
హెచ్‌సీయూ భూములపై వివాదం నేపథ్యంలో ప్రత్యామ్నాయం
439.15 ఎకరాల భూసేకరణకు సన్నాహాలు
కలెక్టర్ ఆదేశాలతో ప్రతిపాదిత సర్వే నంబర్లు నిషేధిత జాబితాలో..!
త్వరలో భూసేకరణ నోటిఫికేషన్?
సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా కంచ గచ్చిబౌలి భూముల్లో ఐటీ పార్కు అభివృద్ధి ప్రణాళికలు వివాదాస్పదంగా మారిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయం వైపు దృష్టి సారించినట్లు తెలుస్తోంది. కంచ గచ్చిబౌలికి సమీపంలోని శేరిలింగంపల్లి మండలం గోపన్‌పల్లిలో భూసేకరణ కోసం సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.
తెలంగాణ పారిశ్రామిక మౌలికవసతుల కల్పన సంస్థ (టీజీఐఐసీ) ఏర్పాటు చేసే ఐటీ పార్కుతోపాటు సంబంధిత రంగాల కోసం పార్కులను ఏర్పాటు చేసేందుకు భూసేకరణ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ మేరకు రంగారెడ్డి జిల్లా రెవెన్యూ అధికారులు రెండ్రోజుల క్రితమే భూసేకరణ ప్రక్రియ సన్నాహాలు ప్రారంభించారు.
భూసేకరణకు అవసరమైన సర్వే నంబర్లను రెవెన్యూ రికార్డుల్లో నిషేధిత ఆస్తుల జాబితాలో చేర్చాలని ఈ ఏడాది ఫిబ్రవరిలో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ శేరిలింగంపల్లి ఆర్డీవోకు లేఖ రాశారు. దీంతో గోపన్‌పల్లిలోని సర్వే నంబర్ 127 నుంచి 173, 263 నుంచి 286 సర్వే నంబర్ల పరిధిలోని 439.15 ఎకరాలను ఆర్డీవో నిషేధిత జాబితాలో చేర్చారు.
త్వరలోనే భూసేకరణకు సంబంధించి నోటిఫికేషన్ కూడా విడుదలయ్యే అవకాశమున్నట్లు సమాచారం. అయితే గోపన్‌పల్లిలో 439.15 ఎకరాల్లో ఐటీ పార్కు ఏర్పాటు ప్రతిపాదనలపై టీజీఐఐసీ ఎండీ విష్ణువర్దన్‌రెడ్డిని ‘సాక్షి’సంప్రదించగా అలాంటి ప్రతిపాదన ఏదీ తమ వద్దని లేదని వివరణ ఇచ్చారు.