కాలేజీకి వెళ్లాల్సిన కొడుకు కాటికి..! | 10th class student ends life in nirmal district | Sakshi
Sakshi News home page

కాలేజీకి వెళ్లాల్సిన కొడుకు కాటికి..!

Jun 5 2025 1:36 PM | Updated on Jun 5 2025 1:36 PM

10th class student ends life in nirmal district

స్నేహితులతో సరదాగా గడిపేందుకు ఏసీసీ క్వారీకి..

స్నానానికి క్వారీలోకి దిగిన ఇద్దరు స్నేహితులు

నీట మునిగి ఒకరు మృత్యువాత 

 

మంచిర్యాలక్రైం: మరొక్క రోజు గడిస్తే కొడుకు కాలేజీకి వెళ్తాడని తల్లిదండ్రులు అంతా సిద్ధం చేశారు. పదో తరగతి పూర్తి చేసిన తనయుడిని హైదరాబాద్‌లోని ప్రైవేటు ఇంటర్మీడియట్ కళాశాలలో చేర్పించేందుకు ఫీజు కూడా చెల్లించారు. స్నేహితులతో కలిసి సరదాగా గడిపేందుకు ఏసీసీ క్వారీకి వెళ్లిన విద్యార్థి.. స్నానానికి క్వారీలోకి దిగి మృత్యువాత పడ్డాడు. కాలేజీకి వెళ్తాడనుకుంటే కనిపించకుండా పోయాడంటూ తల్లిదండ్రులు రోదించిన తీరు అక్కడున్న వారికి కలిచివేసింది. ఈ సంఘటన మంచిర్యాల పోలీసుస్టేషన్‌ పరిధిలోని ఏసీసీ క్వారీ వద్ద చోటు చేసుకుంది.

ఎస్సై తిరుపతి, విద్యార్థి కుటుంబ సంభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మంచిర్యాలలోని జాఫర్‌నగర్‌లో ప్రైవేటు బ్యాంకు ఉద్యోగి సాదుల ప్రసాద్‌ నివాసం ఉంటున్నాడు. ఆయన భార్య లావణ్య కోటపల్లి గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పని చేస్తోంది. వీరికి ఇద్దరు కుమారులు హర్షిత్‌ (15), ధనుష్‌ ఉన్నారు. çహర్షిత్‌ను హైదరాబాద్‌లోని పాఠశాలలో చదివించారు. ఇటీవల పదో తరగతి పూర్తి చేయగా ఇంటర్‌ కోసం హైదరాబాద్‌లోని ప్రైవేటు కళాశాలలో చేర్పించారు. ఈ నెల 5న కాలేజీకి వెళ్లాల్సి ఉండగా అన్ని ఏర్పాట్లు చేశారు.

స్నేహితులతో వెళ్లి..
హర్షిత్‌ చిన్ననాటి స్నేహితులు అందరూ పదో తరగతి పూర్తి చేసి వేర్వేరు కళాశాలల్లో చేరారు. గురువారం హైదరాబాద్‌కు వెళ్లాల్సి ఉండడంతో స్నేహితులతో కలిసి సరదాగా గడిపేందుకు మంగళవారం ఏసీసీ క్వారీకి వెళ్లారు. బిర్యానీ పార్టీ చేసుకుని ఫొటోలు దిగారు. స్నానం చేసేందుకు హర్షిత్‌ పాటు మరో స్నేహితుడు క్వారీలోకి దిగారు. హర్షిత్‌ లోతుకు వెళ్లి నీట మునిగి చనిపోయాడు. గమనించిన స్నేహితులు భయంతో బయటకు వచ్చి ఏం చేయాలో తెలియక రోదిస్తూ వెళ్లిపోయారు. 

హర్షిత్‌ రాత్రి వరకు ఇంటికి రాకపోవడంతో తండ్రి ప్రసాద్‌ స్నేహితులను ఆరా తీయగా.. సాయంత్రం క్వారీకి వెళ్లినట్లు తెలిపారు. అక్కడికి వెళ్లి పరిశీలించగా.. స్కూటీ, నీటిమడుగు పక్కనే డ్రెస్, చెప్పులు కనిపించాయి. పోలీసులకు సమాచారం అందించడంతో సీఐ ప్రమోద్‌రావు, ఎస్సై తిరుపతి సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. మంగళవారం రాత్రి కావడంతో బుధవారం ఉదయం గజ ఈతగాళ్లతో గాలించగా çహర్షిత్‌ మృతదేహం లభించింది. కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు. 

క్వారీ ప్రాంతంపై నిఘా పెంచాలి 
ఏసీసీ క్వారీ దట్టమైన అటవీ ప్రాంతం. అత్యంత ప్రమాదకరమైన క్వారీ. పెద్ద పెద్ద నీటి మడుగులు ఉంటాయి. పైగా సెల్‌ఫోన్‌ సిగ్నల్స్‌ కూడా రావు. ఏదైనా ప్రమాదం జరిగితే సమాచారం ఇవ్వడం కష్టమే. ఇంతటి ప్రమాదకరమైన ప్రాంతం వద్ద అధికారులు నిషేధం విధించారు. అయినా సరదాగా గడిపేందుకు, అసాంఘిక కార్యకలాపాలకు ఏసీసీ క్వారీ అడ్డాగా మారిందని పలువురు చర్చించుకుంటున్నారు. ఏసీసీ క్వారీ ప్రాంతంపై నిఘా ఉంచాలని ప్రజలు కోరుతున్నారు.

 

Advertisement
 
Advertisement
Advertisement