అన్యాయాలపై చర్యలు తీసుకోండి | - | Sakshi
Sakshi News home page

అన్యాయాలపై చర్యలు తీసుకోండి

Jun 18 2026 1:23 AM | Updated on Jun 18 2026 1:23 AM

● సీఎంకు స్టాలిన్‌ సూచన

సాక్షి,చైన్నె : ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలన్నీ మీడియాలో ప్రముఖంగా వస్తున్నాయని, సీఎం స్థానంలో ఉన్న వ్యక్తి వాటన్నింటినీ చదివి, నిజానిజాలు తెలుసుకుని తగిన చర్యలు తీసుకోవాలని విజయ్‌కు డీఎంకే ఎంకే స్టాలిన్‌ సూచించారు. చైన్నె వానగరంలో బుధవారం మాజీ మంత్రి ఆర్కాట్‌ వీరస్వామి మనవడు, డీఎంకే ఎంపీ కళానిధి వీరస్వామి కుమారుడైన సిద్ధార్థ్‌ – ఆశ్రయల వివాహం ఎంకే స్టాలిన్‌ అధ్యక్షతన జరిగింది. అనంతరం జరిగిన సభలో స్టాలిన్‌ మాట్లాడుతూ, పాత జ్ఞాపకాలను, ప్రస్తుత రాజకీయ పరిస్థితులను పంచుకున్నారు. 1976లో మిసా చట్టం కింద తామంతా అరెస్ట్‌ అయి, ఏడాది పాటు జైలు శిక్ష అనుభవించినప్పుడు ఆర్కాట్‌ వీరస్వామి తమతోనే ఉన్నారన్నారు. చైన్నె జైలులో నాటి ప్రభుత్వం తమను ఎన్నో రకాల హింసలకు గురిచేసిందన్నారు. ఆ సమయంలో తాను ధైర్యంగా, నిబ్బరంగా ఉన్నానంటే దానికి ఆయనే కారణంగా పేర్కొన్నారు. తన చేతిపై ఇప్పటికీ మిసా తాలూకు గాయాల గుర్తులు ఉన్నాయన్నారు. జైలులో జరిగిన దాడుల వల్లే వీరస్వామికి ఒక చెవి వినపడకుండా పోయిందన్నారు.

డీఎంకే 75 ఏళ్ల ఆశయాల పార్టీ

ఒక ప్రాంతీయ పార్టీ ఎలా ఉండాలనే దానికి ద్రావిడ మున్నేట్ర కజగం ఒక నిదర్శనమని స్టాలిన్‌ పేర్కొన్నారు. ఈ రోజుల్లో కేవలం ఒక్క ఎన్నికల్లో ఓడిపోతేనే కొన్ని పార్టీలు కనుమరుగైపోతున్నాయన్నారు. అయితే, డీఎంకే 75 ఏళ్లుగా తన సిద్ధాంతాల కోసం, ఆశయాల కోసం పోరాడుతోందన్నారు. అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రజల కోసమే పనిచేసే ఏకై క పార్టీ డీఎంకే అని స్పష్టం చేశారు.

సోసల్‌ మీడియా హంగామా..

ఈ రోజుల్లో సోషల్‌ మీడియా హంగామా ఎలా ఉందో అందరికీ తెలుసు అని గుర్తు చేశారు. అయితే ఇదంతా తాత్కాలికమేనని, రోజులు గడిచేకొద్దీ ఇవి మరుగున పడిపోతాయన్నారు. నిన్నటివరకు సోషల్‌ మీడియాలో ఆయన కోటు వేసుకుని వచ్చారు, చేతిలో టిఫిన్‌ క్యారియర్‌ పట్టుకొచ్చారు..., చేతికి వాచ్‌ కట్టుకున్నారు, చెస్‌ ఆడారు, ఇప్పుడు కోటు తీసేసి పట్టు చొక్కా–ధోవతిలో వచ్చారు అంటూ కేవలం ప్రచార వార్తలే కనిపించేవి అని ఎద్దేవా చేశారు. అయితే, ఇప్పుడు ఆ ప్రచారాలన్నీ పోయి, రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాల గురించిన వార్తలు బయటకు వస్తున్నాయన్నారు.

సీఎంకు సూచనలు

తాను తమిళనాడు సీఎంని కోరేది ఒక్కటేనని, దయచేసి ఈ రోజు నుండి తమరి గురించి, తమరి పాలన గురించి వస్తున్న వార్తలను చదవండి, అందులో ఉన్న నిజాన్ని గ్రహించండి, ఆ అక్రమాలపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోండి అంటూ తాను చేసుకున్న సూచన, విజ్ఞప్తి అని వ్యాఖ్యలు చేశారు.

త్వరలో ఇంటికి సోఫా మోడల్‌ ప్రభుత్వం

ముందుగా డీఎంకే యువజన నేత ఉదయ నిధి స్టాలిన్‌ మాట్లాడుతూ, ప్రస్తుత పాలకులది ఒక సమర్థత లేని సోఫా మోడల్‌ పరిపాలన అని ఎద్దేవా చేశారు. ఈ ప్రభుత్వాన్ని ప్రజలు ఇంటికి పంపే రోజులు చాలా దగ్గర్లోనే ఉన్నాయని వ్యాఖ్యానించారు. ఈ రోజుల్లో కేవలం అధికారం ఎక్కడ ఉంటే అక్కడకు గోడదూకే రాజకీయాలను చూస్తున్నామని మండి పడ్డారు. ఈ ప్రభుత్వం ప్రజల కోసం ఏదైనా కొత్త పథకం అమల్లోకి తెస్తుందో లేదో తెలియదు కానీ, వేరే పార్టీల నాయకులను, ఎమ్మెల్యేలను మా త్రం నిరంతరం కొనుగోలు చేస్తూనే ఉందని ధ్వజ మెత్తారు. సీఎం ఎక్కడికై నా వెళ్లేముందు ఆయన కంటే ముందే అక్కడికి ’సోఫా’ చేరుకుంటుందని, అందుకే దీనిని ’సోఫా మోడల్‌’ ప్రభుత్వం అంటున్నారని ఉదయనిధి ఎద్దేవా చేశారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement