మోసానికి గురైతే
1930కి ఫోన్ చేయాలి
వాట్సాప్ సందేశాలతో సైబర్ నేరగాళ్ల కొత్త ఎత్తుగడ
ఈ ఏడాదిలో ఇప్పటివరకు సైబర్ క్రైంలో
నమోదైన కేసులు : 939
మోసానికి గురైన మొత్తం డబ్బు : రూ. 3,58కోట్లు
ఫ్రీజ్ చేసిన మొత్తం : రూ. కోటిపైగా
రిఫండ్ అయింది : రూ. 23లక్షలు
ఫ బ్యాంకు ఖాతా నుంచి డబ్బులు డెబిట్ అయ్యాయంటూ నకిలీ మెసేజ్‌లు
ఫ ‘నో’ అని రిప్లై ఇవ్వాలంటూ
మోసపూరిత ప్రయత్నాలు
ఫ అనుమానాస్పద
లింకులు, ఫైళ్లతో అప్రమత్తం
సూర్యాపేటటౌన్ : పండుగ సందడి.. కొనుగోళ్ల హడావుడి.. ఆన్లైన్ లావాదేవీలతో అందరూ బిజీగా ఉండే సమయం. ఇదే అదనుగా సైబర్ నేరగాళ్లు కొత్త ఎత్తుగడలతో ప్రజలను బురిడీ కొట్టించేందుకు సిద్ధమవుతున్నారు. పండుగ వేళ ప్రజల దృష్టి మరల్చి బ్యాంకు ఖాతాల్లోని నగదును కొల్లగొట్టేందుకు వాట్సాప్‌ను వేదికగా చేసుకుంటున్నారు. ‘మీ బ్యాంకు ఖాతా నుంచి నగదు డెబిట్ అయింది.. ఈ లావాదేవీ మీరు చేయకపోతే వెంటనే నో అని రిప్లై ఇవ్వండి’ అంటూ గుర్తుతెలియని నంబర్ల నుంచి సందేశాలు పంపుతున్నారు. ఖాతాలో డబ్బులు పోయాయన్న ఆందోళనతో బాధితులు వెంటనే స్పందించేలా చేసి, సైబర్ ఉచ్చులోకి లాగేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి సందేశాల పట్ల ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా వ్యక్తిగత సమాచారం, మొబైల్ భద్రతకు ముప్పు ఏర్పడే అవకాశం ఉందని పోలీసులు హెచ్చరిస్తున్నారు. రాష్ట్రంలో పలు చోట్ల ఇలాంటి ఘటనలు జరుగుతున్నట్లు పోలీసులు చెబుతున్నారు.
‘నో’ అంటే మోసపోయినట్టే..
సైబర్ నేరగాళ్లు పంపే సందేశాలు అచ్చం బ్యాంకు నుంచి వచ్చినట్లుగా ఉండటంతో చాలామంది నిజమని నమ్ముతున్నారు. వెంటనే నో అని స్పందించాలని కోరుతూ గందరగోళానికి గురిచేస్తున్నారు. మరికొన్ని సందేశాలతోపాటు అనుమానాస్పద లింకులు, ఫైళ్లను పంపుతున్నారు. వాటిని తెరవడం, తెలియని యాప్‌లను డౌన్లోడ్ చేయడం, ఇన్స్టాల్ చేయడం వల్ల ఫోన్ భద్రతకు ముప్పు ఏర్పడవచ్చు. అయితే కేవలం నో అని రిప్లై ఇచ్చినంత మాత్రాన ఖాతా ఖాళీ అవుతుందని చెప్పలేమని, అసలు ప్రమాదం అనుమానాస్పద లింకులు, ఫైళ్లు, వాటి ద్వారా జరిగే మోసపూరిత చర్యల్లోనే ఉంటుందని గుర్తించాలి. అందుకే గుర్తుతెలియని నంబర్ల నుంచి వచ్చే సందేశాలకు స్పందించకుండా అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.
ఆందోళన చెందొద్దు
బ్యాంకు ఖాతా నుంచి నగదు డెబిట్ అయిందంటూ సందేశం వచ్చిన వెంటనే ఆందోళన చెందొద్దు. ముందుగా బ్యాంకు అధికారిక మొబైల్ యాప్ లేదా నెట్ బ్యాంకింగ్‌లో లావాదేవీల వివరాలను పరిశీలించాలి. అనుమానం ఉంటే బ్యాంకు అధికారిక వెబ్సైట్, యాప్ లేదా పాస్‌బుక్, కార్డు వెనుక ఉన్న ధ్రువీకరించిన కస్టమర్ కేర్ నంబర్ ద్వారానే సంప్రదించాలి. బ్యాంకు వివరాలు, పాస్వర్డ్లు, పిన్, ఓటీపీలు ఎవరికీ చెప్పకూడదు.
సైబర్ మోసానికి గురై డబ్బులు కోల్పోతే వెంటనే జాతీయ సైబర్ హెల్ప్‌లైన్ 1930కు ఫోన్ చేయాలి. లేదా www.cybercrime.gov.in వెబ్సైట్లో ఫిర్యాదు చేయాలి. వీలైనంత త్వరగా ఫిర్యాదు చేయడం ద్వారా మోసపోయిన నగదును నిలిపివేసేందుకు, తిరిగి పొందేందుకు అవకాశాలు మెరుగుపడవచ్చు. అనుమానాస్పద నంబర్లను బ్లాక్ చేసి, వాటి నుంచి వచ్చిన సందేశాలను తొలగించాలి. పండుగ వేళ సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకోకుండా ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి.
– నరసింహ, ఎస్పీ


