తొలిసారి తిరువారూర్‌కు సీఎం స్టాలిన్‌

Stalin Went To Thiruvarur First Time As CM - Sakshi

అవ్వ, తాత, తండ్రికి ఘన నివాళి

ప్రసూతి ఆస్పత్రి ప్రారంభించిన ముఖ్యమంత్రి స్టాలిన్‌

సాక్షి, చెన్నై : ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ రెండురోజుల పర్యటనలో భాగంగా బుధవారం తిరువారూర్‌కు చేరుకున్నారు. కుటుంబ సమేతంగా తన తండ్రి దివంగతనేత కరుణానిధి జన్మస్థలం తిరుకువళైకు వెళ్లారు. అక్కడి గృహంలోని అవ్వ, తాత, తండ్రి విగ్రహాలకు నివాళులర్పించారు. సీఎంగా పగ్గాలు చేపట్టిన అనంతరం తొలిసారిగా తన తండ్రి జన్మస్థలం తిరుకువళైకు సతీమణి దుర్గా స్టాలిన్, తనయుడు, ఎమ్మెల్యే ఉదయనిధి స్టాలిన్‌తో పాటుగా ఇతర కుటుంబ సభ్యులు వెళ్లారు. తిరుచ్చిలో సీఎంకు పార్టీ నేతలు, అధికారులు ఆహ్వానం పలికారు. అక్కడ ప్రభుత్వ వైద్యకళాశాల, ఆస్పత్రి ఆవరణలో శిశుసంక్షేమ, ప్రసూతి వైద్యకేంద్రాన్ని ప్రారంభించారు.

దీన్ని రూ.12 కోట్లతో నిర్మించారు. అక్కడి వసతులను ఆరోగ్యమంత్రి సుబ్రహ్మణ్యన్, అధికారులు సీఎంకు వివరించారు. ఈసందర్భంగా కరోనా టీకాలు వేయడంలో తొలిస్థానంలో నిలిచిన కాట్టూరు గ్రామ సర్పంచ్‌ విమల ప్రభాకర్, తిరువారూర్‌జిల్లా కలెక్టర్‌ గాయత్రిని సత్కరించారు. అలాగే తనను కలిసేందుకు వచ్చిన కాంట్రాక్టు పారిశుద్ధ్య కార్మికులతో మాట్లాడి నుంచి వినతిపత్రాలు స్వీకరించారు. కార్యక్రమంలో మంత్రి కేఎన్‌ నెహ్రూ, ఆరోగ్య కార్యదర్శి రాధాకృష్ణన్‌ తదితరులు పాల్గొన్నారు.

నాటి జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయ్‌..
కుటుంబ సమేతంగా తిరుకువళైకు వెళ్లిన సీఎం స్టాలిన్‌ అక్కడ తన తండ్రి ఇంటికి వెళ్లారు. తన తండ్రి బాల్యంతో పాటుగా రాజకీయ పయనానికి ముందుగా పూర్తి కాలం ఇదే ఇంట్లో ఉన్న విషయాన్ని మనవళ్లు, మనువరాళ్ల దృష్టికి తెచ్చే రీతిలో సీఎం స్టాలిన్‌ జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను తిలకించారు.  

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top