పెరటాసిలో..పెరుమాళ్ల సేవ | - | Sakshi
Sakshi News home page

పెరటాసిలో..పెరుమాళ్ల సేవ

Sep 20 2026 6:54 AM | Updated on Sep 20 2026 6:54 AM

● మార్మోగిన గోవింద నామం ● భారీగా భక్తుల సందడి ● శ్రీవారి సన్నిధిలో విశిష్ట పూజలు

వైష్ణవాలయాల్లో ప్రత్యేక పూజలు

రాష్ట్రంలో పెరటాసి శోభ మొదలైంది. ఈ మాసంలో వచ్చే తొలి శనివారం పర్వదినం సందర్భంగా ప్రజలు పెరుమాళ్ల పూజాసేవలతో తరించారు. రాష్ట్రంలోని అన్ని వైష్ణవాలయాల్లో ప్రత్యేక పూజలు జరిపారు.

సాక్షి, చైన్నె : పెరటాసి మాసాన్ని తమిళులు అతి పవిత్రమైనదిగా పరిగణిస్తారు. ఈ నెలరోజులపాటూ మాంసాహారాన్ని ముట్టకుండా శాఖాహారాన్ని మాత్రమే భుజిస్తూ వ్రతాలు ఆచరిస్తారు. ఆలయాల్లో స్వామివారికి విశిష్టమైన సేవలను నిర్వహిస్తారు. అయితే పెరటాసి మాసమంతా పవిత్రమైనదైనా శనివారాలను మరీ ప్రత్యేకంగా భావిస్తూ.. భక్తిశ్రద్ధలతో గడుపుతారు. శుక్రవారం పెరటాసి మాసం ప్రారంభం కాగా ఇది తొలి శనివారం కావడంతో వైష్ణవాలయాలకు భక్తజనం పోటెత్తడం సహజం. ఈనేపథ్యంలో ఈ మాసంలోని మొదటి శనివారం రాష్ట్రంలోని పలు నగరాలు,జిల్లాలతో పాటుగా చైన్నెలోని ప్రసిద్ధ పెరుమాళ్‌ ఆలయాల్లో ఉదయం నుంచే ప్రత్యేక అభిషేకం, అలంకరణ, పూజా కార్యక్రమాలు ఘనంగా చేపట్టారు. పెద్దసంఖ్యలో భక్తులు బారులుదీరి స్వామివారిని దర్శించుకున్నారు. ట్రిప్లికేన్‌లోని ప్రసిద్ధ పార్థసారథి ఆలయానికి వేకువజాము నుంచే భక్తులు పోటెత్తారు. ఆలయ నిర్వాహకులు స్వామివారికి, ఉత్సవమూర్తులకు నైవేద్యాలు, అలంకరణలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేపట్టారు.

శ్రీవారి ఆలయంలో..

చైన్నె టీ నగర్‌ వెంకటనారాయణ రోడ్డులోని తిరుమల శ్రీ వారి ఆలయంలో స్వామి వారికి ప్రత్యేక తిరుమంజనంతో పాటుగా విశిష్ట పూజలు జరిగాయి. స్వామి అమ్మవార్లను అలంకరించి నైవేద్యాలు సమర్పించారు. భక్తులు బారులుదీరి స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. ఇక షావుకారు పేటలోని చెన్నకేశవ పెరుమాళ్‌ ఆలయంలో ప్రత్యేక తులసి అర్చన నిర్వహించారు. పురసైవాక్కం శ్రీనివాస పెరుమాళ్‌ ఆలయంలో ప్రత్యేక పుష్పాలంకరణలతో పాటుగా గోపూజ వైభవంగా జరిగింది. భక్తుల గోవిందా గోవిందా నామస్మరణతో ఆలయ ప్రాంగణం మార్మోగింది. ఇక నాలుగు రూపాల్లో (నిలబడి, కూర్చుని, పడుకుని, నరసింహ రూపంలో) కొలువై ఉన్న తిరునీర్మలై పెరుమాళ్‌ ఆలయంలో ప్రత్యేక పుష్పాలంకరణలతో పూజలు జరిగాయి. చైన్నె, చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఇక తిరుచ్చి శ్రీరంగంలోని రంగనాథస్వామి ఆలయం, కంచి వరద రాజ పెరుమాళ్‌ ఆలయం, తంజావూరులోని ప్రసన్న వెంకటేశ పెరుమాళ్‌, పుదుకోట్టైలోని వరదరాజ పెరుమాళ్‌, అళగర్‌ మలైలోని అళగర్‌ పెరుమాల్‌ ఆలయం, ఆలంగాడులోని వెంకటాచలపతి పెరుమాళ్‌ ఆలయాల్లో ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహించారు. భక్తులు ఉదయం నుంచి రాత్రి వరకు స్వామి వారిని దర్శించి తరించారు. ఇక, ఇళ్లలోనూ పూజలు జరిగాయి. ప్రసాదాలను ఇరుగు పొరుగు వారికి పెరమాల్‌ భక్తులు పంచి పెట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement