ప్రధాన వాగ్దానాలు
సాక్షి, చైన్నె : తమిళగ వెట్రికళగం ఓటర్లకు వాగ్దానాల వాన కురిపించింది. చైన్నెలో జరిగిన కార్యక్రమంలో అభ్యర్థుల సమక్షంలో టీవీకే అధినేత విజయ్ ఈ మేనిఫెస్టోను విడుదల చేశారు. గృహాలకు 200 యూనిట్ల వరకు విద్యుత్ ఉచితం అన్న కీలక ప్రకటనను విజయ్ చేశారు. వివరాలు.. టీవీకే అధ్యక్షుడు, సినీ నటుడు విజయ్ రాష్ట్రంలో ఒంటరిగా పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. 234 స్థానాలలో అభ్యర్థులను నిలబెట్టగా, ఓ చోట నామినేషన్ తిరస్కరణకు గురి అయింది. మిగిలిన చోట్ల అభ్యర్థులు ప్రచారంలో దూసుకెళ్తున్నారు. వీరికి మద్దతుగా విజయ్ జిల్లా కేంద్రాలలోని నియోజకవర్గాలను కలుపుతూ ప్రచార సభలు,రోడ్ షోలతో ఓటర్లను ఆకర్షించే పనిలో నిమగ్నమయ్యారు. అదే సమయంలో తిరుప్పూర్, కన్యాకుమారి వంటి ప్రచార సభలలో కొన్ని ఆసక్తికర వాగ్దానాలను విజయ్ ప్రకటించారు. నేతన్న, రైతన్నల అభ్యున్నతిని కాక్షించే విధంగా వరాలు జల్లులు కురిపించారు. నేతన్నల కోసం ‘ఈ–కామర్స్’ విప్లవం, చేనేత రంగం కోసం ప్రభుత్వ ఈ–కామర్స్ పోర్టల్‌ను ఏర్పా టు చేస్తామని హామీ ఇచ్చారు. నేత కార్మికుల ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించడానికి నూలు ,రంగుల కొనుగోలుపై 50 శాతం రాయితీ కల్పిస్తామన్నారు. అంతే కాదు, శాంతిభద్రతలను కాపాడే పోలీసుల పని ఒత్తిడిని తగ్గించేలా చర్యలు తీసుకుంటూ, రోటెటింగ్ పద్దతిలో సెలవులు అందజేస్తామని ప్రకటించి ఉన్నారు. అలాగే, రాష్ట్రంలో ఏ పార్టీ ఊహించని రీతిలో ఏఐ విప్లవాన్ని అనుకూలంగా మలచుకునేందుకు సైతం వాగ్దానాలు కురిపించారు. టీవీకే అధికారంలోకి రాగానే శ్రీతమిళనాడు సేవ ధృవీకరణ పథకం తో ఒక మొబైల్ యాప్ ద్వారా డ్రైవింగ్ లైసెన్స్‌తో సహా అన్ని ప్రభుత్వ సేవల కల్పన, జాలర్ల భద్రతకు భరోసాగా నిషేధ కాలంలో ఇస్తున్న రూ. 8 వేలు సాయాన్ని రూ. 20 వేలకు పెంపు, కడల్ తాయ్ ఇల్లం పేరిట సముద్ర తీరంలో ఉన్న గుడిసెలు, పాడు బడ్డ గృహాలను తొలగించి, వాటి స్థానంలో ఎలాంటి విపత్తులైనా ఎదుర్కొనే విధంగా గృహాలను నిర్మించి ఇస్తామని విరించారు. అలాగే, ఆధునిక యుగానికి అనుగుణంగా ఏఐ శాఖను సైతం ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఈ పరిణామాల నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఎన్నికల వాగ్దానంగా మేనిఫెస్టోను గురువారం సాయంత్రం చైన్నెలో విడుదల చేశారు.
మేనిఫెస్టో విడుదల
మేనిఫెస్టో తొలి ప్రతిని రైతు నారాయణన్‌కు విజయ్ అందజేశారు. ఈ సందర్భంగా విజయ్ మాట్లాడుతూ.. తమ మేనిఫెస్టో తిరుక్కురళ్‌లోని అరమ్, పొరుళ్, ఇన్బమ్ ఆధారంగా రూపొందించబడిందన్నారు. తాము చేయగలిగినవి మాత్రమే ఇందులో చెప్పామని, ఇతరుల మాదిరిగా ప్రజలను మోసం చేయమని స్పష్టం చేశారు.


