ఆత్మహత్యల రాజధాని
– గవర్నర్ ఆర్‌ఎన్.రవి వ్యాఖ్య
సాక్షి, చైన్నె: తమిళనాడు ఆత్మహత్యలకు రాజధానిగా మారిందని గవర్నర్ ఆర్‌ఎన్ రవి వ్యాఖ్యానించారు. కోయంబత్తూరులో సింధూ నాగరికత గురించి రెండో రోజుల సదస్సు ఓ కళాశాలలో ప్రారంభమైంది. శుక్రవారం ఈ సదస్సును గవర్నర్ ఆర్‌ఎన్.రవి ప్రారంభించి ప్రసంగించారు. ప్రపంచంలో నేడు జాతి, మత కారణాలతో అనేక యుద్ధాలు జరుగుతున్నాయని వివరించారు. ఒత్తిడి, వివిధ కారణాలతో ప్రజలు తీవ్ర ప్రభావాలను ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఒత్తిడిని తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్న వారు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. జాతీయ క్రైమ్ రికార్డుల మేరకు తమిళనాడులో ప్రతి సంవత్సరం 20వేల మంది వివిధ కారణాలతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారని వివరించారు. దీన్ని బట్టి చూస్తే తమిళనాడు ప్రాథమిక ఆత్మహత్యలకు రాజధానిగా మారిందని వ్యాఖ్యానించారు. ప్రజల జీవితాలను మెరుగు పరచడంలో, భారత దేశ ఉన్నత సంస్కృతులను, తత్వాలను విస్తృతంగా ప్రపంచ వ్యాప్తంగా తీసుకెళ్లాల్సిన అవశ్యం ఉందన్నారు. దేశం అంతర్జాతీయంగా, సైన్స్ అండ్ టెక్నాలజీలోనే కాకుండా ఆధ్యాత్మికంగా, సాంస్కృతికంగా కూడా అభివృద్ధి చెందుతోందని వ్యాఖ్యానించారు. అనేక అడ్డంకులను అధిగమిస్తున్నట్టు వివరించారు.
చర్చలకు సిద్ధం!
● ఉద్యోగులకు పిలుపు
● మంత్రుల నేతృత్వంలో కమిటీ
సాక్షి, చైన్నె : ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయ సంఘాల కార్య నిర్వాహకులతో చర్చలకు ప్రభుత్వం సన్నద్ధమైంది. ఇందు కోసం మంత్రులతో ప్రత్యేక కమిటీని నియమిస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ కమిటీ ఈనెల 22వ తేదీన ఆ సంఘాలతో సమావేశం కానుంది. సమావేశానికి రావాలని సంఘాల ప్రతినిధులకు పిలుపునిచ్చారు. జాక్టోజియో వేదికగా ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు తమ పది డిమాండ్ల సాధన నినాదంతో ఆందోళన బాట పట్టిన విషయం తెలిసిందే. గత పది రోజులుగా వివిధ రూపాల్లో తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు. విధులను బహిష్కరిస్తే క్రమశిక్షణ కొరడా ఝుళిపిస్తుండడంతో సెలవు రోజుల్లో ఆందోళన కార్యక్రమాల బాట పట్టారు. ఈపరిస్థితుల్లో తమిళనాడు ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయ సంఘాల వివిధ డిమాండ్ల గురించి చర్చించేందుకు ద్రావిడ మోడల్ ప్రభుత్వం సిద్ధమైంది. ఇందుకోసం మంత్రులు ఏవీ వేలు, తంగం తెన్నరసు, అన్బిల్‌మహేశ్ నేతృత్వంలో కమిటీని రంగంలోకి దించారు. ఈ కమిటీ ఈనెల 22న సచివాలయంలోని నామక్కల్ కవింజర్ భవనంలోని పదో అంతస్తులోని సమావేశ మందిరంలో చర్చలకు సిద్ధమైంది. ఆరోజున ఉదయం 10 గంటలకు తమిళనాడు ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయ సంఘాల కార్యనిర్వాహకులు చర్చలకు తరలి రావాలని పిలుపునిచ్చారు. ఈచర్చలు కొలిక్కి వచ్చేనా లేదా, ముందుగా చేసిన హెచ్చరికల మేరకు నిరసనలు ఉద్యోగ, ఉపాధ్యాయులు విస్తృతం చేసేనా అన్నది వేచి చూడాల్సిందే.
పొగమంచుతో
ఏడు విమానాలు రద్దు
తిరువొత్తియూరు: తీవ్ర పొగమంచు కారణంగా చైన్నె విమానాశ్రయం నుంచి వెళ్లాల్సిన ఏడు విమానాలను రద్దు చేశారు. ఢిల్లీ సహా ఉత్తరాది రాష్ట్రాల్లో తీవ్రమైన పొగమంచు కారణంగా వాతావరణం విమానాలకు చాలా ప్రతికూలంగా ఉంది. దీని కారణంగా, గత వారం రోజు లుగా దేశవ్యాప్తంగా విమాన సేవలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. ఇదేవిధంగా చైన్నె విమానాశ్రయంలో కూడా శుక్రవారం ఏడు విమానాలు రద్దు చేశారు. శుక్రవారం ఉదయం 9.50 గంటలకు చైన్నె నుంచి ఢిల్లీకి వెళ్లవలసిన ఎయిర్ ఇండియా విమానం, ఉదయం 10.45 గంటలకు ఢిల్లీకి వెళ్లవలసిన ఇండిగో ఎయిర్‌లైన్‌న్స్ విమానం, ఉదయం 11 గంటలకు ఢిల్లీకి వెళ్లవలసిన ఎయిర్ ఇండియా విమానం, సాయంత్రం 5.20 గంటలకు వారణాసికి వెళ్లవలసిన ఇండిగో ఎయిర్‌లైన్స్ విమానం, మొత్తం నాలుగు విమానాలు రద్దయ్యాయి. అదేవిధంగా శుక్రవారం ఉదయం 8.55 గంటలకు, 9.50 గంటలకు, 10:20 గంటలకు ఢిల్లీ నుంచి చైన్నెకి రావాల్సిన మూడు విమానాలు రద్దు అయ్యాయి. చైన్నెలో తెల్లవారుజామున నెలకొన్న తీవ్రమైన పొగమంచు కారణంగా దేశీయ విమానాశ్రయం నుంచి ఢిల్లీ, అహ్మదాబాద్, హైదరాబాద్, ముంబై ప్రాంతాలకు వెళ్లే విమానాలు గంట నుంచి రెండు గంటల వరకు ఆలస్యంగా బయలుదేరాయి. దీంతో చైన్నె విమానాశ్రయంలో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
ఆత్మహత్యల రాజధాని


