విజయం కోసం శ్రమించండి!
సాక్షి, చైన్నె: అభ్యర్థుల విజయం కోసం మరింతగా శ్రమించాలని నియోజకవర్గాల నేతలకు డీఎంకే అధ్యక్షుడు సీఎం ఎంకే స్టాలిన్ ఆదేశించారు. సోదరా కదిలిరా నినాదంతో అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా నేతలతో స్టాలిన్ సమావేశాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. శుక్రవారం డీఎంకే కార్యాలయం అన్నా అరివాలయంలో కలసపాక్కం, అరక్కోణం, షోళింగర్ నియోజకవర్గాలకు చెందిన నేతలతో స్టాలిన్ వేర్వేరుగా సమావేశమయ్యారు. నియోజకవర్గాలలో పరిస్థితుల గురించి చర్చించారు. ప్రజల్లోకి ప్రభుత్వ పథకాలను విస్తృతంగా తీసుకెళ్లాలని, గ్రామాల్లోని ప్రజలతో మమేకమయ్యే విధంగా కార్యక్రమాలు మరింత వేగం పెంచాలని ఆదేశించారు. అభ్యర్థుల గెలుపు కోసం మరింతగా శ్రమించాలన్నారు. గత 49 రోజుల్లో 112 అసెంబ్లీ నియోజకవర్గాల నేతలతో స్టాలిన్ సమావేశం కావడం గమనార్హం. ముందుగా అన్నాఅరివాలయంలో స్టాలిన్‌తో శ్రీలంక మంత్రి సుందరలింగం బృందం సమావేశమయ్యారు. దిత్వా తుపాన్ రూపంలో తమకు ఎదురైన కష్టాల నేపథ్యంలో తమిళనాడు నుంచి పెద్ద ఎత్తున సామగ్రి పంపించినందుకు కృతజ్ఞతలు తెలుపుకున్నారు. అలాగే, డీఎంకే దివంగత ప్రధాన కార్యదర్శి కె.అన్బళగన్ 103వ జయంతి సందర్భంగా ఆయన చిత్ర పటానికి నివాళులర్పించారు. విద్యార్థులకు విద్యా సామగ్రి, ల్యాప్‌టాప్‌లను అందజేశారు.
24న నిరసన..
గ్రామీణ ఉపాధి హామీ పథకానికి మహాత్మగాంధీ పేరును తొలగిస్తూ కేంద్రం తీసుకున్న చర్యలను ఖండిస్తూ ఈనెల 24న డీఎంకే కూటమి నేతృత్వంలో రాష్ట్ర వ్యాప్త నిరసనకు పిలుపునిచ్చారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం స్థానంలో కేంద్రం కొత్తగా వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్‌గార్, అజీవికామిషన్– గ్రామీణ(వీబీ –జీరామ్‌జీ)గా మారుస్తూ లోక్‌సభలో బిల్లును ఆమోదించుకున్న విషయం తెలిసిందే. దీనిని వ్యతిరేకిస్తూ ఆందోళనలు మొదలయ్యాయి. ఇందులోభాగంగా డీఎంకే నేతృత్వంలో ఈనెల 24న చైన్నెలో భారీ ఆందోళనకు పిలుపునిచ్చారు. అదేరోజున అన్ని జిల్లాల కేంద్రాలు, డివిజన్ కేంద్రాలు, యూనియన్ కేంద్రాల్లో కేంద్రం తీరును ఖండించే విధంగా నిరసనలకు అన్నా అరివాలయం పిలుపునిచ్చింది. ఇందులో పెద్ద ఎత్తున డీఎంకే కూటమి పార్టీల నేతలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని ఈసందర్భంగా ఆయన పిలుపునిచ్చారు.
విజయం కోసం శ్రమించండి!


