
నేడు సచివాలయానికి సీఎం
●పది రోజుల తర్వాత రాక
సాక్షి, చైన్నె: పది రోజుల తర్వాత సీఎం ఎంకే స్టాలిన్ గురువారం సచివాలయానికి రానున్నారు. పలు కార్యక్రమాలకు అధికారులు ఈ సందర్భంగా ఏర్పాట్లు చేశారు. సీఎం ఎంకే స్టాలిన్ గత సోమవారం 21వ తేదిన తల తిరగడంతో అపోలోఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారు. ఆయనకు పలు రకాల వైద్య పరీక్షలు జరిగాయి. శనివారం సాయంత్రం ఆయన ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. వైద్యుల సూచన మేరకు మూడు రోజులు విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చింది. ఆస్పత్రిలో ఉన్నా, క్యాంప్ కార్యాలయంలో ఉన్నా, ప్రభుత్వ వ్యవహారాలు, పార్టీ వ్యవహారాలను సీఎంపర్యవేక్షిస్తూనే వచ్చారు. ప్రస్తుతం సీఎం పూర్తిగా కోలుకున్నారు. గురువారం నుంచి ఆయన తన రోజు వారి కార్యక్రమాల మీద దృష్టి పెట్టనున్నారు.సచివాలయానికి సీఎంరానున్నడంతో వీడియో కాన్పరెన్స్ ద్వారా పలు ప్రారంభోత్సవాలు, అభివృద్ధి కార్యక్రమాలకు అధికారులు ఏర్పాట్లు చేశారు. కాగా, ఈనెల 4వ తేదీన సీఎం స్టాలిన్ తూత్తుకుడి పర్యటనకు సన్నద్ధం అవుతున్నట్టు సమాచారం. తూత్తుకుడిలో ఎలక్ట్రిక్ కార్ల తయారీ పరిశ్రమ ఏర్పాటైంది. దీనిని సీఎం స్టాలిన్ ప్రారంభించబోతున్నారు. అలాగే, పలు అభివృద్ధి కార్యక్రమాలకు చర్యలు తీసుకుంటారని అధికారులు వెల్లడించారు.
2న పోస్టాఫీసుల్లో సేవల నిలిపివేత
● సీనియర్ పోస్టల్ డివిజనల్ సూపరింటెండెంట్ వెల్లడి
కొరుక్కుపేట: చైన్నె సెంట్రల్ డివిజన్ పరిధిలోని అన్ని పోస్టాఫీసులలో పోస్టల్ శాఖ కొత్త అప్‌గ్రేడ్ టెక్నాలజీని 24.8.2025 నుంచి అమలు చేయాలని యోచిస్తున్నారు. ఈ కొత్త టెక్నాలజీ సాఫ్ట్‌వేర్ కేంద్ర ప్రభుత్వ డిజిటల్ ఇండియా విధానానికి అనుగుణంగా దేశ అభివృద్ధికి తోడ్పడుతుంది. ఈ మెరుగైన డిజిటల్ సేవ యొక్క సజావుగా, సురక్షితమైన ఆపరేషన్‌ను నిర్ధారించడానికి ఆగష్టు 2వ తేదీన లావాదేవీలు లేని రోజును ప్లాన్ చేశారు. ఈమేరకు 2వ తేదీన చైన్నె సెంట్రల్ పోస్టల్ డివిజన్ పరిధిలోని కింది పోస్టాఫీసులలో ఎటువంటి పోస్టల్ సేవలు అందించరు. ఈ విషయాన్ని గమనించి ప్రజలు తమ పోస్టల్ సేవలను ముందుగానే ప్లాన్ చేసుకోవాలని అధికారులు ఓ ప్రకటనలో కోరారు.
విద్యార్థినులకు లైంగిక వేధింపులు
●రెసిడెన్షియల్ స్కూల్‌ప్రధానోపాధ్యాయుడి సస్పెన్షన్
తిరువొత్తియూరు: కల్లకురిచ్చి జిల్లా కల్వరాయన్‌మలై ప్రాంతంలోని మణియార్పాళయం గ్రామంలో ప్రభుత్వ గిరిజన రెసిడెన్షియల్ ఉన్నత పాఠశాల నడుస్తోంది. ఈ పాఠశాలలో 200 మందికి పైగా విద్యార్థినులు అదే ప్రాంతంలోని హాస్టల్‌లో వుంటూ చదువుకుంటున్నారు. ఇక్కడ పనిచేస్తున్న ప్రధానోపాధ్యాయుడు ధనపాల్ పాఠశాల విద్యార్థినులను లైంగికంగా వేధించినట్లు ఫిర్యాదు అందింది. దీంతో కల్లకురిచ్చి జిల్లా బాలల సంరక్షణ అధికారి ఇళయరాజా పర్యవేక్షణలో బాలల సహాయ కేంద్రం సిబ్బంది సంబంధిత పాఠశాలకు వెళ్లి విచారణ జరిపారు. అందులో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ధనపాల్ పాఠశాల విద్యార్థినులను లైంగికంగా వేధించినట్లు తేలింది. దీనిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని కల్లకురిచ్చి జిల్లా ప్రాథమిక విద్యాశాఖ అధికారికి, గిరిజన సంక్షేమ పథకాల అధికారికి సిఫార్సు చేశారు. ఈ నేపథ్యంలో ప్రధానోపాధ్యాయుడు ధనపాల్‌ను సస్పెండ్ చేస్తూ గిరిజన సంక్షేమ అధికారి అణ్ణాదురై బుధవారం ఆదేశాలు జారీ చేశారు.
చైన్నె పోలీస్ కమిషనరేట్‌లో గ్రీవెన్స్ డే
కొరుక్కుపేట: చైన్నె పోలీస్ కమిషనరేట్‌లో జరిగిన ఫిర్యాదుల పరిష్కార శిబిరంలో పోలీస్ కమిషనర్ అరుణ్ ఫిర్యాదులు స్వీకరించారు. వివరాలు. చైన్నె మెట్రోపాలిటన్ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ప్రతి బుధవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార శిబిరం నిర్వహిస్తున్నారు. వినతులు స్వీకరించిన కమిషనర్ అరుణ్ వాటిపై తక్షణ చర్యలు చేపట్టాలని సంబంధిత పోలీసు అధికారులను ఆదేశించారు.
రూ.505 కోట్లతో 100 వంతెనలు
సాక్షి, చైన్నె: గ్రామాల్లో రూ.505 కోట్లతో వంద వంతెనల నిర్మాణానికి ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం టెండర్లను బుధవారం ఆహ్వానించారు. గ్రామీణ ప్రాంతాల్లో రైతులు, ప్రజల, విద్యార్థులు రవాణా ఉపయోగం నిమిత్తం గ్రామీణ రోడ్లలో హైలెవల్ వంతెనల నిర్మాణానికి ప్రభుత్వం నిర్ణయిచింది. బడ్జెట్‌లో ప్రకటన మేరకు ఈ నిర్మాణ పనులు చేపట్టేందుకు టెండర్లను ఆహ్వానిస్తూ నిర్ణయం తీసుకున్నారు.