సాత్తూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్నికల సమరం ఆసక్తికరంగా మారింది. తన సొంత గడ్డ తిరునల్వేలి నుంచి సాత్తూరుకు మకాం మార్చిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్‌కు ఇక్కడి ఓటర్లు పట్టం కట్టేనా? అన్న ఎదురు చూపులు పెరిగాయి. ఇందుకు కారణం ఈ నియోజకవర్గంలో పంచముఖ సమరం నెలకొనడంతో ఓట్ల చీలిక గెలుపును నిర్ధారించనుంది.
సాక్షి, చైన్నె : విరుదునగర్ జిల్లాలోని సాత్తూరు శివకాశి తదుపరి బాణా సంచాల తయారీలో పేరు గడించి ఉంది. ఇక్కడి ప్రజలకు బాణా సంచా తయారీ పరిశ్రమలో పనులే ప్రధాన జీవనాధారంగా ఉంది. వర్షాల సీజన్‌లో వ్యవసాయాన్ని నమ్ముకున్న రైతులు ఎక్కువే. పూర్తిగా గ్రామాలతో నిండిన నియోజకవర్గంగా సాత్తూరు ఉంది. తెలుగు మాట్లాడే నాయుడు, నాడార్, దేవర్ సామాజిక వర్గం ఇక్కడ ఎక్కువే. మొత్తం ఓటర్లు 2,27,963 మంది ఉన్నారు. కర్మయోగి , మాజీ సీఎం కామరాజర్ ఇక్కడి నుంచే కాంగ్రెస్ అభ్యర్థిగా రెండు సార్లు అసెంబ్లీలో అడుగు పెట్టారు. ప్రస్తుత రెవిన్యూ మంత్రి కేకేఎస్‌ఎస్‌ఆర్ రామచంద్రన్ గతంలో అన్నాడీఎంకే తరపున మూడు సార్లు, ఆ తదుపరి త్యాగమరుమలర్చి కళగం తరపున ఒక సారి, డీఎంకే తరపున రెండు సార్లు అసెంబ్లీకి వెళ్లారు. ఇప్పటి వరకు ఇక్కడ జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ మూడు సార్లు గెలిచింది. కామరాజర్ తదుపరి ఇక్కడ డీఎంకే, అన్నాడీఎంకేలో పాగా వేశాయి. అన్నాడీఎంకే ఆరు సార్లు, డీఎంకే నాలుగు సార్లు, ఫార్వర్డ్ బ్లాక్ , త్యాగ మరు మలర్చి కళగం , ఎండీఎంకే ఒక సారి గెలిచాయి. 2021 ఎన్నికలలో డీఎంకే కూటమిలో ఎండీఎంకే అభ్యర్థి ఏఆర్ రఘురామన్ గెలిచారు. అయితే, ఈ సారి డీఎంకే ఇక్కడ పోటీ చేస్తుండటం ఆసక్తికరంగా మారింది.
నైనార్‌కు ఛాన్స్ చిక్కేనా
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ సాత్తూరులో పోటీ చేస్తున్నారు. ఇది వరకు ఆయన పలు మార్లు తిరునల్వేలిలో పోటీ చేశారు. దీంతో ఈ నియోజకవర్గం వీఐపీ జాబితాలోకి చేరినట్లయ్యింది. లోక్ సభ ఎన్నికలలో తిరునల్వేలి నుంచి పోటీ చేసిన సిట్టింగ్ ఎమ్మెల్యే నైనార్‌కు ఓటమి తప్పలేదు. దీంతో ఆయన తన మకాంను సాత్తూరుకు మార్చేశారు. గత ఏడాది కాలంగా సాత్తూరు నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి పెట్టి పనులు చేస్తూ వచ్చారు. 2021లో అసెంబ్లీ ఎన్నికలలో తిరునెల్వేలిలో గెలిచిన నైనార్, సెంటిమెంట్ కారణంగా ఈ సారి సాత్తూరును ఎంపిక చేసుకున్నట్టు ఆయన మద్దతు దారులు పేర్కొంటున్నారు. అటు తన సామాజిక వర్గం ఓట్లు, ఇటు కూటమి ఓట్లపై నైనార్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఆయన కోసం జాతీయ నాయకులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు సైతం సాత్తూరులో ప్రచారం నిర్వహించడం విశేషం.
సవాలుగా ప్రత్యర్థులు
నైనార్‌కు గట్టి పోటీ ఇచ్చే అభ్యర్థులు ఇక్కడ బరిలో ఉన్నారు. డీఎంకే తరపున స్థానికుడైన అభ్యర్థి ఎ కడర్కరైరాజ్ పోటీలో ఉన్నారు. ఆయన విరుదునగర్ జిల్లా కౌన్సిల్ చైర్మన్‌గా పనిచేసిన అనుభవం కలిగిన నేత. స్థానికంగా పట్టున్న నాయకుడు కావడంతో సమరం హోరా హోరీ కానున్నది. గతంలో ఇక్కడ వరుస విజయాలతో దూసుకొచ్చిన మంత్రి కేకేఎస్‌ఎస్‌ఆర్ రామచంద్రన్ డీఎంకే అభ్యర్థి గెలుపు బాధ్యతలను తన భుజాన వేసుకోవడంతో సమరం రసవత్తరంగా మారింది. అదే సమయంలో నైనార్‌కు మరో అభ్యర్థి రూపంలోనూ తీవ్ర పోటీ అన్నది నెలకొన్నట్లయ్యింది. దివంగత సీఎం జే జయలలిత నెచ్చెలి, చిన్నమ్మ శశికళ మద్దతు దారుడైన ఇసక్కిరాజా పోటీలో ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పట్టున్న ఇసక్కి రాజకు నైనార్ సామాజిక వర్గం ఓట్లు చీల్చే అవకాశాలు ఎక్కువే. పసుంపొన్ ముత్తురామలింగ దేవర్ పాదుగాప్పు ఇయక్కమ్ నేతగా ఇసక్కి రాజా ఉండటంతో ఆ సామాజికవర్గం ఆయన వెన్నంటి ఉన్నట్టే.
యువత పై టీవీకే , ఎన్‌టీకే ఆశలు
సామాజిక వర్గాల ఓట్లు, గ్రామీణ ఓట్ల కడర్కరై రాజ్, నైనార్, ఇసక్కి రాజాలు చీల్చుకుంటూ, ఇక్కడి యువతరం ఓటు బ్యాంక్‌ను టీవీకే గురి పెట్టింది. విజయ్ టీవీకే తరపున ఇక్కడ యువకుడైన అజిత్ ఓ వైపు నామ్ తమిళర్ కట్చి(ఎన్‌టీకే) తరపున ఆనందరాజాలు మరోవైపు ఓట్ల వేటలో దూసుకెళ్తున్నారు. డీఎంకే , బీజేపీ వ్యతిరేక ఓట్లు, నవతరం, యువతరం ఓట్లను చీల్చే దిశగా ఈ ఇద్దరు అభ్యర్థులు పోటీలో ఉన్నారు. కొత్త ఓటర్లు అత్యధికంగా విజయ్ టీవీకే వైపుగా మొగ్గు చూపే అవకాశాలు ఉన్నా, కళాశాల యువత ఎన్‌టీకే వైపు దృష్టిపెట్టడం ఖాయం. ఇందుకు కారణం, గతంలో కూడా ఎన్‌టీకేకు ఇక్కడ 13 వేల ఓట్లు రావడం గమనార్హం. ఇక్కడ పంచముఖ సమరంగా ఐదుగురు కీలక అభ్యర్థులు ఉన్నప్పటికీ సమరం అన్నది నైనార్‌ను ఢీ కొట్టే రీతిలో కడర్కరై రాజ్, ఇసక్కి రాజాలు దూసుకెళ్లడం ఖాయం. ఈ దృష్ట్యా, గణనీయంగా ఎవరు ఓట్లు సాధిస్తారో అన్నది వేచి చూడాల్సిందే.


