
డీప్–టెక్ స్టార్టప్‌లకు గేమ్ ఛేంజర్ ప్రోగ్రామ్
సాక్షి, చైన్నె: డీప్–టెక్ స్టార్టప్‌లను నిర్మించాలనుకునే స్టమ్ పరిశోధకుల కోసం ఐఐటీమద్రాసులో డీఎస్‌టీ అండ్ జీడీసీ, ఇంక్యుబేట్ కార్యక్రమం మంగళవారం జరిగింది. పరిశోధనను వాస్తవ ప్రపంచ ప్రభావంలోకి అనువదించడానికి అవసరమైన వ్యవస్థాపక నైపుణ్యాలు, వాణిజ్యీకరణ మార్గాలను అందించే విధంగా ముందుకెళ్లారు. ఈ సెమినార్‌లో ప్రభుత్వం, విద్యాసంస్థలు, పరిశ్రమలు , పెట్టుబడి సంఘం ప్రతినిధులు ఒకే వేదిక మీదకు వచ్చి, భారతదేశం విద్యాసంస్థల నుంచి ఉత్పన్నమయ్యే డీప్–టెక్ స్టార్టప్‌ల అభివృద్ధిని ఎలా వేగవంతం చేయవచ్చో చర్చించారు. ఐఐటీ మద్రాస్‌లోని ఎక్సలెన్స్ సెంటర్‌గా ఉన్న గోపాలకృష్ణన్ –దేశ్‌పాండే సెంటర్ ఫర్ ఇన్నోవేషన్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ , 500 డీప్–టెక్ స్టార్టప్‌లపై పనిచేస్తున్న 1600 మందికి పైగా విద్యావేత్తలు , వ్యవస్థాపకులకు శిక్షణ ఇవ్వడం ద్వారా పరిశోధన , వాణిజ్యీకరణను ప్రోత్సహించే విధంగా 100 కి పైగా విద్యా విశ్వవిద్యాలయాలు, ప్రయోగశాలలు, ఇంక్యుబేటర్‌లతో సహకరించినట్టు ప్రకటించారు. ఐఐటీ మద్రాస్ డైరెక్టర్ ప్రొఫెసర్ వి. కామకోటి ఈ సదస్సులో మాట్లాడుతూ ఐఐటీ మద్రాస్‌లో తాము డీప్‌కోర్ టెక్నాలజీని అభివృద్ధి చేయడంపై దృష్టి సారించామన్నారు. భారతదేశ భవిష్యత్తును రూపొందించడంలో దాని కీలక పాత్రను గుర్తించనున్నామన్నారు. సుమారు 12,000 మంది శక్తివంతమైన విద్యార్థి సమూహంతో కలిసినట్టు పేర్కొన్నారు. ప్రస్తుతం తమ విద్యార్థులలో చాలా మందికి వ్యవస్థాపకతను కొనసాగించమని ప్రోత్సహిస్తున్నామన్నారు. ఈ లక్ష్య విధానం తమ ప్రతిష్టాత్మకమైన రోజుకు ఒక పేటెంట్ పరిస్థితులు దారితీసిందన్నారు. ఈ సందర్భంగా తమ స్టార్టప్‌ల ఆవిష్కరణలను గుర్తు చేస్తూ, పలు అంశాలను వివరించారు. ఇంక్యుబేషన్ సెల్ నుంచి మాత్రమే 2032 నాటికి 1,000 స్టార్టప్‌లకు మద్దతు ఇవ్వాలని భావిస్తున్నామని ప్రకటించారు. ఐఐటీ బాంబేలోని దేశాయ్ సేథి స్కూల్ ఆఫ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌లో ప్రొఫెసర్ గా ఉన్న రమేష్ మంగళేశ్వరన్ మాట్లాడుతూ, భారతదేశంలో సైన్స్ ఆధారిత వ్యవస్థాపకతను పెంపొందించడంలో ముఖ్యంగా వెంచర్ సృష్టి ప్రారంభంలో కస్టమర్, మార్కెట్ ప్రయోజనాలు, వ్యవస్థాపకులలో వ్యవస్థాపక మనస్తత్వాన్ని నిర్మించడంలో ఇంక్యుబేట్ ప్రోగ్రామ్ కీలకమైనదిగా వివరించారు.