వారు వస్తే, వీరి వారసత్వానికి ఎసరు! | - | Sakshi
Sakshi News home page

వారు వస్తే, వీరి వారసత్వానికి ఎసరు!

Apr 20 2026 7:30 AM | Updated on Apr 20 2026 7:30 AM

●మధురైలో మంత్రి మన్సూఖ్‌ మాండవీయ

సాక్షి, చైన్నె: మహిళలు అధిక సంఖ్యలో రాజకీయాల్లోకి వచ్చి నిర్ణయాధికారాల్లో భాగస్వాములవుతే తమ వారసత్వ రాజకీయ ఆధిపత్యం బలహీనపడుతుందని డీఎంకే, కాంగ్రెస్‌ పార్టీలు భయపడుతున్నాయని కేంద్ర క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్‌ మాండవీయ విమర్శించారు. ఆదివారం మధురైలో జరిగిన కార్యక్రమంలో ఆయన మీడియాతో మాట్లాడారు.

మహిళా సాధికారతపై ద్వంద్వ ప్రమాణాలు

పార్లమెంటులో మహిళా రిజర్వేషన్లు, నియోజకవర్గాల పునర్విభజన బిల్లులను వ్యతిరేకించడం ద్వారా డీఎంకే, కాంగ్రెస్‌ల అసలు రంగు బయటపడిందన్నారు. మహిళలకు అధికారం ఇవ్వాలని వేదికలపై గొప్పగా మాట్లాడే ఈ పార్టీలు, పార్లమెంటులో మాత్రం అడ్డుకుంటున్నాయి. సామాన్య కుటుంబాల నుంచి వచ్చే మహిళలు పార్లమెంటులోకి అడుగుపెడితే తమ ఏక ఛత్రాధిపత్యానికి సవాల్‌ విసురుతారన్నదే వారి భయం ఎద్దేవా చేశారు.

దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం

నియోజకవర్గాల పునర్విభజనపై డీఎంకే, కాంగ్రెస్‌ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని ఆయన ఆరోపించారు: తమిళనాడులో ఎంపీ స్థానాలు 39 నుంచి 59కి పెరిగే అవకాశం ఉండేదన్నారు. ఐదు దక్షిణాది రాష్ట్రాల్లో ప్రస్తుతం ఉన్న 129 స్థానాలు పునర్విభజన తర్వాత 195కి పెరిగేవి అని వివరించారు. ఈ బిల్లులను అడ్డుకోవడం వల్ల, 2026 జనాభా లెక్కల ప్రకారం పునర్విభజన జరిగితే తమిళనాడుకు కేవలం 29 సీట్లు మాత్రమే వచ్చే ప్రమాదం ఉందని, దీనికి డీఎంకే, కాంగ్రెస్‌లే బాధ్యత వహించాలనిహెచ్చరించారు. పునర్విభజన ద్వారా రిజర్వ్‌డ్‌ స్థానాల సంఖ్య 131 నుంచి సుమారు 205కి పెరిగే అవకాశం ఉండేదని, ఆ అవకాశాన్ని కూడా ప్రతిపక్షాలు అడ్డుకున్నాయని మంత్రి మండిపడ్డారు. ఈసమావేశంలో సిని నటీ , బీజేపీ మహిళా నేత కస్తూరి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement