తోలు తీసి.. నదిని దాటేసి.. ఏ కాలం నుంచి మొదలు?

Ancient Techniques: Rivers Cross In Animal Skin - Sakshi

వాగులు, వంకలు దాటేందుకు ఇప్పుడంటే పడవలు, బోట్లు ఉన్నాయి. సముద్రాలను కూడా అలవోకగా దాటేస్తున్నాం. ఇవన్నీ ఎందుకనుకుంటే పెద్ద పెద్ద వంతెనలే కట్టుకుంటున్నాం. మరి ఇలాంటి సౌకర్యాలేవీ లేని పూర్వకాలంలో కొన్ని ప్రాంతాల్లో వాగులు, నదులను ఎలా దాటే వాళ్లో తెలుసా? చనిపోయిన జంతువుల కళేబరాలను ఒలిచి, వాటిలో గాలిని ఊది బెలూన్లలా చేసుకొని వాడేవారు. వినడానికి విచిత్రంగా ఉన్నా అప్పట్లో ఇలాగే చేసేవారు. అసలు రంధ్రాలు పడకుండా జంతువుల కళేబరాలను పక్కాగా ఎలా ఒలిచేవాళ్లు, వాటి నుంచి గాలి పోకుండా ఏం చేసేవాళ్లు, కదిలే నీటిలో వాటితో ఎలా ప్రయాణించే వాళ్లు, ఇలాంటి పద్ధతులు ఏ ప్రాంతాల్లో వాడేవారో తెలుసుకుందామా?  
– సాక్షి సెంట్రల్‌ డెస్క్‌  

ఏ కాలం నుంచి మొదలు? 
ఆదిమ కాలం నాటి ఈ నదులు దాటే పద్ధతి మెసపటోమియా కాలం నుంచి కనిపిస్తోంది. క్రీస్తుపూర్వం 880ల కాలంలో నిర్ముడ్‌ ప్రాంతంలోని (ప్రస్తుతం ఇరాక్‌లో ఉంది) ఓ శిల్పంలో ఈ విధానం గురించి చెక్కారు. అప్పటి ఆ ప్రాంతపు అస్సీరియన్‌ సైనికులు గాలి నింపిన మేక ఆకారంలోని జంతు చర్మాల సాయంతో వాగును దాటుతున్నట్టు ఆ శిల్పంలో ఉంది. అప్పట్లో గ్రీకు రాజు సైరస్‌ కూడా ఇలాంటి జంతు చర్మాల సాయంతో బాబిలోనియన్‌ నదిని దాటాడని నాటి తత్వవేత్త జెనోఫోన్‌ చెప్పాడు. పర్షియా రాజు డేరియస్, మంగోలియన్‌ సైనికులు, రోమన్లు, అరబ్బులు కూడా ఈ పద్ధతి వాడారు.  

చర్మాలను ఎలా  ఒలిచేవాళ్లు? 
ఓ ప్రత్యేక పద్ధతిలో జంతువుల చర్మాలను ఒలిచేవారు. ఆ తర్వాత చర్మాన్ని కొన్నిరోజులు పాతి పెట్టేవారు. తర్వాత దానిని తీసి పదును లేని కత్తితో రాసి వెంట్రుకలను తొలిగించేవారు. ఆ తర్వాత చర్మాన్ని తిప్పి లోపలి భాగంవైపు ముక్కు, మూతి, కళ్లు, చెవులు లాంటి ఇతర రంధ్రాలుండే ప్రాంతాలను కుట్టేసేవారు.4 కాళ్లలో మూడింటిని కట్టేసేవారు. నాలుగో కాలును గాలి ఊదేందుకు, తీసేందుకు వాడేవారు. చర్మంలోపల తారు లాంటి పదార్థాన్ని పోసి పూర్తిగా అంటుకునేవరకు ఊపేవారు. వాడనప్పుడు తోలును ఎండబెట్టి ఉంచేవారు. వాడాలనుకున్నప్పుడు తోలుకు సున్నితత్వాన్ని పెంచడానికి నీళ్లలో నానబెట్టేవారు.    

నదులను   ఎలా దాటేవాళ్లు? 
చర్మం బెలూన్‌లో గాలి ఊదాక తమకు తాముగా ఆ బెలూన్‌తో పాటు నదిలో దూకేవారు. ఒకవైపు కాలుతో, మరోవైపు చిన్న తెడ్డుతో నీటిని వెనక్కి తోస్తూ ముందుకెళ్లేవారు. జంతు చర్మం బెలూన్‌ మాములూగానే గుండ్రంగా ఉంటుంది. దూకగానే పడిపోయే అవకాశం ఉంటుంది. అయితే సాధన చేస్తూ చేస్తూ ఆ చర్మం బెలూన్‌ సాయంతో ఈదడం నేర్చుకునేవారు. వీటిపైన ఇతర ప్రయాణికులను, చిన్న చిన్న వస్తువులు, సరుకును కూడా రవాణా చేసేవారు. ప్రయాణికులను తీసుకెళ్లేటప్పుడు రెండు, మూడు చర్మం బెలూన్‌లను ఒక చిన్న సైజు తెప్పలా చేసి వాడేవారు.      

మనదేశంలో  వాడేవాళ్లా? 
మనదేశంలోనూ పంజాబ్, కశ్మీర్, సిమ్లాల్లో ఇలాంటి వాటిని వాడేవారు. 1900వ సంవత్సరం తొలినాళ్లలో అమెరికా స్కూల్‌ టీచర్‌ జేమ్స్‌ రికాల్టన్‌ మన దేశాన్ని చూసేందుకు వచ్చినప్పుడు పంజాబ్‌లోని కొండ ప్రాంత గ్రామాల్లో జంతు చర్మాల సాయంతో సట్లెజ్‌ నదిని గ్రామస్తులు దాటడం గమనించాడు. ఆ దృశ్యాలను తన స్టీరియోస్కోపిక్‌ కెమెరాలో బంధించాడు. 

సరుకులనూ నది దాటించేవాళ్లా? 
సరుకు రవాణాకూ ఈ జంతు చర్మాల బెలూన్లను వాడేవారు. ఇంగ్లిష్‌ అన్వేషకుడు విలియం మూర్‌క్రాఫ్ట్‌ మన దేశానికి వచ్చినప్పుడు తనకు సంబంధించిన వ్యక్తులు 300 మంది, 16 గుర్రాలు, కంచర గాడిదలు, దాదాపు 7,400 కిలోల వివిధ రకాల బ్యాగులను 31 మంది తమ జంతు చర్మాల సాయంతో సట్లెజ్‌ నదిని దాటించారని చెప్పాడు. ఈ పనినంతా వాళ్లు కేవలం గంటన్నరలోనే పూర్తి చేశారన్నాడు. చైనా వాళ్లు కూడా ఇలాంటి జంతు చర్మాలతో చేసిన తెప్పలపై రకరకాల సరుకులను రవాణా చేసేవారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top