తమిళుల సంప్రదాయం విశ్వవ్యాప్తం కావాలి
వేలూరు: తమిళ సంప్రదాయం ప్రపంచ వ్యాప్తంగా విస్తరించాలని వేలూరు వీఐటీ చాన్స్‌లర్ విశ్వనాథన్ అన్నారు. వీఐటీ యూనివర్సిటీ ఆవరణలో ఇతర దేశాల విద్యార్థులతో కలిసి చాన్స్‌లర్ సంక్రాంతి వేడుకలను సోమవారం సాయంత్రం జరుపుకున్నారు. పారంపర్య తమిళ సంప్రదాయ క్రీడలైన కోలాటం, కబడ్డీ, పులి వేషాలు దరించి విద్యార్థినీ విద్యార్థులు వీఐటీ యూనివర్శిటీ ప్రాంగణంలో కోలాహాలంగా జరిగింది. చాన్స్‌లర్ విశ్వనాథన్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో వివిధ దేశాలకు చెందిన విద్యార్థినులు తమిళ సంప్రదాయ దుస్తులు దరించి పొంగళ్లు పెట్టారు. అదేవిధంగా వివిధ దేశాలకు చెందిన విద్యార్థులు ఎద్దుల బండిలో ఎక్కి పొంగులో, పొంగల్ అంటూ యూనివర్సిటీ ప్రాంగణంలో తిరిగి వచ్చారు. అనంతరం వివిధ దేశాలకు చెందిన విద్యార్థులతో కలిసి తమిళ్ ఇలక్కియ మండ్రం ఆద్వర్యంలో వీఐటీ ప్రాంగణంలోని చాన్స్‌లర్ విశ్వనాథన్ అద్యక్షతన పొంగల్ పెట్టి విద్యార్థులకు పొంగల్‌ను ప్రసాదంగా అందజేశారు. చైనా, అమెరికా దేశాలకు చెందిన విద్యార్థులు తమిళ సంప్రదాయ పద్ధతిలో చీరలు దరించి పొంగళ్లు పెట్టడంతో ఆకర్షింప జేసింది. ఈ సందర్బంగా చాన్స్‌లర్ విశ్వనాథన్ మాట్లాడుతూ భారతదేశంలో తమిళం, సంస్కృతం మాత్రమే ఉన్నాయన్నారు. ఇతర భాషలు రాత, మాట్లాడే రూపంలో ఉన్నాయని అయితే మూడు వేల సంవత్సరాల తర్వాత కూడా తమిళ బాష ఇంకా ఉందన్నారు. ఈ బాషను సొంతం చేసుకున్నందుకు ప్రతి ఒక్కరూ గర్వ పడాలన్నారు. వీఐటీ యూనివర్శిటీలో మొత్తం 55 దేశాలకు చెందిన విద్యార్థులు వివిధ భాషలు కలిగిన వారుగా ఉన్నారన్నారు. వారందరితో పాటు తమిళ సంప్రదాయాన్ని తెలిపే విధంగా సంక్రాంతి వేడుకలు జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. కార్యక్రమంలో వీఐటీ ఉపాద్యక్షులు శంకర్ విశ్వనాథన్, అసిస్టెంట్ ఉపాద్యక్షరాలు కాదంబరి విశ్వనాధన్, కార్యనిర్వహణ డైరెక్టర్ సంద్యా పెంటారెడ్డి, రమణి బాలసుందరం, వైస్ చాన్సలర్ కాంచన, ప్రో చాన్సలర్ పార్ధశారది మల్లిక్, రిజిస్టార్ జయభారతి, తమిళ ఫ్రొఫెసర్‌లతో పాటు వివిద దేశాలకు చెందిన విద్యార్థినీ, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.


