేట)/ధరూరు/అమరచింత/హుజూర్‌నగర్‌: కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టుల వద్ద అదే టెన్షన్‌ కొనసాగుతోంది. తెలంగాణ సర్కారు విద్యుదుత్పత్తి కొనసాగిస్తూనే ఉండటం, ఆపాలంటూ ఏపీ సర్కారు, రాజకీయ నేతలు డిమాండ్‌ చేస్తుండటం నేపథ్యంలో.. ప్రాజెక్టుల వద్ద ఇరువైపులా భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఎగువన జూరాల నుంచి దిగువన పులిచింతల దాకా ప్రాజెక్టుల వద్ద పోలీసు బందోబస్తు కొనసాగుతోంది. నాగార్జునసాగర్‌ కొత్త వంతెన, ప్రధాన విద్యుత్‌ కేంద్రం వద్ద, మెయిన్‌ డ్యామ్, ఎర్త్‌ డ్యామ్‌కు ఇరువైపులా రెండు రాష్ట్రాల పోలీసు బలగాలు మోహరించాయి. ప్రధాన విద్యుత్‌ కేంద్రం వైపువెళ్లే దారిని మూసివేశారు. తెలంగాణ పోలీసులు ఏపీ నుంచి వస్తున్న వాహనాలను తనిఖీ చేసి పంపుతున్నారు.

సాగర్‌లోని 8 యూనిట్ల ద్వారా విద్యుదుత్పత్తి చేస్తున్నారు. శ్రీశైలం నుంచి 31,723 క్యూసెక్కుల నీరు వస్తుండగా.. 30,525 క్యూసెక్కులు దిగువకు వెళ్లిపోతున్నాయి. ఇక శ్రీశైలం ప్రాజెక్టు ఎడమగట్టు పవర్‌హౌజ్‌లో విద్యుదుత్పత్తి కొనసాగుతోంది. నాగర్‌కర్నూల్‌ జిల్లా ఎస్పీ ఇక్కడికి సమీపంలోని ఈగలపెంట వద్ద క్యాంపు వేసి భద్రతను పర్యవేక్షిస్తున్నారు. వంద మందితో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక ఎగువన జూరాల ప్రాజెక్టు వద్ద, దిగువన పులిచింతల ప్రాజెక్టు వద్ద కూడా విద్యుదుత్పత్తి కొనసాగుతోంది. రెండో చోట్లా పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. పులిచింతల ప్రాజెక్టు వద్దకు పర్యాటకులను అనుమతించడం లేదు. సరిహద్దులో వాహనాలను తనిఖీ చేసి అనుమతిస్తున్నారు.  

చదవండి :  అక్రమ ప్రాజెక్టులు ఆపండి, మాపైనే నిందలా

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top