తమిళసినిమా: ఇద్దరు స్టార్ హీరోయిన్ల మధ్య ఈగోనే తొంగి చూస్తుంది కానీ, సఖ్యత, స్నేహం ఉండటం అనేది అరుదు గానే కనిపిస్తుంది. అయితే ఇటీవల ఆ పరిస్థితిలో మార్పు వచ్చిందనే చెప్పవచ్చు. అందుకు చిన్న ఉదాహరణ నటి సమంత, నయనతారలే. వీరిద్దరూ స్టార్ హీరోయిన్లే. ఇద్దరు నిర్మాతలే. అత్యంత భారీ పారితోషికం తీసుకుంటున్నట్లు నటి నయనతార. అదే విధంగా ఇంతకు ముందు తమిళం, తెలుగు భాషల్లో స్టార్ హీరోలతో జత కట్టిన నటి సమంత. కాగా నటి సమంత తాజాగా టైటిల్ పాత్రను పోషించి, సొంతంగా తెలుగులో నిర్మించిన చిత్రం మా ఇంటి బంగారం. నందిని రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రం తమిళంలోనూ ఎంగల్ తంగం పేరుతో ఇటీవల రెండు భాషల్లోనూ విడుదలై సక్సెస్ ఫుల్‌గా ప్రదర్శింపబడుతోంది. దీంతో చిత్ర యూనిట్ ఆనందంతో ఫిదా అవుతున్నారు. పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే మా ఇంటి బంగారం చిత్ర విజయాన్ని పురస్కరించుకుని నటి నయనతార, ఆ చిత్ర కథానాయికి, నిర్మాత సమంతను అభినందనలతో ముంచెత్తారు. ఆమె తన ఇన్ స్ట్రాగామ్ లో పేర్కొంటూ ‘‘ నీ కారణంగా నేను చాలా సంతోషపడ్డుతున్నాను సామ్. అభిమానానికి, విజయానికి నువ్వు అన్ని విధాలుగా పూర్తిగా అర్హురాలివి. మా ఇంటి బంగారం చిత్ర యూనిట్‌కు నా శుభాకాంక్షలు ‘‘ అని పేర్కొన్నారు. ఇప్పుడు నయనతార ట్వీట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. కాగా ఇంతకు ముందు నటి నయనతార సొంతంగా నిర్మించి కథానాయకిగా నటించిన కాత్తువాక్కుల రెండు కాదల్ చిత్రంలో మరో కథానాయికగా నటి సమంత నటించిన విషయం తెలిసిందే. కాగా తదుపరి నటి సమంత రక్త బ్రహ్మాండ అనే వెబ్ సిరీస్‌లో నటించడానికి సిద్ధం అవుతోంది. ఇక నయనతార తమిళం, హిందీ, కన్నడం చిత్రాల్లో నటిస్తూ చాలా బిజీగా ఉన్నారు.
సమంత,
నయనతార


