పునర్విభజనపై తొందర పాటు ఎందుకో..? | - | Sakshi
Sakshi News home page

పునర్విభజనపై తొందర పాటు ఎందుకో..?

Apr 10 2026 10:15 AM | Updated on Apr 10 2026 10:15 AM

● కేంద్రానికి సీఎం స్టాలిన్‌

సాక్షి, చైన్నె : నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియలో కేంద్ర ప్రభుత్వం ప్రదర్శిస్తున్న ‘అనవసర తొందరపాటు‘పై సీఎం ఎం.కె. స్టాలిన్‌ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ విషయంలో కేంద్రం ఎందుకు మాట మారుస్తోందని, దీనివల్ల అసలైన ప్రయోజనం ఎవరికి కలుగుతుందని ఆయన ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన తన ’ఎక్స్‌’ (ట్విట్టర్‌) వేదికగా కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వంపై గురువారం ఘాటు విమర్శలు చేశారు.

ప్రజాస్వామ్యానికే విఘాతం

ప్రధాని మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం పార్లమెంటరీ వ్యవస్థను ఉద్దేశపూర్వకంగా దెబ్బతీస్తోందని స్టాలిన్‌ ఆరోపించారు. చర్చలకు, జవాబుదారీతనానికి వేదికగా ఉండాల్సిన పార్లమెంటు, సభ్యుల గొంతు నొక్కేసే కేవలం ఒక ‘అలంకారప్రాయమైన సభ‘గా మారిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ‘తక్కువ ప్రభుత్వం – ఎక్కువ పరిపాలన‘ అని నినదించే వారే, నియోజకవర్గాల సంఖ్యను పెంచి ప్రజల పన్నుల డబ్బును వృథా చేయడమే కాకుండా పార్లమెంటు నాణ్యతను తగ్గిస్తున్నారని విమర్శించారు.

దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం:

పునర్విభజన వల్ల ఉత్తరాది రాష్ట్రాల్లో నియోజకవర్గాల సంఖ్య రెట్టింపు అయ్యే అవకాశం ఉందని, అదే సమయంలో దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం కేవలం 24 శాతానికే పరిమితం కానుందని స్టాలిన్‌ ఆందోళన వ్యక్తం చేశారు. జనాభా నియంత్రణను సమర్థవంతంగా అమలు చేసినందుకు తమిళనాడు, కర్ణాటక, కేరళ, తెలంగాణ వంటి రాష్ట్రాలను కేంద్రం శిక్షిస్తోందని ఆయన మండిపడ్డారు. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, కేరళ సీఎం పినరయి విజయన్‌, తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి వ్యక్తం చేసిన ఆందోళనలు ముమ్మాటికీ నిజమని ఆయన పేర్కొన్నారు.

మహిళా రిజర్వేషన్లపై స్పష్టత:

మహిళలకు 33 శాతం రిజర్వేషన్లను తాము మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నామని, అయితే ప్రస్తుతమున్న నియోజకవర్గాల పరిమితిలోనే దీనిని అమలు చేయవచ్చని స్టాలిన్‌ సూచించారు. పునర్విభజన పేరుతో దక్షిణాది గొంతు నొక్కాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. కాగా పునర్విభజనకు 1971 జనాభా లెక్కలను ప్రాతిపదికగా తీసుకుంటారా లేక 2021 లెక్కలనా అనే విషయంలో కేంద్రానికి స్పష్టత లేదన్నారు. అలాగే ఓబీసీ రిజర్వేషన్ల విషయంలో కేంద్రం అనుసరిస్తున్న తీరును తప్పుబట్టారు. 2027లో జరగనున్న కుల గణన ఫలితాలను పరిగణనలోకి తీసుకోకుండా తొందరపడటం వెనుక రాజకీయ కుట్ర ఉందని అనుమానం వ్యక్తంచేశారు. రాష్ట్రాలతో సంప్రదింపులు జరపకుండా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడం భారత సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని వ్యాఖ్యనించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement