సాక్షి, చైన్నె: ఎన్నికల సందర్భంగా ఓటర్లలో ఎలాంటి అయోమయం ఎదురు కాకుండా ఉండేందుకు, అన్ని పోలింగ్ కేంద్రాల ప్రవేశ ద్వారాల వద్ద అభ్యర్థుల పేర్లు, వారి క్రమసంఖ్యతో కూడిన పెద్ద పోస్టర్లను ప్రదర్శిస్తామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి కార్యాలయం ప్రకటించింది. ఇందుకు కారణం పెరంబూరులో నెలకొన్న పరిస్థితే.
పెరంబూర్‌లో అసలు ఏం జరిగింది?
చైన్నె పెరంబూర్ నియోజకవర్గం నుండి శ్రీతమిళగ వెట్రి కళగం అధ్యక్షుడు విజయ్ పోటీ చేస్తున్నారు. అభ్యర్థుల జాబితాలో ఆయన పేరు 16వ స్థానంలో ఉంది. అయితే, గతంలో ఎన్నికల సంఘం నోటా (ఎవరికీ ఓటు వేయడం ఇష్టం లేదు) పై అవగాహన కోసం ముద్రించిన పాత కరపత్రాల్లో శ్రీనోటాశ్రీ 16వ స్థానంలో ఉంది. ఎవరో పాత కరపత్రాలను ఇప్పుడు పంపిణీ చేయడంతో, 16వ నంబరు విజయ్ దేనా లేక నోటాదా? అని ఓటర్లలో తీవ్ర గందరగోళం నెలకొంది.
ఎన్నికల సంఘం వివరణ
ఈ వివాదంపై ఎన్నికల అధికారులు స్పష్టతనిచ్చారు. ఒక ఈవీఎంలో కేవలం 16 బటన్లు మాత్రమే ఉంటాయని వివరించారు. . అభ్యర్థులు 15 కంటే తక్కువ ఉన్నప్పుడు మాత్రమే నోటా 16వ స్థానంలో ఉంటుందన్నారు. పెరంబూర్ నియోజకవర్గంలో మొత్తం 47 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారని, ఈ దృష్ట్యా ్ట అక్కడ 3 ఈవీఎంలను ఉపయోగిస్తున్నామన్నారు. నోటా అనేది మూడవ ఈవీఎంలోని చివరి బటన్ (అంటే 48వ స్థానం)లో ఉంటుంది.
విజయ్ పేరు 16వ స్థానంలో ఎందుకు?
అక్షర క్రమం ప్రకారం విజయ్ పేరు చివరలో రావడంతో ఆయనకు 16వ క్రమసంఖ్య కేటాయించారు. అది మొదటి ఈవీఎంలోని చివరి బటన్ కావడం గమనార్హం. తాజా గందరగోళం నేపథ్యంలో ఇతర నియోజకవర్గాలలో అత్యధికంగా ఈవీఎంలను ఉపయోగించే చోట అధికారులు జాగ్రత్త పడ్డారు. తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని, పోలింగ్ కేంద్రం బయట ఉండే జాబితాను చూసి ఓటు వేయాలని అధికారులు సూచించారు.


