సందర్శనకు సన్నద్ధం
వళ్లువర్ కోట్టం
● ముగిసిన పనులు ● 21 నుంచి సందర్శకులకు అనుమతి ● మెరుస్తున్న రాతి రథం ● బ్రహ్మాండంగా ఆడిటోరియం
సాక్షి, చైన్నె : ఎట్టకేలకు వళ్లువర్ కోట్టం సుందరంగా ముస్తాబైంది. పనులు ముగియడంతో ఈనెల 21న సీఎం స్టాలిన్ ప్రారంభించే అవకాశాలున్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. ప్రారంభోత్సవంతో సందర్శకులను అనుమతించేలా ప్రజా పనుల శాఖ వర్గాలు చర్యలు చేపట్టాయి. విద్యుత్ వెలుగుల్లో రాతిరథం మెరుస్తోంది. బ్రహ్మాండ ఆడిటోరియంతో సహా అన్ని రకాల కొత్త హంగులతో వళ్లువర్‌కోట్టం దేదీప్యమానంగా వెలుగొందుతున్నది. చైన్నె నుంగంబాక్కంలోని వళ్లువర్‌కోట్టం తమిళ సంస్కృతి, సంప్రదాయాలు, పురాతనతకు అద్దం పట్టే కళాఖండాల సమూహరంతో నిండిన పర్యాటక ప్రదేశం. తమిళ కవి తిరువళ్లువర్ పేరిట ఒకప్పుడు డీఎంకే హయంలో ఐదు ఎకరాల విస్తీర్ణంలో నగరం నడి బొడ్డున రూపుదిద్దుకున్న ఈ వళ్లువర్‌కోట్టంలోని రథం ప్రత్యేక ఆకర్షణ. డీఎంకే అధికారంలోకి వచ్చినప్పుడల్లా ఈ పర్యటక ప్రదేశంపై ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగేది. అయితే గత పదేళ్లు అన్నాడీఎంకే పాలనలో ఈ వళ్లువర్‌కోట్టం శిథిలావస్థకు చేరింది. ఒకప్పుడు నిత్యం సందర్శకులతో కిటకిటలాడిన ఈ ప్రదేశంలో సందడి తగ్గింది. ఇక్కడి కళాఖండాలు, చిత్ర లేఖనాలు, శాసనాలు, ఇలా ఎన్నో అపూరూపాలు దెబ్బతినే పరిస్థితి నెలకొంది. ప్రధానంగా ఇక్కడి రాతి రథం బీటలు వారే పరిస్థితి తప్పలేదు. పార్క్‌లో పచ్చదనం కరువైంది. అన్నాడీఎంకే హయంలో నిర్లక్ష్యానికి వళ్లువర్‌కోట్టంలోని దుస్థితి ప్రజల్లోకి తీసుకెళ్లే రీతిలో వార్తలు, కథనాలు హోరెత్తడంతో డీఎంకే పాలకులు స్పందించారు. వళ్లువర్‌కోట్టం పర్యాటక క్షేత్రానికి సొబగులు దిద్దేందుకు సిద్ధం అయ్యారు. వళ్లువర్ కోట్టంలో మరమ్మతులు చేపట్టేందుకు గత ఏడాది చర్యలు తీసుకున్నారు.
ముస్తాబు
పచ్చదనం కోల్పోయిన పార్క్ పునరుద్ధరణ, రథంతోపాటు ఇతర నిర్మాణాలకు మరమ్మతులు చేపట్టేందుకు డీఎంకే ప్రభుత్వం రూ.80 కోట్లను కేటాయించింది. ప్రజా పనుల శాఖ పర్యవేక్షణలో గత ఆరేడు నెలలుగా శరవేగంగా పనులు జరిగాయి. తిరువళ్లువర్ స్మారక చిహ్నాలలో ప్రముఖంగా ఉన్న వళ్లువర్ కోట్టానికి పూర్వ వైభవం తీసుకొచ్చేలా జరిగిన పనులు ప్రస్తుతం ముగిశాయి. వళ్లువర్ కోట్టంలోని శిల్ప సంపద చెక్కు చెదరని రీతిలో మళ్లీ పునరద్ధరించారు. ఇక్కడి తొలి అంతస్తులో 1400 మంది కూర్చునేందుకు వీలుగా పూర్తి ఏసీ సౌకర్యంతో ఆడిటోరియం తీర్చిదిద్దారు. మరో అంతస్తులో వేలాది పుస్తకాలతో గ్రంథాలయం కొలువు దీరింది. వివిధ చర్చా కార్యక్రమాలకు వేదిక భారీ హంగులతో ఇక్కడ అనేక నిర్మాణాలు రూపుదిద్దుకున్నాయి. కురల్‌మణి మండపాన్ని ఆధునికీకరించారు. 1300 కురల్(సూక్తులు)ను ఇక్కడి రాళ్లలో పొందుపరిచినట్టుగా పుస్తకం తరహాలో నిర్మాణాలను ఆధునికీకరించారు.1,330 తిరుక్కురల్ చిత్ర లేఖనాలు చెక్కు చెదరని రీతిలో పెయింటింగ్స్‌తో కొత్త శోభ సంతరించుకున్నాయి. అలాగే, డీఎంకే దివంగత నేత కరుణానిధి సందేశాలను సైతం ఇక్కడ పొందు పరిచారు.
సంగీత కార్యక్రమాలకు వేదికగా పరిసరాలు
విద్యుత్ వెలుగులో రథం
సందర్శనకు సన్నద్ధం


