సొంత ఇలాకాలో సీఎం ప్రగతి పనులు
సాక్షి, చైన్నె: తాను ప్రాతినిథ్యం వహిస్తున్న కొళత్తూరు అసెంబ్లీ నియోజకవర్గంలో గురువారం సీఎం ఎంకే స్టాలిన్ పర్యటించారు. రూ. రూ. 25.72 కోట్ల వ్యయంతో అన్నాదురై పేరిట నిర్మించిన బ్రహ్మాండ కల్యాణ మండపాన్ని ప్రారంభించారు. 15 జంటలకు వివాహాలు చేయించి ఆశీర్వదించారు. రూ. 17.47 కోట్ల అంచనా వ్యయంతో ప్రభుత్వ మోడల్ హయ్యర్ సెకండరీ పాఠశాల భవనం, అముదం స్టోర్ భవనం నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. కొళత్తూరు అసెంబ్లీ నియోజకవర్గాన్ని సీఎం స్టాలిన్ బ్రహ్మాండంగా తీర్చిదిద్దుతూ వస్తున్న విషయం తెలిసిందే. సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలతో కూడిన ఆస్పత్రి, విద్యా సంస్థల, ఇతర మౌలిక సదుపాయాల కల్పన అంటూ ఇక్కడ జరగని అభివృద్ధి అంటూ లేదు. తాజాగా ఇక్కడి ప్రజల కోసం జి.కె.ఎం. కాలనీ, జంబులింగం రోడ్‌లో గ్రేటర్ చైన్నె కార్పొరేషన్ నేతృత్వంలో రూ.25.72 కోట్లతో 40,300 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆధునిక సౌకార్యలతో కల్యాణ మండపం నిర్మించారు. దీనికి అన్నా పేరు పెట్టారు. ఈ భవనాన్ని ప్రారంభించిన సీఎం స్టాలిన్ అన్నా విగ్రహాన్ని ఆవిష్కరించారు. పది గదులతో పాటుగా మూడో అంతస్తులో 800 మంది కూర్చునేందుకు వీలుగా వివాహ వేదికను బ్రహ్మాండంగా తీర్చిదిద్దారు. ఈ సందర్భంగా 15 జంటలకు వివాహాలను జరిగాయి. వధూ వరులను ఆశీర్వదిస్తూ వారికి కావాల్సిన అన్ని రకాల వస్తువులను సారెగా అందజేశారు. పెరియార్ నగర్‌లో అముదం స్టోర్ బ్రహ్మాండ భవన నిర్మాణానికి కూడా శంకు స్థాపనచేశారు. అలాగే, అక్కడి ప్రజలతో సమస్యలను స్వయంగా తెలుసుకున్నారు. వారి అభిప్రాయాలను సేకరించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు నెహ్రు, శేఖర్‌బాబు,అన్బిల్ మహేశ్, మేయర్ ఆర్ ప్రియ, తదితరులు పాల్గొన్నారు.
ఒప్పందం
సచివాలయంలో సీఎం స్టాలిన్ సమక్షంలో పారిశ్రామిక ఒప్పందం జరిగింది. ష్నైడర్ ఎలక్ట్రిక్ గ్రూప్ చైన్నె, కోయంబత్తూరులోని తన ప్లాంట్లను విస్తరించేందుకు నిర్ణయించింది. అలాగే హోసూరులోకొత్త ప్లాంట్ నిర్మాణానికి చర్యలు తీసుకున్నారు. రూ.718 కోట్ల తో 663 మందికి ఉపాధి కల్పించే విధంగా పెట్టుబడి పెట్టేందుకు నిర్ణయించారు. ఇందుకు సంబంధించి పరిశ్రమలు, పెట్టుబడి ప్రోత్సాహక, వాణిజ్య శాఖ తరపున జరిగిన కార్యక్రమంలో సీఎం సమక్షంలో ఒప్పందాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో పరిశ్రమ, పెట్టుబడి ప్రోత్సాహక, వాణిజ్య మంత్రి డాక్టర్ టి.ఆర్.బీ రాజా, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎన్ మురుగానందం, పరిశ్రమల శాఖ కార్యదర్శి వి అరుణ్ రాయ్, మేనేజింగ్ డైరెక్టర్ థారేష్ అహ్మద్, ష్నైడర్ ఎలక్ట్రిక్ గ్రూప్ వైస్ ప్రెసిడెంట్ అన్షుమ్ జైన్, ఫైనాన్స్ డైరెక్టర్ సునీల్ సత్యప్రకాష్, చైన్నె క్యాంపస్ ప్రెసిడెంట్ విశ్వనాథన్ పొన్నుసామి, ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


