మళ్లీ హిందువుగా మారిన వ్యక్తికి ఎస్సీ సర్టిఫికెట్‌ | - | Sakshi
Sakshi News home page

మళ్లీ హిందువుగా మారిన వ్యక్తికి ఎస్సీ సర్టిఫికెట్‌

Sep 20 2026 6:48 AM | Updated on Sep 20 2026 6:48 AM

● హైకోర్టు ఆదేశం

సాక్షి, చైన్నె: క్రైస్తవ మతం నుండి తిరిగి హిందూ మతానికి మారిన వ్యక్తిని ఆ సమాజం అంగీకరించినందున, ఆయనకు ఎస్సీ కుల ధృవీకరణ పత్రం పొందే పూర్తి హక్కు ఉందని మద్రాస్‌ హైకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు, ఆ వ్యక్తి క్రైస్తవుడని , ఆయన కుల ధృవీకరణ పత్రం సరైనది కాదంటూ జిల్లా విజిలెన్స్‌ కమిటీ జారీ చేసిన ఉత్తర్వులను కోర్టు రద్దు చేసింది.

కేసు వివరాలు..

తిరువణ్ణామలైకు చెందిన రవికుమార్‌ అనే వ్యక్తి, షెడ్యూల్డ్‌ కులాల(ఎస్సీ) రిజర్వేషన్‌ ఆధారంగా కస్టమ్స్‌ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగంలో చేరి అసిస్టెంట్‌ కమిషనర్‌గా సేవలందించారు. మే నెలలో ఆయన పదవీ విరమణ పొందవలసి ఉండగా, ఆయన కుల ధృవీకరణ పత్రంపై విచారణ చేపట్టారు. విచారణ ముగిసిన తర్వాత జిల్లా విజిలెన్స్‌ కమిటీ వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. పలు కారణాలు చూపుతూ, ఆయన క్రైస్తవుడని, ఆయన ఎస్సీ కుల ధృవీకరణ పత్రం నిజమైనది కాదని ఉత్తర్వులు జారీ చేశారు.

హైకోర్టు

హైకోర్టు తీర్పు – న్యాయమూర్తి వ్యాఖ్యలు

జిల్లా విజిలెన్స్‌ కమిటీ ఉత్తర్వులను సవాలు చేస్తూ, దాని ఆధారంగా కస్టమ్స్‌ శాఖ తదుపరి చర్యలు తీసుకోకుండా నిరోధించాలని కోరుతూ రవికుమార్‌ చైన్నె హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను హైకోర్టు న్యాయమూర్తి డి. భరత చక్రవర్తి విచారించి కీలక తీర్పు వెలువరించారు. మతం మారిన వ్యక్తి తిరిగి హిందూ మతంలోకి వచ్చినప్పుడు ఆ సమాజం అతన్ని అంగీకరిస్తే, అతనికి ఎస్సీ సర్టిఫికేట్‌ పొందే అర్హత ఉంటుందని స్పష్టం చేస్తూ జిల్లా కమిటీ ఉత్తర్వులను రద్దు చేశారు. అలాగే పిటిషనర్‌ హిందూ దేవుళ్లను పూజించారా, హిందూ సమాజం అతన్ని అంగీకరించిందా? అని జిల్లా కమిటీ పరిశీలిస్తే అది సరైనదేనని పేర్కొంటూ, అయితే, మంచి ఛాయతో, ఎత్తుగా, వంకర జుట్టుతో, మంచి దేహదారుఢ్యంతో, తమిళం–ఇంగ్లీష్‌ ధారాళంగా మాట్లాడుతున్నాడనే అనేక కారణంతో అతను క్రైస్తవుడని నిర్ణయించడం పూర్తిగా అసంబద్ధం , తప్పు అని న్యాయమూర్తి తన తీర్పులో తీవ్రంగా తప్పుబట్టారు. అలాగే, పిటిషనర్‌ కుల ధృవీకరణ పత్రంపై నిబంధనల ప్రకారం మళ్ళీ సమగ్ర విచారణ జరిపి , ఎనిమిది వారాల్లోగా తగిన ఉత్తర్వులు జారీ చేయాలని జిల్లా కమిటీని ఆదేశిస్తూ న్యాయమూర్తి ఈవిచారణను ముగించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement