బీజేపీ మాస్టర్‌ ప్లాన్‌.. ప్రచార ‘సారథి’ ఈటెల!.. ప్రకటన ఎప్పుడంటే?

Hyderabad: Bjp Plans to Appoint Key Position Etela Rajender - Sakshi

దాదాపుగా ఖరారు చేసిన బీజేపీ అధిష్టానం 

ఈటలకున్న గుర్తింపు, రాజకీయ అనుభవం, కుల సమీకరణలు పరిగణనలోకి.. 

మరింత మంది అసంతృప్త నేతలు బీజేపీలోకి వచ్చే అవకాశాలుంటాయని అంచనా!

సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమాయత్తంలో భాగంగా రాష్ట్రానికి సంబంధించిన కొన్ని కీలక పదవుల భర్తీపై బీజేపీ కసరత్తు ఓ కొలిక్కి వచి్చనట్లు తెలుస్తోంది. నాలుగైదు రోజులుగా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి బీఎల్‌ సంతోష్‌లు ఈ విషయమై చర్చలు జరిపారు. అత్యంత కీలకమైన పార్టీ ప్రచార కమిటీ బాధ్యతలను సీనియర్‌ నేత ఈటల రాజేందర్‌కు కట్టబెట్టాలని దాదాపుగా నిర్ణయించినట్లు సమాచారం.

ఈ మేరకు రెండు, మూడు రోజుల్లోనే అధికారిక ప్రకటన ఉండొచ్చని ఢిల్లీ పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. రాష్ట్రంలో ఈటలకున్న గుర్తింపు, రాజకీయ అనుభవం, కుల సమీకరణల ఆధారంగా..ప్రచార బాధ్యతలు ఆయనకు అప్పగిస్తేనే అధికార బీఆర్‌ఎస్‌ను ఎదుర్కోగల మని బీజేపీ పెద్దలు భావిస్తున్నట్లు చెబుతు న్నారు. ఈటలకు కీలక బాధ్యతలు ఇస్తే బీఆర్‌ఎస్‌ నుంచి మరింత మంది అసంతృప్త నేతలు బీజేపీలోకి వచ్చే అవకాశాలు కూడా ఉంటాయ ని అంచనా వేస్తున్నట్టు సమాచారం. నిజానికి తనకు పార్టీ అధ్యక్ష బాధ్యతలు ఇవ్వాలని ఈటల కోరుతున్నప్పటికీ, వివిధ సమీకరణలు, పార్టీలో కొంతమంది నుంచి వ్యక్తమైన అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని ప్రచార కమిటీ బాధ్యతలు అప్పగిస్తున్నట్టు తెలిసింది. దీనిపై ఇప్పటికే ఈటలకు పెద్దలు సమాచారమిచ్చారని, దీనికి ఆయన కూడా అంగీకారం తెలిపినట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఈటలను శుక్రవారం ఢిల్లీకి పిలిపించారని ప్రచారం జరిగినా, ఆయన గౌహతి వెళ్లినట్లుగా ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి.

అధ్యక్షుడి మార్పుపై ఎడతెగని చర్చలు..
అత్యంత కీలకమైన పార్టీ అధ్యక్ష బాధ్యతల మార్పుపైనా బీజేపీ పెద్దలు ముమ్మర కసరత్తు చేస్తున్నారు. బండి సంజయ్‌నే కొనసాగించాలని పారీ్టలోని ఓ వర్గం కోరుతుంటే.. ఎన్నికలను, అధికార బీఆర్‌ఎస్‌ను సమర్థంగా ఎదుర్కోవాలంటే మార్చడమే ఉత్తమమని మరికొంతమంది నేతలు చెబుతున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో ఒకవేళ సంజయ్‌ను పక్కన పెడితే ఎవరిని అధ్యక్షుడిగా నియమించాలన్న దానిపైనా బీజేపీ జాతీయ నాయకత్వం సమాలోచన చేస్తోంది. ఈ క్రమంలో మొన్నటివరకు ఈటల పేరును పరిశీలించినా, చివరకు ప్రచార కమిటీ బాధ్యతలు అప్పగించాలని పెద్దలు నిర్ణయించినట్లు తెలిసింది.

దీంతో పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ పేరు ముందుకు వచ్చినట్లు సమాచారం. వివాదాలకు దూరంగా ఉండటం, అందరినీ కలుపుకొనే తత్వం, పార్టీ అప్పగించే బాధ్యతలను పూర్తిస్థాయిలో నిర్వర్తించడం, సామాజిక అంశాలను దృష్టిలో పెట్టుకొని ఆమెను పరిగణనలోకి తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఆమెకు అధ్యక్ష బాధ్యతలు కట్టబెట్టే అంశంపై ఇప్పటికే రాష్ట్ర ఇన్‌చార్జిల నుంచి అభిప్రాయ సేకరణ జరిపినట్లు చెబుతున్నారు. అన్నీ ఓకే అయితే అధ్యక్షుడి మార్పుపై సైతం రెండు, మూడ్రోజుల్లోనే ప్రకటన ఉండొచ్చని అంటున్నారు. అదే జరిగితే ఇప్పటివరకు రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి కృషి చేసిన సంజయ్‌కు కేంద్రమంత్రి పదవి ఇవ్వడం ద్వారా సముచిత గౌరవం కలి్పంచవచ్చని తెలుస్తోంది. 

చదవండి: ‘బీ’టెక్‌ బేరం షురూ!

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top