కొత్త ట్రిబ్యునల్‌తో ఎలాంటి నష్టం లేదు: ఆనంద్‌ | - | Sakshi
Sakshi News home page

కొత్త ట్రిబ్యునల్‌తో ఎలాంటి నష్టం లేదు: ఆనంద్‌

Jun 23 2026 1:16 AM | Updated on Jun 23 2026 1:16 AM

అన్నాడీఎంకే వాకౌట్‌

పళణి పిలుపునకు స్పందించని

కొందరు ఎమ్మెల్యేలు

నాన్‌ మొదల్వన్‌ను నిర్వీర్యం చేయొద్దు: ఉదయ నిధి

తమ పథకాల కొనసాగింపుపై

కృతజ్ఞతలు

సాక్షి, చైన్నె : అసెంబ్లీ సమావేశాల్లో ఉదయం ప్రశ్నోత్తరాల అనంతరం అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణి స్వామి ఓ అంశాన్ని ప్రస్తావించారు. గత సమావేశంలో మేఘదాతులో డ్యాం నిర్మాణానికి వ్యతిరేకంగా తీర్మానం తీసుకొచ్చిన మరుక్షణం, సవరణతో కొత్త ట్రిబ్యునల్‌ అంశాన్ని చేర్చడం చట్ట విరుద్ధమని విమర్శలు చేశారు. సభా హక్కుల ఉల్లంఘన నోటీసు జారీ చేశామని, దీనిపై చర్చ జరగాలని పట్టుబడ్డారు. ఇందుకు స్పీకర్‌ అనుమతి నిరాకరించడంతో అన్నాడీఎంకే సభ్యులు వాకౌట్‌ చేశారు. పళణి స్వామితో పాటుగా మెజారిటీ శాతం ఎమ్మెల్యేలు బయటకు వెళ్లినా, నత్తం విశ్వనాథన్‌, ఎస్పీ వేలుమణి తదితర ఎమ్మెల్యేలు వెళ్లక పోవడంతో ఆ పార్టీలో విభేదాలు మరో మారు అసెంబ్లీ సాక్షిగా ఆవిష్కరించాయి. సభ నుంచి బయటకు వచ్చిన అనంతరం పళనిస్వామి మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. తమిళనాడు అసెంబ్లీ రూల్‌ 220 కింద తాము ఓ హక్కుల ఉల్లంఘన సమస్యను సభ దృష్టికి తీసుకురావడానికి అనుమతి కోరామన్నారు. మేఘదాతు ప్రత్యేక తీర్మానంలో నిబంధనలకు విరుద్ధంగా మధ్యలో కొన్ని సవరణలను చేశారని, దీనిపై చర్చించేందుకు స్పీకర్‌కు ముందే లేఖ ఇచ్చామని పేర్కొన్నారు. అయితే జీరో అవర్‌లో దీనిపై మాట్లాడేందుకు స్పీకర్‌ నిరాకరించడంతో తాము వాకౌట్‌ చేయాల్సి వచ్చిందని స్పష్టం చేశారు. జూన్‌ 18వ తేదీన మేఘాదాతు ముసాయిదా తీర్మానాన్ని మాత్రమే అన్నాడీఎంకే సమర్థిస్తున్నదని, అయితే, జూన్‌ 19న నిబంధన 104 ప్రకారం సభ ముందు ప్రతిపాదించకుండా, మధ్యలో సవరణలు జోడించి తెచ్చిన కొత్త తీర్మానానికి తాము మద్దతు ఇవ్వడం లేదని ప్రకటించారు. కావేరి వివాదంపై ఇప్పటికే ట్రిబ్యునల్‌ తుది తీర్పు ఇచ్చిందని, మళ్లీ కొత్తగా ట్రిబ్యునల్‌ అవశ్యం లేదని వ్యాఖ్యలు చేశారు.

నాన్‌ ముదల్వన్‌ నిర్వీర్యం చేసేందుకు కుట్ర:

ఉదయ నిధి

అసెంబ్లీలో గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రధాన ప్రతి పక్ష నేత ఉదయ నిధి స్టాలిన్‌ ప్రసంగించారు. తమిళనాడులోని విద్యార్థులు, యువత నైపుణ్యాభివృద్ధి కోసం గత డీఎంకే ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన నాన్‌ మొదల్వన్‌ పథకాన్ని ప్రస్తుత ప్రభుత్వం నిర్వీర్యం చేయాలని ప్రయత్నిస్తున్నదని, ఇది భావ్యం కాదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. డీఎంకే హయాంలో అమల్లోకి తెచ్చిన కలైంజ్ఞర్‌ మహిళా హక్కు పథకం, బడులలో అల్పాహార పథకం కొనసాగింపుపై హర్షం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు. గవర్నర్‌ ప్రసంగం ఏమాత్రం గంభీరంగా లేదని కేవలం సోషల్‌ మీడియాలో వచ్చే ఒక రీల్స్‌లా మారి రంగుల డబ్బాగా ఉందని ఎద్దేవా చేశారు. ఈ సమయంలో దేవాలయ నిధులతో కార్‌ పార్కింగ్‌ ఎందుకు? అన్న అంశంగా మాజీ మంత్రి శేఖర్‌ బాబుకు ప్రస్తుత దేవాదాయ శాఖ మంత్రి రమేష్‌ మధ్య వ్యాఖ్యల తూటాలు పేలాయి. దేవాలయాల్లో కనీస సదుపాయాలు లేనప్పుడు, భక్తుల నుంచి సేకరించిన ఆలయ నిధులను విలాసవంతమైన కార్‌ పార్కింగ్‌ ప్రాజెక్టులకు ఎలా కేటాయిస్తారని మంత్రి రమేష్‌ నిలదీశారు. గత ఐదేళ్ల డీఎంకే పాలనలో ఆధ్యాత్మిక రంగంలో కేవలం కాంట్రాక్టర్లకు లాభం చేకూర్చే రీతిలో మారిందని, అందుకే అనవసరపు ప్రాజెక్టులను రద్దు చేస్తున్నామని ప్రకటించారు.

