చెన్నై: తమిళనాడులో నివసిస్తున్న తెలుగు ప్రజల హక్కులు, గౌరవం, అభివృద్ధి కోసం కృషి చేస్తున్న తమిళనాడు తెలుగు యువశక్తి సంస్థ జరగబోయే ఎన్నికల నేపథ్యంలో కీలక రాజకీయ నిర్ణయం తీసుకున్నట్లు ఆ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి తెలిపారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, ముఖ్యంగా తమిళనాడులో తెలుగు ప్రజల సమగ్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని, తాను తాళి నియోజకవర్గం నుండి పోటీ చేయకుండా.. ప్రజా ప్రయోజనాల కోసం, సమాన హక్కుల కోసం మరింత బలంగా పనిచేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.
‘‘తమిళనాడులో సుమారు 70–80 లక్షల తెలుగు ప్రజలు నివసిస్తున్నారు. ముఖ్యంగా ఈ జిల్లాల్లో అధిక ప్రభావం ఉంది. చెన్నై, తిరువల్లూర్, కాంచీపురం, తిరువన్నామలై, వెల్లూర్, కృష్ణగిరి, సేలం, ఈరోడ్, కోయంబత్తూర్, మధురై, తిరుచ్చి, తంజావూరు, చెంగల్పట్టు ఈ ప్రాంతాలు అనేక నియోజకవర్గాల్లో ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసే శక్తిగా ఉన్నాయి.
..సీఎం స్టాలిన్ నాయకత్వంలో తెలుగు సంతతికి చెందిన నాయకులకు గౌరవప్రదమైన స్థానం లభించింది. సుమారు నలుగురు తెలుగు మంత్రులు మంత్రివర్గంలో ఉన్నారు. దాదాపు 20–25 మంది ఎమ్మెల్యేలు తెలుగు ప్రజలను ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇది తెలుగు ప్రజలకు సమాన అవకాశాలు, గౌరవం కల్పించే సమగ్ర పాలనకు నిదర్శనం’’అని కేతిరెడ్డి పేర్కొన్నారు.
సినీ నటి కస్తూరి... తెలుగు ప్రజలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సమయంలో, తమిళనాడు ప్రభుత్వం తక్షణమే స్పందించి.. తెలుగు ప్రజల గౌరవాన్ని కాపాడే విధంగా చర్యలు తీసుకుంది. ఈ సంఘటన ద్వారా తెలుగు ప్రజల గౌరవం, స్వాభిమానం కాపాడటంలో ప్రస్తుత ప్రభుత్వం ఎంత కట్టుబడి ఉందో స్పష్టమవుతుంది. తమిళనాడు తెలుగు యువశక్తి.. రాష్ట్రవ్యాప్తంగా విస్తృత ప్రచారం నిర్వహిస్తుంది. తెలుగు ఓటర్లను ఏకతాటిపైకి తీసుకువస్తుంది. డీఎంకే, ఆ పార్టీ కూటమి అభ్యర్థుల విజయానికి కట్టుబడి పనిచేస్తుంది. తమిళనాడులో తెలుగు ప్రజల భద్రత, గౌరవం, ప్రాతినిధ్యం, అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తున్న ప్రభుత్వం డీఎంకే మాత్రమే. ఈ ఎన్నికల్లో డీఎంకే విజయం ఖాయం’’ అని కేతిరెడ్డి పేర్కొన్నారు.


