
యాదగిరిగుట్ట/భువనగిరి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని మార్చి 4న స్వామివారి అఖండజ్యోతి యాదగిరిగుట్టకు రానున్నట్లు అఖండ జ్యోతి యాత్ర చైర్మన్ ఎం.ఎస్.నాగరాజు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. స్వామివారి అఖండజ్యోతి ఉత్సవ విగ్రహాలు హైదరాబాద్‌లోని ధూల్‌పేటలో గణేశ్ అనే కళాకారుడు తయారు చేస్తున్నారని చెప్పారు. ఈనెల 28న సాయంత్రం అఖండ జ్యోతి పూజ జరుగుతుందని, అదే రోజు రాత్రి బర్కత్‌పురాలోని యాదగిరి భవన్‌కు యాత్ర చేరుకుంటుందని వెల్లడించారు.
మార్చి 1న ఉదయం 10 గంటలకు బర్కత్‌పురా చౌరస్తాలోని యాదగిరి భవన్ నుంచి అఖండజ్యోతి యాత్ర ప్రారంభమై అదే రోజు రాత్రి ఉప్పల్ చౌరస్తాకు చేరుకుంటుందని తెలిపారు. 2న ఉప్పల్ నుంచి బయల్దేరి రాత్రి ఘట్‌కేసర్ కేఎల్‌ఆర్ గార్డెన్‌కు, 3న ఉదయం ఘట్‌కేసర్ నుంచి బయల్దేరి రాత్రి భువనగిరిలోని నల్లగొండ క్రాస్‌రోడ్‌కు వస్తుందన్నారు. అక్కడ రాత్రి బస చేసి 4న ఉదయం భువనగిరి నుంచి బయల్దేరి రాత్రి యాదగిరిగుట్ట చేరుకుంటుందని వివరించారు. యాదాద్రిలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయ అధికారులకు అఖండ జ్యోతిని అప్పగిస్తామని పేర్కొన్నారు.