గ్లాసు వర్సెస్‌ బాటిల్‌’ చర్చ

ప్రేమలత ప్రసంగం మధ్యలో శాసనసభలో ఒక ఆసక్తికరమైన, హాస్యభరి చర్చ చోటుచేసుకుంది. అసెంబ్లీలో సభ్యులకు తాగునీటిని సిల్వర్‌ గ్లాసులలో అందిస్తున్నారని వీటికి బదులుగా పర్యావరణహిత గ్లాస్‌ బాటిళ్లలో నీటిని సరఫరా చేయాలి అని ఆమె కోరారు. ఇందుకు డీఎంకే ఎమ్మెల్యే, మాజీ సీఎం పన్నీరు సెల్వం వెంటనే జోక్యం చేసుకుని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘గ్లాస్‌ బాటిళ్లలో నీరు ఇవ్వాలనే ప్రతిపాదన సరైంది కాదు. సభలో ఎప్పుడైనా సభ్యులకు కోపం వస్తే, ఆ గాజు సీసాలను ఒకరిపై మరకొరు విసురుకునే ప్రమాదం ఉందని వ్యాఖ్యనించడంతో సభలో నవ్వులు విరగబూశాయి. అదే సమయంలో తంగం తెన్నరసు(డీఎంకే ) చమత్కరిస్తూ.. పన్నీరు సెల్వం తన స్వంత అనుభవాల ఆధారంగానే ఈ గాజు సీసాల ముప్పు గురించి మాట్లాడుతున్నారా? అని తెలుసుకోవాలని ఉందని వ్యాఖ్యలు చేయడంతో సభ ఒక్కసారిగా నవ్వులతో నిండిపోయింది. సీఎం విజయ్‌ సైతం నవ్వుతూ కనిపించడం విశేషం. ఇక, తనను ప్రొటోకాల్‌ విషయంలో అవమానించారంటూ చైన్నె మేయర్‌ ప్రియపై టీవీకే ఎమ్మెల్యే పల్లవి ఇచ్చిన ఫిర్యాదును స్పీకర్‌ పరిశీలించి, తక్షణం తీర్పు ఇచ్చేశారు. తెలిసో తెలియక జరిగిన వ్యవహారం అని, ఇక మున్ముందు జరగకుండా చూద్దామని ఆ వివాదాన్ని ముగించారు.

తీర్మానంలో సవరణకు వ్యతిరేకం

అసెంబ్లీలో మంత్రి ఆనంద్‌ మాట్లాడుతూ, మేఘదాతు వివాదంలో కేంద్రం ఏక పక్ష చర్యలను అడ్డుకునేందుకు, కావేరి మిగులు జలాలపై తమిళనాడు హక్కులను కాపాడుకునేందుకు కొత్త ట్రిబ్యునల్‌ డిమాండ్‌ అత్యుత్తమ మార్గంగా వివరించారు.ఈ ట్రిబ్యునల్‌ వల్ల రాష్ట్రానికి ఎలాంటి నష్టం లేదని స్పష్టంచేశారు. మేఘదాతుపై కొత్త ట్రిబ్యునల్‌ ఏర్పాటు చేయాలనే ప్రభుత్వ తీర్మాన ప్రతిపాదనను కొన్ని రాజకీయ పార్టీలు వ్యతిరేకించిన నేపథ్యంలో అసెంబ్లీలో సుదీర్ఘ చర్చ సందర్భంగా మంత్రి ఆనంద్‌ వివరణ ఇచ్చారు. అలాగే మరో మంత్రి ఆదవ్‌ అర్జున మాట్లాడుతూ, కావేరి మేనేజ్‌మెంట్‌ అథారిటీపై తమకు నమ్మకం లేదన్నారు. న్యాయ నిపుణుల సలహా మేరకే కొత్త ట్రిబ్యునల్‌ డిమాండ్‌ను తీర్మానంలో చేర్చినట్లు తెలిపారు. కావేరి వివాదంలో కర్ణాటక తన వ్యూహాన్ని మార్చిందని, వారికి అనుకూలంగా, ప్రాజెక్ట్‌ నివేదిక సమర్పించాల్సిందిగా కావేరి మేనేజ్‌మెంట్‌ అథారిటీ సూచించి ఉందన్నారు. ఈ అథారిటీ ఇలాగే కొనసాగితే మేఘదాతు డ్యాం నిర్మాణానికి పరిస్థితులు దారి తీస్తాయన్నారు. అందుకే ఈ అథారిటీపై నమ్మకం లేదని, అందుకుఏ కొత్త ట్రిబ్యునల్‌ తీర్మానం తెరపైకి తెచ్చామన్నారు. ఇక, అసెంబ్లీ ఆవరణలో డీఎంకే ఎమ్మెల్యే, మాజీ మంత్రి తంగం తెన్నరసు మాట్లాడుతూ, ట్రిబ్యునల్‌ను ఆశ్రయించడమే అత్యుత్తమ మార్గం అని స్పష్టం చేశారు. డీఎండీకే ప్రధాన కార్యదర్శి ప్రేమలత సభలో మాట్లాడుతూ, ఈ వివాదాన్ని కర్ణాటక సీఎంతో స్నేహపూర్వకంగా మాట్లాడి పరిష్కరించాలని సూచించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement