
ఎంబీబీఎస్ కౌన్సెలింగ్ ప్రారంభం
సాక్షి, చైన్నె: ఎంబీబీఎస్, బీడీఎస్ వైద్య కోర్సుల ప్రవేశం నిమిత్తం కౌన్సెలింగ్ బుధవారం ప్రారంభమైంది. ఎంపికయ్యే వారికి ఆగస్టు 5వ తేదిన సీట్లను కేటాయించనున్నారు. వివరాలు.. రాష్ట్రంలోప్రభుత్వ వైద్య కళాశాలలో 6,600 ఎంబీబీఎస్, 1583 బీడీఎస్ సీట్లు ఉన్న విషయం తెలిసిందే. ఇందులో 7.5 శాతం రిజర్వుడ్‌కోటా మేరకు రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు 495 సీట్లు దక్కనున్నాయి. వీటితో పాటూ ప్రైవేటులో 1,736 ఎంబీబీఎస్, 530 బీడీఎస్ సీట్లు ఉన్నాయి. ఈ సీట్ల భర్తీ నిమిత్తం 72,743 దరఖాస్తులు వచ్చాయి. నీట్ మార్కుల ఆధారంగా ర్యాంకుల జాబితాను ఈనెల 25వ తేదీన ప్రకటించారు. ప్రభుత్వ కోటా సీట్ల కోసం 39,853 మంది అర్హత సాధించారు. ఇందులో 7.5 శాతం రిజర్వుడ్ కోటా పరిధిలో 4,062 మంది ఉన్నారు. అలాగే, యాజమాన్య కోటా సీట్ల నిమిత్తం 28,279మంది అర్హత సాధించారు. వీరికి కౌన్సెలింగ్ ద్వారా సీట్ల కేటాయింపు ప్రక్రియ బుధవారం ఉదయం పది గటలకు ప్రారంభమైంది. ఆరోగ్యశాఖ వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్ వేదికగా సీట్ల భర్తీ కౌన్సెలింగ్ జరుగుతోంది. ఆగస్టు 4వ తేది సాయంత్రం ఐదు గంటల వరకు ఈ ప్రక్రియ జరగనుంది. 5న ర్యాంకుల జాబితా ఆధారంగా ఎంపికై న వారికి సీట్లను కేటాయించనన్నారు. ఆగస్టు 6 నుంచి 11 వ తేదీ సాయంత్రం ఐదు గటలలోపు ఎంపిక చేసుకున్న కాలేజిల వివరాలను డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. కాగా బుధవారం సీట్ల భర్తీలో తెన్ కాశి జిల్లా శివగిరి సమీపంలోని విశ్వనాథ పురానికి చెందిన తల్లి అముద వల్లి(49)తో పాటూ ఆమె కుమార్తె సంయుక్త ఎంబీబీఎస్‌కు అర్హత సాధించారు. తల్లి దివ్యాంగుల కోటాలో విరుదునగర్ ప్రభుత్వ కళాశాలను, కుమార్తె 7.5 శాతం రిజర్వేషన్ కోటా కింద ఎంపికయ్యారు. ఇక, దివ్యాంగులు, మాజీ సైనికులు, క్రీడా కోటతో పాటూ 7.5 శాతం రిజర్వేషన్ సీట్ల భర్తీ ప్రత్యక్షంగా అన్నాసాలైలోని ప్రభుత్వ మల్టీ స్పెసాలిటీ ఆస్పత్రి ఆవరణలో జరుగుతోంది. ఇక, ప్రభుత్వ కోటా సీట్ల భర్తీలో రాష్ట్రంలో తొలి సీటును కళ్లకురిచ్చి జిల్లా తిరుక్కోవిలూరుకు చెందిన తిరుమూర్తికి చైన్నె కళాశాలలో సీటు దక్కింది.