– జస్టిస్ సుందర్ మోహన్ వ్యాఖ్య
సాక్షి, చైన్నె: చైన్నెకి చెందిన గోయల్ (80) గృహోపకరణాల తయారీ వ్యాపారం చేస్తుండేవారు. కాగా తన కుమారుడిపై ఫిర్యాదు చేస్తూ ఆయన చైన్నె కుటుంబ సంక్షేమ కోర్టులో కేసు వేశారు. తనకు సొంతమైన రెండు ఇళ్లూ రాయించుకున్న కుమారుడు సూరజ్, ముసలితనంలో ఆదరించకుండా వదిలేశాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దృష్ట్యా, తనకు నెలవారీ పోషణ ఖర్చుల కింద భృతి చెల్లించేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్ ద్వారా కోర్టును విన్నవించారు. ఈ కేౖసును విచారించిన కుటుంబ సంక్షేమ కోర్టు, గోయల్‌కు ప్రతినెల రూ.75,000 పోషణ ఖర్చు కింద సూరజ్ చెల్లించాలని ఆదేశించింది. దీన్ని సవాలు చేస్తూ సూరజ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషనన్‌ను శనివారం విచారించిన న్యాయమూర్తి సుందర్ మోహన్ కీలక వ్యాఖ్యలు చేశారు. తన ఇతర ఆస్తుల ద్వారా వస్తున్న అద్దె ఆదాయాన్ని దాచిపెట్టి గోయల్ కుటుంబ సంక్షేమ కోర్టులో కేసు వేశారని, ఈ దృష్ట్యా, పోషణ ఖర్చులను పొందే హక్కు ఆయనకు లేదని స్పష్టంచేశారు. ఈ దృష్ట్యా, గోయల్‌కు ప్రతినెల రూ.75,000 ఇవ్వాలన్న దిగువ కోర్టు ఉత్తర్వులను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. అదేసమయంలో వృద్ధాప్యంలో సీనియర్ కుటుంబ సభ్యులకు అవసరమైన ప్రేమ, ఆదరణ, రక్షణను డబ్బుతో ఎప్పటికీ కొలవలేమని, భర్తీ చేయలేమని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. తండ్రి – కుమారుల మధ్య ఉన్న సమస్యలు రాజీ ద్వారా మాట్లాడుకుని పరిష్కారమై, భవిష్యత్‌లో సత్సంబంధాలు ఏర్పడతాయని తాను ఆశిస్తున్నట్లు అభిప్రాయపడ్డారు.
చెట్టును ఢీకొన్న కారు
అన్నానగర్: కరూర్ జిల్లాలోని వేలాయుధం పాలయం ప్రాంతానికి చెందిన గౌతమ్ (21), కరూర్ జిల్లాలోని ఓ ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలలో మూడవ సంవత్సరం చదువుతున్నాడు. శుక్రవారం, గౌతమ్ తాను చదువుతున్న కరూర్ జిల్లాలోని మోహనూర్ ప్రాంతానికి చెందిన మధుప్రియ, కామిని, అనుసూయ, దేవదర్శినితో కలిసి కారులో కరూర్‌కు తిరిగి వస్తున్నాడు. గౌతమ్ కారు నడుపుతున్నాడు. కరూర్ జాతీయ రహదారిపై ఒక ప్రైవేట్ పాఠశాల ఎదురుగా కారు రావడంతో గౌతమ్ అకస్మాత్తుగా నియంత్రణ కోల్పోయాడని తెలుస్తుంది. ఈ క్రమంలో ఆ కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీ కొట్టింది. కారు ముందు భాగం తీవ్రంగా దెబ్బతింది. కారులో ఉన్న గౌతమ్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మరణించాడు. కారులో ఉన్న విద్యార్థినులు తీవ్రంగా గాయపడ్డారు. మధు ప్రియ ఆసుపత్రికి వెళ్లే మార్గమధ్యంలో మరణించింది. మిగతా ముగ్గురు అత్యవసర చికిత్స పొందుతున్నారు. స్థానిక పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు.
రూ. 50 కోట్ల శ్రీరంగం ఆలయ స్థలం కబ్జా
– డీఎంకే నాయకుడితో సహా ఆరుగురిపై కేసు
సాక్షి, చైన్నె: రూ. 50 కోట్ల విలువైన శ్రీరంగం ఆలయ భూమి, బంగ్లాను నకిలీ పత్రాల ద్వారా అక్రమంగా రిజిస్టర్ చేసుకున్నారన్న ఆరోపణలపై శ్రీరంగం డీఎంకే ఏరియా సెక్రటరీ ఎన్. రామ్‌కుమార్ సహా 6 మందిపై మెట్రోపాలిటన్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆలయ కమిషనర్ శివరామ్‌కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ చర్య తీసుకున్నారు. ఆలయానికి చెందిన ఆస్తి అని తెలిసినప్పటికీ, చట్టపరమైన నోటీసులను బేఖాతరు చేస్తూ అప్పటి సబ్–రిజిస్ట్రార్ ఈ మోసానికి సహకరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇన్‌స్పెక్టర్ కె. షణ్ముగవేల్ ఆధ్వర్యంలో 6 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
సచివాలయానికి వ్యతిరేకంగా సీపీఎం నిరసన
– ప్రాజెక్టును విరమించుకోవాలని డిమాండ్
సాక్షి, చైన్నె: చైన్నెలోని పట్టినంబాక్కంలో కొత్త సచివాలయం, అసెంబ్లీ సముదాయాన్ని ఏర్పాటు చేయాలన్న తమిళనాడు ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సీపీఎం ఆధ్వర్యంలో శనివారం శ్రీనివాసపురం జంక్షన్ వద్ద భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. సుమారు రూ. 1,200 కోట్ల అంచనా వ్యయంతో పట్టినంబాక్కంలో కొత్త సచివాలయాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ ప్రాజెక్టు ఆ ప్రాంతంలో నివసిస్తున్న మత్స్యకారుల జీవనోపాధికి, ఇళ్లకు తీవ్ర ముప్పు కలిగిస్తుందని సీపీఎం ఆరోపించింది. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి. షణ్ముగం నేతృత్వంలో జరిగిన ఈ నిరసనలో దక్షిణ చైన్నె జిల్లా కార్యదర్శి ఆర్. వేల్మురుగన్‌తో పాటు పెద్ద సంఖ్యలో ప్రజలు, పార్టీ సభ్యులు పాల్గొన్నారు. పట్టినాపాక్కంలో సచివాలయాన్ని ఏర్పాటు చేసే ఆలోచనను ప్రభుత్వం విరమించుకోవాలని, మత్స్యకారులకు నాణ్యమైన ఇళ్లు నిర్మించి ఇవ్వాలన్న డిమాండ్‌ను పరిష్కరించాలని కోరారు.
వృద్ధులు


