నాకు నితీష్‌ కుమార్‌ పరిస్థితి పట్టదు..! | - | Sakshi
Sakshi News home page

నాకు నితీష్‌ కుమార్‌ పరిస్థితి పట్టదు..!

Apr 10 2026 10:15 AM | Updated on Apr 10 2026 10:15 AM

● మేమే మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం ● పుదుచ్చేరి సీఎం రంగస్వామి ధీమా

సాక్షి,చైన్నె : పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ సందర్భంగా ముఖ్యమంత్రి ఎన్‌. రంగసామి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్షాలు విమర్శిస్తున్నట్లుగా తనకు బిహార్‌ సీఎం నితీష్‌ కుమార్‌ పరిస్థితి (మిత్రపక్షాల ఒత్తిడి లేదా రాజకీయ అనిశ్చితి) ఎదురయ్యే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. కాగా తన నిరాడంబరతను మరోమారు చాటుకుంటూ.. లాజ్‌పేటలోని తన నివాసం నుండి పోలింగ్‌ కేంద్రానికి ఆయన తన పాత ద్విచక్ర వాహనం (యమహా బైక్‌) పై వచ్చి ఓటు వేశారు. ఓటు వేయడానికి ముందు ఆయన సేలంలోని అప్పా పైత్యం స్వామి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

సంక్షేమ పథకాలే శ్రీరామరక్ష

ఓటు వేసిన అనంతరం మంగళం నియోజకవర్గంలోని ఓ టీకొట్టు వద్ద ప్రజలతో సరదాగా ముచ్చటించిన సీఎం రంగస్వామి అనంతరం మీడియాతో మాట్లాడారు. పెరిగిన ఓటింగ్‌ శాతం తమకే అనుకూలంగా ఉంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి చేరాయని వివరించారు. అందుకే ప్రజలు మమ్మల్ని మళ్లీ అధికారంలోకి తీసుకురావాలని నిర్ణయించారని ధీమా వ్యక్తంచేశారు. ప్రచార సమయంలో గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు తనను నిలదీయడంపై స్పందిస్తూ.. ‘తాను పనులు చేస్తాను కాబట్టే ప్రజలు ప్రశ్నిస్తున్నారని, నిలదీస్తున్నారని, అడిగేస్తున్నారని వ్యాఖ్యలు చేశారు. గత ఎన్నికల్లో రేషన్‌ దుకాణాలు తెరిచి బియ్యం, గోధుమలు ఇవ్వాలని కోరారని, అది అమల్లోకి వచ్చిందన్నారు. ఇప్పుడు కూడా వారి అవసరాలను దృష్టికి తెచ్చారని, కచ్చితంగా వాటిని నెరవేరుస్తాననిని ధీమా వ్యక్తం చేశారు.

ప్రతి పక్షాల విమర్శలపై కౌంటర్‌

ప్రతిపక్షాలు చేస్తున్న ‘నితీష్‌ కుమార్‌ పరిస్థితి‘ వ్యాఖ్యలను ఆయన కొట్టిపారేశారు. అలాంటి పరిస్థితి తనకు రాదని, తన నాయకత్వంలోనే ప్రభుత్వం ఏర్పడుతుందని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వంతో సమన్వయంతో ఉంటూ పుదుచ్చేరి అభివృద్ధికి ఎన్నో పథకాలు అమలు చేశామని సమాధానమిచ్చారు. మిత్ర పక్షాల నియోజకవర్గాల్లో ప్రచారం చేయకపోవడంపై స్పందిస్తూ.. సమయం తక్కువగా ఉండటం వల్లే తన సొంత పార్టీ అభ్యర్థులపై దృష్టి పెట్టానని, కూటమిలోని పెద్ద నాయకులు ఇతర చోట్ల ప్రచారం చేశారని ఆయన వివరించారు.

భిన్నంగా నమశ్శివాయం వ్యాఖ్యలు

రంగస్వామి వ్యాఖ్యలకు భిన్నంగా బీజేపీ నేత, హోం మంత్రి నమశ్శివాయం వ్యాఖ్యలు చేశారు. మాన్నడి పట్టులో ఓటు వేసినానంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, పుదుచ్చేరిలో బీజేపీ అత్యధిక స్థానాలలో గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తాము అధిక స్థానాలను చేజిక్కించుకున్న పక్షంలో పుదుచ్చేరికీ సీఎం ఎవరన్నది ఎన్‌డీఏ అధిష్టానం నిర్ణయిస్తుందన్నారు. ఈ వ్యాఖ్యలు కాస్త పుదుచ్చేరిలో హాట్‌ టాపిక్‌గా మారాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement