‘తాంబరం’లో పాగా వేసేదెవరో..? | - | Sakshi
Sakshi News home page

‘తాంబరం’లో పాగా వేసేదెవరో..?

Apr 10 2026 10:15 AM | Updated on Apr 10 2026 10:15 AM

● డీఎంకేలో కొత్త ముఖం ● అన్నాడీఎంకేలో చిట్లపాక్కం ధీమా ● పోటీలో టీవీకే, ఎన్‌టీకే , బీఎస్పీ

సాక్షి, చైన్నె : తాంబరం నియోజవర్గం డీఎంకేకు కంచుకోట.ఇక్కడ ఇప్పటి వరకు జరిగిన ఎన్నికలలో డీఎంకే ఏడు సార్లు విజయ ఢంకా మోగించింది. అన్నాడీఎంకే మూడు సార్లు, కాంగ్రెస్‌ ఓ సారి గెలిచింది. ఇక్కడ గతంలో ఎంఏ వైద్యలింగం డీఎంకే నుంచి మూడు సార్లు అసెంబ్లీకి వెళ్లారు. ఆ తదుపరి అదే పార్టీకి చెందిన ఎస్‌ఆర్‌ రాజ మూడు సార్లు అసెంబ్లీలో అడుగు పెట్టారు. నాలుగో సారిగా తనకే సీటు అన్న ధీమాతో ఉన్న ఎస్‌ఆర్‌ రాజాకు డీఎంకే అధిష్టానం షాక్‌ ఇచ్చింది. ఆయన స్థానంలో డాక్టర్‌ ఆర్‌ఎస్‌ కృత్రిక దేవిని పోటీలో పెట్టారు. ఇది ఎస్‌ఆర్‌ రాజ వర్గీయులకు మింగుడు పడటం లేదు. డీఎంకే అభ్యర్థిగా ఆ వర్గం అంతా దూరంగా ఉండటంతో వీరిని బుజ్జగించే విధంగా ఎంపీలు టీఆర్‌బాలు, ఏ రాజా కుస్తీలు పడుతూ వస్తున్నారు.

డీఎంకేలో అసమ్మతి సెగ

ఈపార్టీలో సిట్టింగ్‌ ఎమ్మెల్యే ఎస్‌ఆర్‌ రాజాకు ఈ పరిసరాలలో బలం ఎక్కువే. అయితే, ఆయనకు సీటు నిరాకరించడంతో డీఎంకేపై అంతృప్తి సెగ రాజుకుని ఉంది. కొత్త ముఖమైన డాక్టర్‌ కృతికా దేవి పూర్తి స్థాయిలో చేరుకునేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక్కడున్న డీఎంకే బలమైన నిర్మాణం, ముస్లీం ఓట్లు కొత్త అభ్యర్థికి కలిసి వచ్చే అంశంగా ఉన్నప్పటికీ ఎస్‌ఆర్‌ రాజ రూపంలో చిక్కులు తప్పదన్న సంకేతాలు వినిపిస్తున్నాయి. అదే సమయంలో ఇక్కడున్న యువత, మధ్యతరగతి ఓటర్లను గురి పెట్టి విజయ్‌ టీవీకే దూసుకెళ్తుండటం గమనార్హం.

చిట్లపాక్కంలో ధీమా

ఈ నియోజకవర్గానికి సుపరిచితుడైన చిట్లపాక్కం రాజేంద్రన్‌ను అన్నాడీఎంకే అభ్యర్థిగా నిలబెట్టింది. చెంగల్పట్టు పశ్చిమ జిల్లా పార్టీ కార్యదర్శిగా ఉన్న రాజకీయ అనుభవజ్ఞుడు చిట్ల పాక్కం రాజేంద్రన్‌ డీఎంకేలోని అంతృప్తిని తనకు అనుకూలంగా మలచుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక్కడున్న మాజీ ఎమ్మెల్యే,మాజీ మంత్రి చిన్నయ్య వర్గీయులు అంతా చిట్లపాక్కం వైపు చేరి ఉన్నారు. అంతే కాదు, ఇక్కడ కోకొల్లలుగా ఉన్న సమస్యలను అస్త్రంగా చేసుకుని కూటమిలోని బీజేపీ, పీఎంకే బలాన్ని కలుపుకుని ఓట్ల వేటలో గెలుపు ధీమాతో దూసుకెళ్తున్నారు.

ఓట్ల చీలిక తథ్యం

ఇక్కడ డీఎంకే , అన్నాడీఎంకేల మధ్య ప్రధాన సమరం నెలకొని ఉన్నప్పటికీ విజయ్‌ టీవీకే అభ్యర్థిగా పోటీలో ఉన్న శరత్‌కుమార్‌ ఓట్లను చీల్చడం ఖాయం. ఇక్కడి యువత, మధ్య తరగతి వర్గాలు, ఇతర సామాజిక వర్గం ఓట్లను గురి పెట్టి వారిని ప్రసన్నతం చేసుకోవడంలో ఉరకలు తీస్తున్నారు. ఇక నామ్‌ తమిళర్‌ కట్చి అభ్యర్థిగా మహిళా ప్రొఫెసర్‌ ఎస్‌ తమిళ్‌ సెల్వి పోటీలో ఉన్నారు. విద్యా వంతుల ఓట్లు కలిసి వస్తాయన్న ఆశాభావంతో ఉన్నారు. అలాగే ఇక్కడ బీఎస్పీ అభ్యర్థిగా ఎం. రాజా పోటీలో ఉన్నారు. వీరి రూపంలో డీఎంకే, అన్నాడీఎంకే ఓటకు భారీగానే గండిపడే అవకాశాలు ఉన్నాయి. ఈ దృష్ట్యా తాజా ఎన్నికలలో ఇక్కడ ఎవరు గెలిచినా తక్కువ మెజారిటీతోగట్టెక్కాల్సిందే.

రాజధాని నగరం చైన్నెకు దక్షిణం దిక్కున ముఖ ద్వారంగా తాంబరం నియోజకవర్గం ఉంది. తెలుగు, తమిళం, ఇతర భాషల వారే కాదు, వివిధ సామాజిక వర్గాల సమూహంతో నిండిన తాంబరంలో సమరం రసవత్తరంగా సాగుతోంది. డీఎంకే అభ్యర్థిగా కొత్త ముఖం డాక్టర్‌ ఆర్‌ఎస్‌ కృతికా దేవిని రంగంలోకి దించారు. ఇది తనకు కలిసి వచ్చిన అంశంగా అన్నాడీఎంకే అభ్యర్థి, మాజీ ఎంపీ చిట్ల పాక్కం రాజేంద్రన్‌ ధీమాతో ఉన్నారు. ఇక, తమిళగ వెట్రి కళగం(టీవీకే) అభ్యర్థిగా డి శరత్‌కుమార్‌, నామ్‌ తమిళర్‌ కట్చి(ఎన్‌టీకే ) అభ్యర్థిగా తమిళ్‌ సెల్వి పోటీలో ఉన్నారు.

సమస్యల హారం..!

తాంబరంలో ట్రాఫిక్‌ కష్టాలు ఎక్కువే. ఇరుకై న రోడ్లు, అడ్డ దిడ్డంగా ఉండే పార్కింగ్‌ ప్రదేశాలు, మార్కెట్‌, రైల్వే స్టేషన్‌ పరిసరాలలో పాదచారుల,వాహనదారులు నిత్యం పద్మ వ్యూహాన్ని చేదించాల్సిందే.

తాగు నీటి సమస్య, మురునీటి తొలగింపు అన్నది సవాలుగా ఉంటున్నది. వర్షాకాలంలో మురుగునీరు నిలిచిపోవడం, తాగునీటి పైపుల లీకేజీలు వంటి సమస్యలపై ప్రజల్లో అసహనం ఉంది. కొన్ని ప్రాంతాల్లో తాగునీటి పైపుల్లో మురుగునీరు కలుస్తున్నట్టుగా నిత్యం ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి

ఫుట్‌పాత్‌లన్నీ ఆక్రమణల్లోనే ఉంటాయి. పాదచారుల నడక గగనమే.

తాంబరం మున్సిపల్‌ కార్పొరేషన్‌గా మారినప్పటికీ, క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు ఇంకా పరిష్కారానికి నోచుకోలేదు.

జీఎస్‌టీ రోడ్డుకు ప్రత్యామ్నాయంగా 1976లో ప్రారంభించిన ’ఈస్టర్న్‌ బైపాస్‌’ ప్రాజెక్ట్‌ ఇప్పటికీ పూర్తి కాలేదు. ముడిచ్చూర్‌ రోడ్డు, వేళచ్చేరి రోడ్డు,,సేలయూర్‌ – క్యాంప్‌ రోడ్‌ మార్గాలను వెడల్పు చేయాలన్న 20 ఏళ్ల నాటి డిమాండ్‌ ఇప్పటికీ అమలుకు నోచుకోలేదు.

కార్పొరేషన్‌గా మారిన తర్వాత పెరిగిన వ్యర్థాల నిర్వహణ , చెత్త కుప్పల తొలగింపు మున్సిపల్‌ యంత్రాంగానికి పెద్ద సవాలుగా మారింది.

ఓటరు ఎటువైపో..

తాంబరం నియోజకవర్గంలో మహిళా ఓటర్లు నిర్ణయాత్మక శక్తిగా ఉన్నారు. చైన్నెకు ముఖ ద్వారంగా ఉన్న ఈ నియోజకవర్గం అతి పెద్దది. ఇక్కడ అభివృద్ధి వేగం పెరిగింది. చైన్నె మహా మహానగరం విస్తీర్ణం పెరగడంతో తాంబరం పరిసరాలు కీలకంగా మారాయి. ఇక్కడ మొత్తం ఓటర్లు 3,23,677. ఇందులో పురుషులు 1,57,580, మహిళలలు 1,66,046, ఇతరులు 51 మంది ఉన్నారు. యువత, మధ్యతరగతి ఓటర్లు ఎక్కువగానే ఉండటంతో వీరిని ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థులు ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఇక హిందువులు, క్రైస్తవులు, ముస్లింలు, ఇతర రాష్ట్రాల వారు గణనీయంగా ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement