
క్లుప్తంగా
ఘనంగా ఆడి మాస ఉత్సవాలు
వేలూరు: రాణిపేట జిల్లాలోని రత్నగిరి సమీపంలోని కన్నికాపురం గ్రామంలో వెలసిన శ్రీపుత్తు మారియమ్మన్ ఆలయంలో ఆడి మాస ఉత్సవాలు అతి వైభవంగా జరిగాయి. ముందుగా గ్రామ పెద్ద నారాయణన్, ఆలయ ధర్మకర్త షణ్మగం అధ్యక్షతన మహిళా భక్తులు అధిక సంఖ్యలో చేరుకొని 151 పాల బిందెలతో మేల తాళాల నడుమ ఊరేగింపుగా తీసుకొచ్చారు. అనంతరం మహిళా భక్తులు తీసుకొచ్చిన పాలను అమ్మవారికి మేల తాళాల నడుమ ప్రత్యేక అభిషేకం చేశారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు, పుష్పాలంకరణలు చేసి దీపారాధన పూజలు చేశారు. ఈ పూజా కార్యక్రమంలో మహిళా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆలయ నిర్వాహకులు భక్తులకు అన్నదానం చేశారు.
సినీ రచయిత రామమూర్తి కన్నుమూత
తమిళసినిమా: సినీ రచయిత రామమూర్తి ( 75) వృద్ధాప్యం కారణంగా బుధవారం ఉదయం చైన్నెలో కన్నుమూశారు. ఈయన నటుడు మురళి, నటి మీనా, వడివేలు ప్రధాన పాత్రలు పోషించిన వట్టక్కుడి రాణియన్, వడివేలు, సంతానం కలిసి నటించిన తీకుచ్చి చిత్రాలకు రామమూర్తి కథ, మాటలను అందించారు. అదేవిధంగా పులి తోండ్రాలుమ్ మనిద కుల వరలారు అనే నవలను రాశారు. కాగా వృద్ధాప్యం కారణంగా ఇటీవల అనారోగ్యానికి గురైన రామమూర్తి స్థానికి క్రోంప్రేటలోని ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వచ్చారు.అయితే వైద్యం ఫలించక బధవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. దీంతో ఆయన భౌతికకాయాన్ని సొంత ఊరు అయిన తిరువారూర్ జిల్లా, ముత్తుపేటకు తరలించినట్లు ఆయన కుటుంబ వర్గం తెలిపారు. రచయిత రామమూర్తి మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.
చైన్నె ఔటర్ రింగ్ రోడ్డు పనులు తనిఖీ
తిరువళ్లూరు: ఎన్నూరు పోర్టు నుంచి వేర్వేరు ప్రాంతాలకు ఎగుమతులు దిగుమతుల కోసం భారీ వాహనాలు చైన్నెకు వెళ్లకుండా ట్రాఫిక్ సమస్యను పరిష్కరించడానికి చైన్నె ఔటర్ రింగ్ రోడ్డును ప్రభుత్వం నిర్మిస్తోంది. 132.87 కిలో మీటర్ల దూరానికి గానూ 16,221.40 కోట్లు వ్యయంతో సిక్స్‌వేగా నిర్మాణం చేస్తున్నారు. ఈ పనులను ఐదు దశలో నిర్మిస్తున్నారు. ఈ క్రమంలో తిరువళ్లూరు జిల్లా ఈకాడు నుంచి 26.10 కిమీ దూరం మేరకు నిర్మిస్తున్న పనులను కలెక్టర్ ప్రతాప్ అధికారులతో కలిసి తనిఖీ చేపట్టారు. పనులను నాణ్యతతో చేపట్టడంతో పాటూ నిర్ణీత సమయంలోపు పూర్తి చేయాలని ఆదేశించారు. అనంతరం మీంజూరు రైల్వే బ్రిడ్జితో పాటూ పలు పనులను సైతం పరిశీలించారు. కలెక్టర్ వెంట జాతీయ రహదారిశాఖ చీఫ్ ఇంజినీర్ గణేష్, శంకర్, డిప్యూటీ ఇంజినీర్ మయిల్‌వాగనన్, రాజేష్‌కన్నా, తాహసీల్దార్(స్పెషల్) రమేష్ తదితరులు పాల్గొన్నారు.
500 ఎకరాల్లో పంటలు దగ్ధం
అన్నానగర్: తిరుచెందూర్ కాయమొళి సమీపంలో కీళ్ తిరుచెందూర్ పంచాయతీ పరిధిలోని కాయమొళి, తలవాయిపురం, పుత్తూరు, నడునాలు మూలికినరు ప్రాంతంలో దాదాపు 500 ఎకరాల ఖరీఫ్ పంటలు అగ్నికి ఆహుతయ్యాయి. ఫలితంగా రూ. 50 లక్షల నష్టం వాటిల్లిందని రైతులు వాపోయారు. వివరాలు.. తూత్తుకుడి జిల్లాలోని తిరుచెందూర్ సమీపంలో సుమారు 500 ఎకరాల విస్తీర్ణంలో అరటి, కొబ్బరి మరియు మునగ సాగు చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో మంగళవారం మధ్యాహ్నం తలవాయిపురం–కాయమోళీ రోడ్డు వెంబడి కొబ్బరి చెట్లకు విద్యుత్ తీగలు తగలడం వల్ల మంటలు చెలరేగాయి. తిరుచెందూర్, ఐరల్ అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు యత్నించారు. అయితే గాలుల కారణంగా మంటలు వేగంగా వ్యాపించాయి. ఫలితంగా 20 తోటలలోని 30 వేల అరటి చెట్లు, 5 వేల కొబ్బరికాయలు, తాటి చెట్లు అగ్నికి ఆహుతయ్యాయి. తిరుచెందూర్ తహశీల్దార్ బాలసుందరం ఘటనా స్థలాన్ని పరిశీలించి నష్టంపై నివేదిక రూపొందించారు.
గంజాయి ధ్వంసం
తిరువళ్లూరు: వేర్వేరు కేసులో పోలీసులు స్వాధీనం చేసుకున్న గంజాయిని ఆవడి కమిషనరేట్ పరిధిలో అదనపు కమిషనర్ భవానీశ్వరి నేతృత్వంలోని పోలీసులు ధ్వంసం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా గంజాయి, గుట్కాలను నిషేధించడానికి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. గంజా యి అక్రమణ రవాణాను అడ్డుకోవడానికి పలు ప్రత్యేక టీమ్‌లను ఏర్పాటు చేసి తనిఖీలను నిర్వహిస్తోంది. ఈ తనిఖీల్లో భాగంగానే 78 కేసులో 730 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

క్లుప్తంగా

క్లుప్తంగా