నాకు భాషా బేధం లేదు
తమిళసినిమా: ఇటీవల లోకా చిత్రంతో అదిరిపోయే విజయాన్ని అందుకున్న నటి కల్యాణి ప్రియ దర్శన్. అందులో సూపర్ హీరో పాత్రలో నటించి మలయాళంతో పాటు, తమిళం తెలుగు, ప్రేక్షకులను అలరించారు. అంతేకాకుండా మాతృభాషతో పాటూ తెలుగు, తమిళం భాషల్లో కథానాయికిగా నటిస్తూ బిజీగా ఉన్న ఈ బ్యూటీ తాజాగా బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్నారనే ప్రచారం జరుగుతోంది. ఈ సందర్భంగా ఇటీవల ఈ అమ్మడు ఒక భేటీలో పేర్కొంటూ లోకా చిత్రం తరువాత తనకు పలు భాషల్లో పలు అవకాశాలు వస్తున్నాయని చెప్పారు. అయితే మంచి పాత్ర అని అనిపిస్తే నటించడానికి సిద్ధమని పేర్కొన్నారు. మరాఠీ, హిందీ, తెలుగు, తమిళం, మలయాళ భాషలను తాను ఎప్పుడు వేర్వేరుగా చూడనన్నారు. కథ చెప్పడం అన్నది ప్రపంచ భావోద్వేగం అన్నారు. ఒక మంచి కథలో నటించే అవకాశం వస్తే పూర్తి సమయాన్ని కేటాయించి, మనసుపెట్టి నటించడానికి తాను ఎప్పుడు సిద్ధమే అన్నారు. కాగా ఈమె రవి మోహన్ సరసన నటించిన జీనీ చిత్రం నిర్మాణ కార్యక్రమం పూర్తిచేసుకుని త్వరలో తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది. కాగా ప్రస్తుతం కార్తీ కి జంటగా మార్షల్ చిత్రంలో నటిస్తున్నారు. మరిన్ని చిత్రాలు తన కోసం ఎదురుచూస్తున్నట్లు తను స్వయంగా చెప్పారు. అదేవిధంగా తనకు సూపర్ హీరో ఇమేజ్ తెచ్చిపెట్టిన లోకా చిత్రానికి పార్ట్ –2 కూడా ఉంది. ఇందులో కూడా ఆమె నాయకగా నటించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది.
నటి కల్యాణి ప్రియ దర్శన్


