ఎలక్ట్రిక్.. రైట్ రైట్
రోడ్డెక్కిన 125 ఎలక్ట్రిక్ బస్సులు పూందమల్లిలో ఎలక్ట్రిక్ బస్ వర్క్‌షాప్ ప్రారంభించిన డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్
చైన్నె శివారులోని పూందమల్లి ఎంటీసీ
నేతృత్వంలో ఎలక్ట్రిక్ బస్ వర్క్‌షాప్‌ను రూ.43.53 కోట్లతో నిర్మించారు. దీనిని డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ శుక్రవారం ప్రారంభించారు. అలాగే, రూ.214.50 కోట్లతో కొనుగోలు చేసిన 45 ఏసీ, 80
నాన్ ఏసీ సౌకర్యంతో కూడిన లోఫ్లోర్ ఎలక్ట్రిక్ బస్సులకు ఈ సందర్భంగా
ఉదయనిధి జెండా ఊపారు.
సాక్షి, చైన్నె: చైన్నెలో మున్సిపల్ రవాణా సంస్థ నేతృత్వంలో ఎలక్ట్రిక్ బస్సుల సేవలను విస్తృతం చేస్తున్న విషయం తెలిసిందే. వివిధ మార్గాలకు రవాణా సౌకర్యాలను సులభతరం చేస్తూ ఏర్పాట్లు ముమ్మరం చేశారు. కొత్త సబర్బన్ బస్ టెర్మినల్స్ నిర్మాణం, బస్టాండ్‌లు, డిపోల ఆధునికీకరణ దిశగా పనుల వేగాన్ని పెంచారు. చైన్నె మెట్రోపాలిటన్ భాగస్వామ్య ప్రాజెక్టులో భాగంగా సస్టైనబుల్ అర్బన్ సర్వీసెస్ ప్రాజెక్ట్ ఆధారంగా, ప్రపంచం బ్యాంక్, ఆసియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ భాగస్వామ్యంతో రాజధాని నగరంలో పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించే లక్ష్యంతో ఎంటీసీ నేతృత్వంలో 625 లో–ఫ్లోర్ ఎలక్ట్రిక్ బస్సులను నడిపేందుకు చర్యలు తీసుకున్నారు. ఇప్పటికే వ్యాసార్పాడిలో ఈ బస్సుల కోసం ఎలక్ట్రిక్ బస్ వర్క్‌షాప్‌ను ఏర్పాటు చేసి, ఇక్కడి నుంచి 120 లో–ఫ్లోర్ ఎలక్ట్రిక్ బస్సులు వివిధ మార్గాలలో సేవలను అందిస్తున్నాయి. అలాగే, పెరుంబాక్కం మరో ఎలక్ట్రిక్ బస్సు వర్క్‌షాప్ ఏర్పాటు చేసి, ఇక్కడి నుంచి 135 కొత్త లో–ఫ్లోర్ ఎలక్ట్రిక్ బస్సులను వివిధ మార్గాల్లో నడుపుతున్నారు. మూడో విడతగా ప్రస్తుతం పూందమల్లిలో రూ.43.53 కోట్లతో ఎలక్ట్రిక్ బస్ వర్క్‌షాపును ఏర్పాటు చేశారు. అన్ని రకాల మౌలిక సదుపాయాలతోపాటు బస్సులకు చార్జింగ్ కోసం ఇక్కడ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కొత్త ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటుతోపాటు అగ్నిప్రమాదాల నివారణ లక్ష్యంగా ప్రత్యేక చర్యలు తీసుకున్నారు.
కొత్త బస్సులు..
తాజాగా 40 ఏసీ సౌకర్యంతో కూడిన ఎలక్ట్రిక్ బస్సులు, మరో 80 నాన్ ఏసీ సౌకర్యంతో కూడిన బస్సులను కొనుగోలు చేశారు. మహిళలకు సురక్షితమైన ప్రయాణాన్ని నిర్ధారించడానికి లో–ఫ్లోర్ ఎలక్ట్రిక్ బస్సుల్లో నిఘా కెమెరాలు సైతం అమర్చి ఉండడం విశేషం. ఈ బస్సులకు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ జెండా ఊపారు. ఎలక్ట్రిక్ ఏసీ బస్సుల్లో ప్రయాణించే వారి కోసం నెలకు రూ. 2వేలు ప్రయాణ పాస్‌ను తాజాగా ప్రవేశ పెట్టారు. పూందమల్లి నుంచి అన్నాస్క్వేర్, బ్రాడ్‌వే, టీ.నగర్, రెడ్ మిల్స్, కిలాంబాక్కం, తిరువాన్మియూరు, తిరువళ్లూరు వైపు పలు మార్గాలలో కొత్త బస్సులు రోడ్డెక్కించారు. మంత్రులు శివశంకర్, ఎస్‌ఎం. నాజర్, ఎమ్మెల్యేలు కృష్ణస్వామి, దురై చంద్రశేఖర్, అధికారులు పాల్గొన్నారు.
ఎలక్ట్రిక్.. రైట్ రైట్


