
ఘనంగా ఫ్రెషర్స్ డే
కొరుక్కుపేట: శ్రీకన్యకాపరమేశ్వరి ఆర్ట్స్ అండ్ సైన్స్ మహిళా కళాశాలలో మొదటి సంవత్సరం చేరిన కొత్త విద్యార్థినులకు ఘనస్వాగతం పలుకుతూ వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. కళాశాల కరస్పాండెంట్ ఊటుకూరు శరత్‌కుమార్, కళాశాల ఇన్‌చార్జ్ ప్రిన్సిపల్ వనిత, అధ్యాపకులు, ట్రస్టీలు, సీనియర్ విద్యార్థినులు పాల్గొని నూతన విద్యార్థినులకు రోజా పూలు అందించి కళాశాలలోకి ఆహ్వానించారు. ముందుగా కన్యకాపరమేశ్వరి ఆలయంలో విద్యార్థినులు బాగా చదువుకుని ఉన్నతంగా ఎదగాలని ఆకాంక్షిస్తూ ప్రత్యేక పూజలను నిర్వహించి శ్రీవాసవాంబ ఆశీస్సులను అందజేశారు. అనంతరం కళాశాల కన్వెన్షన్ సెంటర్‌లో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. కళాశాల యాజమాన్యం ఎస్‌కేపీసీ సిల్వర్ జూబ్లీ అక్షయ ఎండోమెంట్‌ను ఇద్దరు విద్యార్థినులకు మొత్తం ట్యూషన్‌ఫీజును సాయం అందించారు. దీనిని గుగ్గిలం రమేష్, గౌతం, ఎస్‌కేపీసీ స్టాఫ్ అందించినట్లు కరస్పాండెంట్ తెలిపారు. అలాగే తమ కళాశాల నాలుగు మేనేజ్‌మెంట్ ఉచిత సీట్లు, ఐదుగురు మెరిటోరియస్ విద్యార్థినులకు ఫీజు రాయితీ, 20 మంది విద్యార్థినులకు స్కాలర్‌షిప్‌లు కూడా అందించినట్టు ఆయన తెలిపారు.