మాజీ మంత్రిపై విజిలెన్స్ గురి
● తిరువణ్ణామలైలో సోదాలు
● మదురైలోమాజీ ఎమ్మెల్యే ఇంట్లో కూడా
సాక్షి, చైన్నె: అన్నాడీఎంకే మాజీ మంత్రి సేవూరు రామచంద్రన్‌ను రాష్ట్ర విజిలెన్స్ అండ్ యాంటీ కరెప్షన్ విభాగం టార్గెట్ చేసింది. తిరువణ్ణామలైలో ఆయనకు చెందిన కార్యాలయాలు, నివాసాలలో విస్తృతంగా సోదాలు శనివారం చేపట్టారు. అలాగే, మదురైలోని మాజీ ఎమ్మెల్యే నీధిపది ఇంట్లోనూ సోదాలు జరుగుతున్నాయి. వివరాలు.. డీఎంకే ప్రభుత్వం అధికారంలోకి వచ్చినానంతరం అన్నాడీఎంకే మాజీ మంత్రులను గురి పెట్టి విజిలెన్స్, ఏసీబీ దాడులు హోరెత్తించిన విషయం తెలిసిందే. తాజాగా మాజీ మంత్రి సేవూరు రామచంద్రన్‌ను టార్గెట్ చేసినట్టున్నారు. 2016–21లో దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్న రామచంద్రన్ ఆదాయానికి మించి ఆస్తులు గడించినట్టు వచ్చిన ఫిర్యాదును విజిలెన్స్ అధికారులు పరిగణనలోకి తీసుకున్నారు. ఆదాయానికి మించి ఆస్తులు గడించినట్టుగా తమకు ప్రాథమిక ఆధారాలు చిక్కడంతో తిరువణ్ణామలై అవినీతి నిరోధక శాఖ అధికారులు , విజిలెన్స్ అధికారులు రంగంలోకి దిగారు. 20 మందితో కూడిన అధికారుల బృందం తిరువణ్ణామలైలోని రామచంద్రన్‌కు చెందిన నివాసాలు, కార్యాలయాలలో సోదాలో నిమగ్నమైంది. గట్టి భద్రత నడుమ ఈ సోదాలు జరుగుతున్నాయి. అయితే ఈ సోదాలకు వ్యతిరేకంగా అన్నాడీఎంకే వర్గాలు ఆందోళనకు దిగాయి. 2016లో నామినేషన్ దాఖలు సమయంలో చూపిన లెక్కలు, 2021 ఎన్నికల సమయంలో చూపించిన లెక్కలలో భారీగా తేడాలు ఉండటంతో ఆదిశగా సైతం దర్యాప్తును వేగవంతం చేసి ఉన్నారు.
ఉసిలం పట్టిలో..
మదురై జిల్లా ఉసిలం పట్టిలోమాజీ ఎమ్మెల్యే నీదిపది ఇంట్లోనూ సోదాలు విస్తృతంగా జరిగాయి. 2016లో ఎమ్మెల్యేగా గెలిచినానంతరం ఆదాయానికి మించి ఆస్తులను కూడ బెట్టినట్టుగా ఆయనపై ఫిర్యాదులు రావడంతో ఈ సోదాలు చేపట్టారు. ఇప్పటికే ఆయనపై ఓ కేసు పెండింగ్‌లో ఉన్న నేపథ్యంలో తాజా సోదాలలో పలు కీలక రికార్డులు బయట పడ్డట్టు సంకేతాలు వెలువడ్డాయి.


