‘ప్రైవేటు’ ఫీజులు గోప్యమేనా! | - | Sakshi
Sakshi News home page

‘ప్రైవేటు’ ఫీజులు గోప్యమేనా!

Oct 8 2026 4:00 AM | Updated on Oct 8 2026 4:00 AM

ఆదేశాలు జారీచేశాం నమోదు చేయాల్సిందే..

ఇప్పటికే అన్ని మండలాల ఎంఈఓలకు ఆదేశాలు జారీచేశాం. ప్రతి ప్రైవేట్‌ పాఠశాల యాజమాన్యాలు తమ ఫీజుల వివరాలు నమోదు చేయించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. క్షేత్రస్థాయిలో ఎంఈఓలు పర్యవేక్షించాలి.

– శ్రీనివాసరావు, జిల్లా విద్యాశాఖ అధికారి

ఫ పోర్టల్‌లో 63 స్కూళ్లే వివరాలు నమోదు

ఫ మొత్తం ప్రైవేటు పాఠశాలలు 296

ఫ నమోదు చేయని స్కూళ్లు 233

ఫ క్లాస్‌ల వారీగా నెలాఖరు వరకు

పొందుపర్చాలంటున్న విద్యా శాఖ

జిల్లాలో ఇంకా 233 పాఠశాలల వివరాలు విద్యా శాఖ పోర్టల్‌లో నమోదు చేయలేదు. ప్రభుత్వ ఆదేశాల మేరకు అన్ని పాఠశాలల వివరాలను ఈ నెలాఖరు వరకు నమోదు చేయించేందుకు విద్యా శాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఫీజుల వివరాలు ఎందుకు నమోదు చేయలేదో పరిశీలించి, నిబంధనలు పాటించని యాజమాన్యాలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.

సూర్యాపేటటౌన్‌ : ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల దోపిడీకి అడ్డుకట్టు వేస్తూ పారదర్శకత పెంచేందుకు ప్రభుత్వం భావిస్తున్నా క్షేత్రస్థాయిలో స్పందన అంతంత మాత్రంగానే ఉంది. విద్యా శాఖ తీసుకున్న నిర్ణయాలను ప్రైవేటు విద్యాసంస్థలు పెద్దగా పట్టించుకోవట్లేదనే విమర్శలు ఉన్నాయి. ప్రతి పాఠశాల విద్యా సంవత్సరానికి సంబంధించి తరగతుల వారీగా ట్యూషన్‌ ఫీజుల వివరాలు, ఆదాయ, వ్యయాలకు సంబంధించిన ఆడిట్‌ నివేదికలతోపాటు ఫైర్‌, సౌండ్‌, శానిటరీ, ట్రాఫిక్‌ సర్టిఫికెట్లు కూడా పాఠశాలల నోటీస్‌ బోర్డులో పెట్టడంతోపాటు పాఠశాల పాలక మండలి సభ్యుల సంతకాలతో ఆమోదింపజేసి విద్యా శాఖ రూపొందించిన ఇంటిగ్రేటెడ్‌ స్కూల్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేయాలని ఆదేశించింది. అయితే జిల్లాలో 296 పాఠశాలలలకు గాను ఇప్పటి వరకు కేవలం 63 పాఠశాలలే ఫీజుల వివరాలను నమోదు చేశాయి. మరో 233 పాఠశాలలు వివరాలు సమర్పించాల్సి ఉంది. దీంతో ఆయా పాఠశాలల్లో తరగతుల వారీగా ఎంత ఫీజు వసూలు చేస్తున్నారన్నది తల్లిదండ్రులకు పూర్తిస్థాయిలో తెలియని పరిస్థితి నెలకొంది.

ఒక్కోచోట ఒక్కోలా ఫీజు

జిల్లాలోని ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల వసూళ్లపై తల్లిదండ్రుల నుంచి తరచూ ఫిర్యాదులు వస్తున్నాయి. నర్సరీ నుంచి పదో తరగతి వరకు తరగతిని బట్టి వేలాది రూపాయలు ట్యూషన్‌ ఫీజుగా వసూలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ట్యూషన్‌ ఫీజుతో పాటు పుస్తకాలు, యూనిఫాం, రవాణా, ఇతర కార్యకలాపాల పేరుతో అదనపు రుసుములు తీసుకుంటున్న పాఠశాలలు ఉన్నాయనే విమర్శలు ఉన్నాయి. పాఠశాలల వారీగా ఫీజుల వివరాలు పోర్టల్‌లో అందుబాటులోకి వస్తే తల్లిదండ్రులకు వాస్తవ పరిస్థితిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

ఆడిట్‌ వివరాలపైనా జాప్యం

ఫీజుల వివరాలతోపాటు పాఠశాలల ఆదాయ, వ్యయాలకు సంబంధించిన ఆడిట్‌ నివేదికలను కూడా సమర్పించాల్సి ఉంది. అయితే ఫీజుల వివరాల నమోదుతో పోలిస్తే ఆడిట్‌ నివేదికల సమర్పణలోనూ వెనుకబాటు కనిపిస్తోంది. పాఠశాలల ఆర్థిక లావాదేవీల్లో పారదర్శకత ఉండాలంటే ఆడిట్‌ వివరాలను కూడా తప్పనిసరిగా నమోదు చేయాల్సిన అవసరం ఉంది.

నోటీస్‌ బోర్డుల్లోనూ కనిపించని వివరాలు

ప్రైవేటు పాఠశాలల్లో ఏ తరగతికి ఎంత ఫీజు వసూలు చేస్తున్నారో, పాఠశాల కమిటీ వివరాలను నోటీస్‌ బోర్డులో ప్రదర్శించాలని అధికారులు పలుమార్లు సూచించినా అన్ని పాఠశాలల్లో అమలు కావడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. తల్లిదండ్రులు తమ పిల్లల చదువుకు ఎంత ఖర్చు చేయాల్సి వస్తుందో ముందుగానే తెలుసుకునేలా ఫీజుల వివరాలను స్పష్టంగా ప్రదర్శించాల్సిన అవసరం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement