క్లుప్తంగా | - | Sakshi
Sakshi News home page

క్లుప్తంగా

Apr 20 2026 7:30 AM | Updated on Apr 20 2026 7:30 AM

ఓటేసేందుకు దివ్యాంగులకు వాహన సౌకర్యం

– ఎన్నికల సంఘం ప్రత్యేక ఏర్పాటు

కొరుక్కుపేట: చైన్నె జిల్లా ఎన్నికల అధికారి కుమారగురుబరన్‌ అసెంబ్లీ ఎన్నికల్లో వందశాతం ఓటింగ్‌ జరిగేలా చూసేందుకు వివిధ చర్యలు తీసుకుంటున్నారు. ప్రతి ఒక్కరూ ఓటు వినియోగించాల్సిన ఆవశ్యకతపై అవగాహన కల్పిస్తున్నారు. ఈ పరిస్థితిలో, దివ్యాంగులు, వయోవృద్ధులైన ఓటర్లకు కూడా తమ ఇళ్ల నుంచే పోస్టల్‌ ఓట్లను నమోదు చేసుకునే అవకాశం కల్పించారు. అధికారులు రెండు రోజులపాటు వారు తమ ఇళ్ల నుంచే ఓట్లను నమోదు చేసుకునేందుకు ఏర్పాట్లు చేశారు. అంతేకాకుండా, పోలింగ్‌ కేంద్రాలకు ప్రయాణించి ఓటు వేయడాన్ని సులభతరం చేయడానికి ఇప్పుడు వాహన సౌకర్యాలు కల్పించారు. దివ్యాంగులు, వయోవృద్ధులైన ఓటర్లు తమ ఓటు నమోదు చేసుకోవడాన్ని సులభతరం చేసేందుకు, వారికి వారి నివాస ప్రాంతాల వరకు ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తున్నారు. చైన్నె జిల్లాలోని మొత్తం 16 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ ప్రత్యేక ఏర్పాటు చేశారు. వాహన సౌకర్యాలు అవసరమైన వారు 1950 నంబర్‌లో జిల్లా సమాచార కేంద్రాన్ని, అలాగే 18004257012 నంబర్‌లో జిల్లా ఎన్నికల కార్యాలయ నియంత్రణ గదిని సంప్రదించాల ని కోరారు. ఈ ఉచిత వాహన సౌకర్యాన్ని పొందడానికి దివ్యాంగులు కూడా సంక్షేమ అధికారులు శరవణకుమార్‌ (సెల్‌: 9443968097), శ్రీనివాసన్‌ (సెల్‌:9841696693)లను సంప్రదించవచ్చని జిల్లా ఎన్నికల అధికారి కుమారగురుబరన్‌ విజ్ఞప్తి చేశారు.

నిబంధనలు ఉల్లంఘించి టీవీకే ప్రచారం

తిరుత్తణి: పవిత్ర పుణ్యక్షేత్రంలో నిబంధనలు ఉల్లంఘించి టీవీకే శ్రేణులు పార్టీ జెండాలతో ప్రచారం చేసిన ఘటన వివాదాస్పదంగా మారింది. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచార పర్వం మంగళవారం సాయంత్రం 5 గంటలతో ముగియనుంది. రెండు రోజులు మాత్రమే ప్రచారానికి సమయం వున్నందున రాజకీయ పార్టీల అభ్యర్ధులు ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఇందులో భాగంగా తిరుత్తణి టీవీకే అభ్యర్థికి మద్దతుగా ఆ పార్టీ శ్రేణులు ఏకంగా తిరుత్తణి కొండ ఆలయంలో మాడ వీధుల్లో ఆదివారం ఉదయం పార్టీ జెండాలతో వెళ్లి ప్రచారం నిర్వహించడం వివాదస్పదమైంది. ప్రభుత్వ కార్యాలయాలు, ఆలయ మాడ వీధుల్లో టీవీకే కేడర్‌ ప్రచారంపై ఆలయ అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తాం

పళ్లిపట్టు: తిరుత్తణిలో తనను గెలిపిస్తే పళ్లిపట్టులో ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తానని అన్నాడీఎంకే అభ్యర్థి హరి హామి ఇచ్చారు. తిరుత్తణి నియోజకవర్గంలో అన్నాడీఎంకే అభ్యర్థిగా పోటీ చేస్తున్న హరి పళ్లిపట్టు సెంట్రల్‌ మండల కార్యదర్శి కృష్ణమనాయుడు ఆధ్వర్యంలో కోణసముద్రం, అత్తిమాంజేరిపేట, నొచ్చిలి, పాతకుప్పం, కొత్తకుప్పం, అత్తిమాంజేరి గ్రామాల్లో ఆదివారం ప్రచారం నిర్వహించారు. నొచ్చిలి బస్టాండులో హరికి మహిళలు ఘనస్వాగతం పలికారు. యూనియన్‌ కార్యదర్శి కృష్ణమనాయుడు క్రేన్‌ ద్వారా గజమాలతో హరిని సత్కరించారు. అన్నాడీఎంకే ప్రభుత్వ పథకాలను మళ్లీ అమల్లోకి తీసుకొచ్చి పేదల జీవితాల్లో వెలుగులు నింపుతామన్నారు. మండల అన్నాడీఎంకే కార్యదర్శి టీడీ.శ్రీనివాసన్‌, జిల్లా మాజీ కౌన్సిలర్‌ శాంతిప్రియ, జంగాళపల్లె చంద్రబాబు పాల్గొన్నారు.

తెలుగువారి మద్దతు కోరిన దుర్గా స్టాలిన్‌

కొరుక్కుపేట: రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగుతుంది. ఆయా రాజకీయ పార్టీల అభ్యర్థులు గెలుపే లక్ష్యంగా ప్రచారం చేస్తున్నారు. ఈక్రమంలో తెలుగు ఓటర్లు సైతం కీలకంగా మారారు. విల్లివాక్కం అభ్యర్థి కార్తిక్‌ మోహన్‌కు మద్దతుగా సీఎం స్టాలిన్‌ సతీమణి దుర్గా స్టాలిన్‌ శనివారం ప్రచారం చేశారు. విల్లివాక్కంలోని ఓ ప్రయివేటు కల్యాణ మండపం వేదికగా తెలుగువారి మద్దతు కోరుతూ తెలుగు నేతలతో ఆమె సమావేశమయ్యారు. కమ్మ గ్లోబల్‌ ఫెడరేషన్‌, రెడ్డియార్‌, కమ్మ నాయుడు ఆది ఆంధ్ర, ఆర్యవైశ్య అసోసియేషన్‌ల నేతలతో ఆమె మాట్లాడారు. కమ్మ గ్లోబల్‌ ఫెడరేషన్‌ తమిళనాడు అధ్యక్షుడు తాళ్లూరు సురేష్‌ అఖిలన్‌, విల్లివాక్కం డీఎంకే అభ్యర్థి కార్తిక్‌మోహన్‌ సతీమణి శృతి పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement