సాక్షి, చైన్నె : రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సీనియర్ ఐఏఎస్ సాయికుమార్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. సచివాలయంలో ఆయన తన విధులపై దృష్టి పెట్టారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మురుగానందాన్ని తప్పిస్తూ కేంద్ర ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే. ఆయన స్థానంలో రెవెన్యూ శాఖ అదనపు ప్రధాన కార్యదర్శిగా ఉన్న సాయికుమార్‌ను నియమించారు. దీంతో సచివాలయంలోని చాంబర్‌లో ఆయన సీఎస్‌గా బాధ్యతలు చేపట్టారు.
ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ
సాక్షి, చైన్నె : తమిళనాట నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగిసింది.పార్టీలకు , స్వతంత్ర అభ్యర్థులకు చిహ్నాల కేటాయింపు పొద్దుపోయే వరకు సాగడంతో తుది జాబితాలో జాప్యం తప్పలేదు. రాష్ట్రంలోని 234 నియోజకవర్గాలలో పోటీ చేసే అభ్యర్థుల వద్ద గత నెల 30 నుంచి ఈనెల 6వ తేది వరకు నామినేషన్లు స్వీకరించిన విషయం తెలిసిందే. ప్రధాన పార్టీలతో పాటుగా స్వతంత్ర అభ్యర్థులు మొత్తంగా 7,599 మంది నామినేషన్లు దాఖలు చేశారు. ఇందులో పురుషులు 6216, మహిళలు 1380 మంది, ఇతరులు ముగ్గురు ఉన్నారు. పరిశీలనలో 2460 నామినేషన్లు తిరస్కరించారు. 417 నామినేషన్లు ఉపసంహరించారు. మిగిలిన 4722 మంది ఎన్నికలలో పోటీ చేయనున్నారు. అయితే తుది జాబితా వెలువడాల్సి ఉంది. అదే సమయంలో ఎన్నికలలో పోటీ చేస్తున్న స్వతంత్ర అభ్యర్థులకు వివిధ చిహ్నాలను కేటాయించారు. ఈ ప్రక్రియ ముగియడంతో శుక్రవారం నుంచి ఇంటింటా బూత్ స్లిప్పుల పంపిణికి ఆదేశాలు జారీ అయ్యాయి. ఇందుకోసం బీఎల్‌ఓల నేతృత్వంలో ఎన్నికల యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. ఇక ఎన్నికల ఏర్పాట్లపై దృష్టి పెట్టనున్నారు. గ్రీన్ పోలింగ్‌స్టేషన్లు, ప్రత్యేక పోలింగ్‌స్టేషన్ల ఏర్పాటుపై కసరత్తులు మొదలయ్యాయి. మాదిరి పోలింగ్‌స్టేషన్లను ఏర్పాటు చేసి, ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు.
టీఎన్‌సీసీ మేనిఫెస్టో విడుదల
సాక్షి, చైన్నె : తమిళనాడు కాంగ్రెస్ నేతృత్వంలో ప్రత్యేకంగా మేనిఫెస్టోను రూపొందించారు. ఎంపీ కార్తీ చిదంబరం నేతృత్వంలోని కమిటీ రూపకల్పన చేసిన ఈ మేనిఫెస్టోను గురువారం చైన్నెలో కర్ణాటక డిప్యూటీ సీఎం శివకుమార్ , టీఎన్‌సీసీ అధ్యక్షుడు సెల్వ పెరుంతొగై తదితరుల ఆవిష్కరించారు. ఇందులో డీఎంకే పేర్కొన్న అనేక అంశాలు ఉన్నప్పటికీ ,ప్రత్యేకంగా ట్యూషన్ అక్క పేరిట విద్యార్థుల కోసం ప్రత్యేక పథకం రూపకల్పన చేశారు. ఈ సందర్భంగా శివకుమార్ మాట్లాడుతూ, విజయ్‌కు రాజకీయ అవగాహన లేదని, ఆయన వెన్నంటీ ఏ ఒక్క కాంగ్రెస్ నాయకుడు లేదని వ్యాఖ్యలు చేశారు.
నేడు కారైక్కుడికి విజయ్
సాక్షి, చైన్నె: టీవీకే అధినేత విజయ్ కడలూరు ప్రచారం పుదుచ్చేరి ఎన్నికల దృష్ట్యా రద్దు చేసుకోవాల్సివ చ్చింది. దీంతో శుక్రవారం ఆయన శివగంగ జిల్లా కారైక్కుడి నుంచి ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. కారైక్కుడిలో విజయ్ రాకతో అభిమానులు అత్యుత్సాహంతో చెట్లు, ట్రాన్స్ ఫార్మర్లు, విద్యుత్ స్తంభాలు తదితర వాటిపైకి ఎక్కకుండా ముందు జాగ్రత్తలు తీసుకున్నారు. విజయ్ పర్యటించే ప్రాంతాలలో ఉన్న పై వాటికి చుట్టు రేకులతో కవచాలను ఏర్పాటు చేశారు. ఇక విజయ్ తమను అభ్యర్థిగా నిలబెట్టినా, ఎన్నికల ఖర్చుకోసం ఎదురు చూడాల్సి ఉందంటూ అనేక మంది అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టు ప్రచారం ఊపందుకుంది. ఓ అభ్యర్థి చేసిన వ్యాఖ్యలు ఈ చర్చకు దారి తీశాయి. తమ వద్ద ఖర్చులకు సైతం డబ్బులు లేవని, తమను బలవంతంగా ప్రధానకార్యదర్శిభుస్సీ ఆనంద్ ఎన్నికలలో నిలబెట్టేశారని, అయితే, ఇంత వరకు ఖర్చులకు డబ్బులు రాలేదని ఆ అభ్యర్థి ఆవేదన వ్యక్తం చేసినట్టుగా ప్రచారం జోరందుకుంది. ఖర్చులకు డబ్బులు లేని కారణంగా ఎడపాడిలో పోటీచేసిన అభ్యర్థి తాజాగా నామినేషన్ తిరస్కరణకుతో పత్తా లేకుండా పోయినట్టుగా అక్కడి టీవీకే వర్గాలు పేర్కొంటుండటం గమనార్హం.
శ్రీవారి దర్శనానికి 6 గంటలు
తిరుమల: తిరుమలలో గురువారం భక్తుల రద్దీ మోస్తరుగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లోని 5 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. బుధవారం అర్ధరాత్రి వరకు 72,017 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 26,863 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.4.17 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టిక్కెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 06 గంటల సమయం పడుతోంది.


