వివాదాల్లో ఖాకీలు: ఏడాదిలో 17 మంది ఎస్సైలపై వేటు..

Aligations On Police Department In Nalgonda - Sakshi

పోలీసులు సివిల్‌ వివాదాల్లో తలదూరుస్తున్నారు. ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులు చర్యలు చేపడుతున్నా.. తీరు మారడం లేదు. ఉమ్మడి జిల్లాలో ఏడాది కాలంలో ఒక ఏసీపీ, ఓ సీఐ, 17 మంది ఎస్సైలు, 10 మంది వరకు కానిస్టేబుళ్లపై చర్యలు చేపట్టినా వ్యవస్థలో మార్పు రావడం లేదు.

సాక్షి, నల్లగొండ: శాంతిభద్రతల పరిరక్షణలో పారదర్శకంగా వ్యవహరించాల్సిన కొందరు పోలీస్‌ అధికారులు పక్కదారి పడుతున్నారు. రాజకీయ ఒత్తిళ్లతో భూవివాదాలు, సెటిల్‌మెంట్లు, ఇసుక మాఫియాతో బేరసారాలు సాగించి శాఖకే మచ్చ తీసుకువస్తున్నారు. కేసులను నీరుగార్చే ప్రయత్నం చేశారనే ఆరోపణలతో పలువురు పోలీసులు సస్పెన్షన్‌కు గురికాగా, అత్యాచారం, హత్య, లాకప్‌డెత్‌ వంటి కేసుల్లో చిక్కుకుని మరికొందరు సిబ్బంది ఉద్యోగాలే పోగొట్టుకున్నారు.

ఒక్క నల్లగొండ జిల్లాలోనే 11 మంది పోలీసులపై అధికారులు చర్యలు తీసుకున్నారు. గతంలోనే 9మందిపై చర్యలు చేపట్టగా.. భూవివాదాల్లో జోక్యం చేసుకున్నందుకు సోమవారం డిండి, పెద్దవూర ఎస్సైలపై చర్యలు చేపట్టారు. సూర్యాపేట జిల్లాలో ముగ్గురు ఎస్సైలు, యాదాద్రి భువనగిరి జిల్లాలో సీఐతో సహా మరో ఇద్దరు ఎస్సైలపై ఇటీవలికాలంలో వేటు పడింది.  

అత్యాశ.. అత్యుత్సాహం.. నిర్లక్ష్య వైఖరి
వివిధ కేసుల్లో పక్కాగా వ్యవహరించాల్సిన పోలీసులు అత్యుత్సాహం చూపుతున్నారు. ఇదే వారిని చిక్కుల్లో పడేస్తోంది. ఆర్థికంగా త్వరగా సెటిల్‌ కావాలన్న అత్యాశ, రాజకీయ నాయకుల కనుసన్నల్లో ఉంటే బాగుంటుందన్న ఆలోచనలు, తద్వారా వారి ఒత్తిడితో వివిధ కేసుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో ఏకంగా ఉద్యోగాలకే ఎసరు వస్తోంది. కొంతమంది సిబ్బంది ఉద్యోగాలు కోల్పోగా.. మరికొంత మందిని ఉన్నతాధికారులు ఆ పోస్టుల నుంచి తొలగించి వెకెన్సీ రిజర్వులో (వీఆర్‌) పెట్టారు.

నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలం కొప్పోలులో బాలిక మరణానికి సంబంధించిన కేసును నీరుగార్చే ప్రయత్నం చేశారని దళిత సంఘాలు ఆందోళన చేయడంతో అక్కడి ఎస్సైని ఎస్పీ రంగనాథ్‌ విధుల నుంచి తప్పించారు. పీఏపల్లి మండలం గుడిపల్లి ఎస్సైని భూవివాదం వ్యవహారంలో సస్పెండ్‌ చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో మరియమ్మ లాకప్‌డెత్‌ కేసులో అడ్డగూడూరు ఎస్సై, ఇద్దరు కానిస్టేబుళ్లను ఉన్నతాధికారులు సర్వీసు నుంచి తొలగించారు.

సివిల్‌ వివాదాల్లో జోక్యం వద్దంటున్నా..
సివిల్‌ వివాదాల్లో మితిమీరిన జోక్యమే ఎస్సైలను ఇబ్బందుల్లో పడేస్తోంది. ల్యాండ్‌ సెటిల్‌మెంట్లలో పోలీసుల జోక్యంపై బాధితులు నేరుగా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో విచారణ జరిపి చర్యలు చేపడుతున్నారు. దీనికి తోడు ఇసుక దందా­లోనూ రాజకీయ నాయకులకు అనుగుణంగా వ్యవహరిస్తూ ఇబ్బందుల్లో పడుతున్నారు. మిర్యాలగూడ, దేవరకొండ, నకిరేకల్, మునుగోడు, ఆలేరు, సూర్యాపేట నియోజకవర్గాల పరిధిలోని మండలాల్లోనే ఈ ఘటనలు ఎక్కువగా చోటుచేసుకుంటున్నాయి.

► నల్లగొండ జిల్లాలోని నేరెడుగొమ్ము, గుర్రంపోడు, మర్రిగూడ, చండూరు, నాంపల్లి, నిడమనూరు, డిండి, పెద్దవూర ఎస్సైలను భూవివాదాలు, ఇతర ఆరోపణలతో వీఆర్‌లో పెట్టారు. 
► యాదాద్రి భువనగిరి జిల్లాలో అవినీతి, ఆర్థిక లావాదేవీలు, సెటిల్‌మెంట్ల ఆరోపణలతో నాలుగు నెలల కిందట ఆలేరు ఎస్సై, రామన్నపేట సీఐ, ఎస్సైలను వీఆర్‌లో పెట్టారు. మరియమ్మ లాకప్‌డెత్‌ కేసులో అడ్డగూడూరు ఎస్‌ఐ, ఇద్దరు కానిస్టేబుళ్లను సర్వీసు నుంచి తొలగించగా చౌటుప్పల్‌ ఏసీపీని అటాచ్‌ చేశారు.
► సూర్యాపేట జిల్లాలో గడిచిన ఆరు నెలల కాలంలో వివిధ ఆరోపణలతో నేరేడుచర్ల, మఠంపల్లి, ఆత్మకూర్‌ ఎస్‌ఐలను జిల్లా పోలీసు కార్యాలయానికి అటాచ్‌ చేశారు. మరో 9 మంది కానిస్టేబుళ్లను అటాచ్‌ చేయగా, సూర్యాపేట రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌లో పనిచేస్తున్న ఓ కానిస్టేబుల్‌ను సస్పెండ్‌ చేశారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top