క్యాన్సర్‌ విజేతల కోసం రేలాలో ‘కదిర్‌’ | - | Sakshi
Sakshi News home page

క్యాన్సర్‌ విజేతల కోసం రేలాలో ‘కదిర్‌’

Apr 20 2026 7:30 AM | Updated on Apr 20 2026 7:30 AM

సాక్షి, చైన్నె: క్యాన్సర్‌ చికిత్స రంగంలో నాలుగేళ్ల విజయవంతమైన ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా, రేలా హాస్పిటల్‌ క్యాన్సర్‌ విజేతల కోసం శ్రీకదిర్‌శ్రీ అనే సరికొత్త సర్వైవర్‌షిప్‌ ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది. కేవలం చికిత్స అందించడమే కాకుండా, చికిత్స తర్వాత రోగులు సాధారణ జీవితం గడపడానికి అవసరమైన శారీరక, మానసిక మద్దతును అందించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యంగా ప్రకటించారు. ఈ ప్రోగ్రామ్‌ కింద ఆంకాలజిస్టులు, పునరావాస నిపుణులు, పోషకాహార నిపుణులు, కౌన్సెలర్లు ఒక బృందంగా ఏర్పడి రోగులకు చికిత్స అందిస్తారన్నారు. క్యాన్సర్‌ మళ్లీ తిరగబెట్టకుండా ముందుగానే గుర్తించడం, చికిత్స వల్ల కలిగే సైడ్‌ ఎఫెక్ట్‌ నిర్వహించడం వంటి అంశాలపై దృష్టి సారిస్తారు. ఈ కార్యక్రమాన్ని ఆస్పత్రి చైర్మన్‌ ప్రొఫెసర్‌ మొహమ్మద్‌ రేలా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ‘నేడు అందుబాటులోకి వచ్చిన అధునాతన చికిత్సల వల్ల క్యాన్సర్‌ జయించే వారి సంఖ్య గణనీయంగా పెరిగిందన్నారు. అయితే, చికిత్స పూర్తయిన తర్వాత కూడా వారు ఎదుర్కొనే దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలను పరిష్కరించడం చాలా ముఖ్యంగా పేర్కొన్నారు. అందుకుఏ ‘కదిర్‌’ ప్రోగ్రామ్‌ ద్వారా క్యాన్సర్‌ విజేతలు తమ సాధారణ జీవితంలోకి ఆత్మవిశ్వాసంతో తిరిగి వెళ్ళేలా మేము తోడ్పాటు అందిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రేలా హాస్పిటల్‌లో చికిత్స పొంది క్యాన్సర్‌ను జయించిన అనేకమంది బాధితులు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement