
కామరాజర్, రాధాకృష్ణన్ మార్గాల విస్తరణ
● గ్రేటర్ మీట్‌లో తీర్మానం ● 75 ప్రదేశాలలో పర్యావరణ పరిరక్షణ చర్యలు
సాక్షి, చైన్నె: చైన్నె మెరీనా తీరం వైపుగా సాగే కామరాజర్ సాలై(రోడ్డు), రాధాకృష్ణన్ సాలైలోను విస్తరించేందుకు గ్రేటర్ చైన్నె కార్పొరేషన్ సమావేశంలో బుధవారం తీర్మానించారు. 75 ప్రదేశాలలో పర్యావరణ పరిరక్షణ చర్యలు విస్తృతం చేయనున్నారు. అలాగే కార్పొరేటర్లకు హెల్త్ చెకప్ నిమిత్తం తలా రూ. 2 వేలు చొప్పున 200 మందికి కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. చైన్నె కార్పొరేషన్ పాలక మండలి సమావేశంలో బుధవారం రిప్పన్ బిల్డింగ్‌లో జరిగింది. మేయర్ ప్రియ అధ్యక్షతన జరిగిన సమావేశానికి డిప్యూటీ మేయర్ మహేశ్‌కుమార్, కమిషనర్ కుమర గురుబరన్ పర్యవేక్షించారు. ప్రశ్నోత్తరాల సమయంలో పలువరు కార్పొరేటర్లు తమ సమస్యలను సమావేశం ముందు ఉంచారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అందించే అల్పాహర పథకం సిబ్బందికి రూ. 7 వేలు మాత్రమే జీతం ఇస్తున్నారని, దీనిని పెంచాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని సభ్యుడు కృష్ణమూర్తి కోరారు. సభ్యుడు తనియరసు మాట్లాడుతూ, తిరువొత్తియూరు సమీపంలోని సాతంకాడు చెరువు ఆక్రమణలను తొలగించి, విస్తరించాలని, పక్షుల శరణాలయంగా తీర్చిదిద్దాలని కోరారు. చివరగా సమావేశంలో పలు తీర్మానాలు ఆమోదించారు. 15 మండలాలలోని 75 ప్రాంతాలలో పర్యావరణ పరిరక్షణ నినాదంతో ప్రత్యేక సెన్సార్లను ఏర్పాటు చేయడానికి నిర్ణయించారు. పర్యావరణానికి మెరుగు పరిచే విధంగా ప్రజలకు అవగాహన విస్తృతం చేయనున్నారు. చైన్నె మెరీనా తీరం వైపుగా ఉన్న రోడ్లలో పెరిగిన ట్రాఫిక్ రద్దీని పరిగణించి కామరాజర్ సాలై, రాధాకృష్ణన్ సాలైను విస్తరించేందుకు తీర్మానించారు. ఈ రెండు రోడ్లను వెడల్పు చేసి సర్వీసు రోడ్డుతో ప్రత్యేక రహదారి నిర్మాణానికి చర్యలు చేపట్టనున్నట్లు వెల్లడించారు.