టెకీల కోసం ఓటు బాట 

2000 startup companies in telangana state - Sakshi

1,500 గ్రేటర్‌ హైదరాబాద్‌లోని ఐటీ కంపెనీలు

9,05,000 ఐటీ, ఐటీఈఎస్‌ ఉద్యోగులు..   

2,000కు పైగా రాష్ట్రంలో ఉండే స్టార్టప్‌ కంపెనీలు

ఐటీ హబ్‌లో ఓటింగ్‌ శాతాన్ని పెంచేందుకు కసరత్తు ఐటీ ఉద్యోగులు ఓటు వేసేలా అవగాహన 
సాక్షి, హైదరాబాద్‌: ఐటీ ఉద్యోగులు పోలింగ్‌కు దూరంగా ఉంటారనే అపవాదును తొలగించే దిశగా ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. ఎన్నికల్లో ఉత్సాహంగా పాల్గొనేందుకు వారికి చేరువలో బూత్‌లను ఏర్పాటు చేస్తోంది. ఓటింగ్‌ రోజున సెలవు వచ్చిది కదా అని ఎంజాయ్‌ చేసే టెకీలను పోలింగ్‌ కేంద్రం వైపు రప్పించేందుకు కార్పొరేట్‌ సంస్థల సహాయాన్ని కూడా తీసుకుంటోంది. రాజధానిలో ఓటింగ్‌శాతం పెంచేందుకు ఈసీతోపాటు బహుళజాతి సంస్థలు కూడా రంగంలోకి దిగాయి. హైదరాబాద్‌లో ఓటు హక్కు ఉన్నవారు తమ ఓటు వినియోగించుకునేలా సంస్థలు ఉద్యోగులను ప్రేరేపిస్తున్నాయి.  

హైరైజ్‌ భవనాల్లో పోలింగ్‌ స్టేషన్లు.. ఎన్నికలపై వర్క్‌ ఫ్రం హోమ్‌ ప్రభావం 

ఆఫీసుల్లో కియోస్క్ లు
ఇప్పటికీ పలు కంపెనీలు వర్క్‌ ఫ్రం హోమ్, హైబ్రిడ్‌ వర్క్‌ మోడల్‌ను అవలంబిస్తున్నాయి. ఈ విధానాలు ఐటీ హబ్‌ నియోజకవర్గాల్లో ఎన్ని కలపై కొంతమేర ప్రభావాన్ని చూపించవచ్చు. ఇంటి నుంచి పనిచేస్తున్న వారు ఓటు హక్కును వినియోగించుకోవడం కష్టమేనని ఓ ఐటీ కంపెనీ ప్రతినిధి అభిప్రాయపడ్డారు. ఎన్నికల ప్రక్రియపై ఉద్యోగులకు సహాయం చేయడానికి త్వరలోనే ప్రత్యేక డ్రైవ్‌లను చేపట్టనున్నట్లు హైదరాబాద్‌ సాఫ్ట్‌వేర్‌ ఎంటర్‌ప్రైజెస్‌ అసోసియేషన్‌ ప్రతినిధి ఒకరు తెలిపారు. ఐటీ కారిడార్‌లోని వివిధ కార్యాలయాల్లో కియోస్‌్కలు ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు.  

ఐటీ హబ్‌లో పెరిగిన ఓటర్లు.. 
ఐటీ కేంద్రాలైన మణికొండ, నానక్‌రాంగూడ, నార్సింగి, ఉప్పల్, మాదాపూర్, గచ్చిబౌలి, కొండాపూర్, మియాపూర్‌ వంటి ప్రాంతాలు శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్, కూకట్‌పల్లి, ఉప్పల్‌ నియోజకవర్గాల పరిధిలోకి వస్తాయి. ఈ ప్రాంతాల్లో పోలింగ్‌ శాతాన్ని పెంచేందుకు సంస్థలు ప్రత్యేక కార్యాచరణను రూపొందిస్తున్నాయి. రాష్ట్రంలోనే అత్యధిక ఓటర్లున్న శేరిలింగంపల్లి నియోజకవర్గంలో ఐటీ ఉద్యోగుల సంఖ్య కూడా గణనీయంగా ఉంది. ఈ ఓటర్లు ఎటువైపు మొగ్గుచూపితే.. ఆ పార్టీ విజయతీరాలకు చేరుతుంది. ఈ నేపథ్యంలో టెకీలను పోలింగ్‌ స్టేషన్లకు రప్పించేందుకు అన్ని రాజకీయ పార్టీలు ప్రత్యేక కార్యాచరణను రూపొందిస్తున్నాయి. వారిని పోలింగ్‌ కేంద్రానికి రప్పించేలా ఏర్పాటు చేస్తున్నాయి. 

ఓటర్ల నమోదుపై ప్రత్యేక దృష్టి 
హైదరాబాద్‌ అంటే మినీ ఇండియా. తెలుగు రాష్ట్రాల నుంచే కాదు ఇతర రాష్ట్రాల ప్రజలు కూడా ఇక్కడ స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. వారిలో చాలామందికి స్వస్థలాల్లోనే ఓటు హక్కు ఉంటుంది. ఇక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకునే ఉద్యోగులు స్థానికంగా ఓటు హక్కును నమోదు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఐటీ కంపెనీలూ ఓటర్ల నమోదుపై ప్రత్యేక దృష్టి సారించాయి.

కనీసం మూడు నెలలపాటు ఇక్కడ పనిచేసే ఉద్యోగులు కచ్చితంగా ఓటు నమోదు చేసుకునేలా అవగాహన కల్పించాయి. ఆ తర్వాత బదిలీపై వెళితే ఓటును సంబంధిత నియోజకవర్గానికి మార్పు చేసుకునే వెసులుబాటు కల్పిస్తున్నాయి. దీనికి అనుగుణంగా ఓటరు కార్డులో చిరునామాలను అప్‌గ్రేడ్‌ చేయడం వంటి సమస్యలను పరిష్కరించేందుకు సాయం అందిస్తున్నాయి. 

హైరైజ్‌ భవనాల్లో పోలింగ్‌ స్టేషన్లు..
‘లెట్స్‌ ఓట్‌’ అనే స్వచ్ఛంద సంస్థ గేటెడ్‌ కమ్యూనిటీలు, హైరైజ్‌ భవనాలు, విద్యా సంస్థలతోపాటు ఫేస్‌బుక్, ఎక్స్, టెలిగ్రాం వంటి సామాజిక మాధ్యమాల్లో అవగాహన కార్యక్రమాలు చేపడుతోంది. ఓటర్‌ హెల్ప్‌లైన్, సీవిజిల్‌ వంటి మొబైల్‌ యాప్‌లపై ప్రచారం చేస్తోంది. రాబోయే ఎన్నికల్లో ఓటింగ్‌ పెరగకపోయినా.. దీర్ఘకాలంలో ఇది ప్రయోజనాన్ని చేకూరుస్తుందని ఓ ప్రతినిధి చెప్పారు. మరోవైపు, ఎన్నికల సంఘం గ్రూప్‌ హౌసింగ్‌ సొసైటీలు, కమ్యూనిటీ సెంటర్లు, హైరైజ్‌ భవనాల్లో పోలింగ్‌ స్టేషన్లను ఏర్పాటు చేసే అంశంపై కసరత్తు చేస్తోంది. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top