రూ.12 కోట్లతో అభివృద్ధి పనులు
కోదాడ: కోదాడ పెద్దచెరువు అలుగు నుంచి వచ్చే వరద నీరు ఇళ్లలోకి రాకుండా నివారించేందుకు కోట్ల రూపాయలతో చేపట్టిన వరద కాలువ పనులు మూడేళ్లు గడిచినా పూర్తికాలేదు. చెరువు అలుగు నుంచి కాకుండా, కాలువ చివరి భాగమైన హిందూ శ్మశాన వాటిక సమీపం నుంచి పనులు ప్రారంభించిన కాంట్రాక్టర్ సగం మేర చేసి మధ్యలోనే నిలిపివేశాడు. పనులు ఆగిపోయి దాదాపు ఆరు నెలలు కావస్తున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. ఈ పనులను పబ్లిక్ హెల్త్ డిపార్ట్‌మెంట్ ఆధ్వర్యంలో చేపడుతుండటంతో, వాటి వివరాలు తమకు తెలియవని మున్సిపల్ అధికారులు దాటవేస్తున్నారు.
అష్టవంకలుగా చివరి భాగం
మున్సిపాలిటీ పరిధిలోని 25వ వార్డులో ఎర్రకుంట చెరువు వరద, మురుగునీరు పెద్దచెరువులోకి వెళ్లకుండా అలుగు భాగం నుంచి దిగువకు మళ్లించి, శ్మశాన వాటిక వద్ద కాలువలో కలిపేలా ఈ నిర్మాణ పనులు చేపట్టారు. అయితే, శ్మశానం వద్ద రోడ్డు వెంట కాలువ వెళ్లాల్సి ఉండగా కొందరు అభ్యంతరం తెలపడంతో కాలువను ఇష్టానుసారంగా అష్టవంకలు తిప్పారు. దీంతో పది మీటర్ల దూరం ఉండాల్సిన కాలువ ఏకంగా 50 మీటర్లకు పెరిగింది. మొత్తం 800 మీటర్ల మేర సాగాల్సిన ఈ కాలువలో కేవలం 400 మీటర్లు మాత్రమే పూర్తిచేసిన కాంట్రాక్టర్, మిగతా పనులను గాలికొదిలేశాడు. గడిచిన ఆరు నెలలుగా అలుగు పారకపోయినా, పనులు చేయడంలో కాంట్రాక్టర్.. చేయించడంలో అధికారులు ఎందుకు జాప్యం చేస్తున్నారో అర్థంకావడం లేదని స్థానికులు మండిపడుతున్నారు.
ఫ మధ్యలోనే నిర్మాణ పనులు
నిలిపేసిన కాంట్రాక్టర్
ఫ ఆరునెలలైనా స్పందించని
యంత్రాంగం
ఫ కోదాడ పెద్దచెరువు అలుగు
పారకపోయినా పనుల్లో జాప్యం
కోదాడ మున్సిపాలిటీలో టీయూఎఫ్‌ఐడీసీ యూనిట్–2 నిధులు రూ.12 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టేందుకు గత ప్రభుత్వం హయాంలో 2023 అక్టోబర్ 6న శంకుస్థాపనలు చేశారు. ఆ తర్వాత ఎన్నికలు రావడంతో పనులకు బ్రేక్ పడింది. నూతన ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత స్థానిక ఎమ్మెల్యే ఈ పనులకు మరోసారి శంకుస్థాపన చేశారు. ఈ నిధులతో కొమరబండ వై జంక్షన్, దుర్గాపురం స్టేజీ వద్ద భారీ స్వాగత ద్వారాల నిర్మాణం, ఖమ్మం క్రాస్‌రోడ్డు జంక్షన్ అభివృద్ధి చేయాల్సి ఉంది. వీటితో పాటు కోదాడ పెద్దచెరువు కట్టను ట్యాంక్‌బండ్‌గా తీర్చిదిద్దడం, వరద కాలువ నిర్మాణం చేపట్టాలి. ఈ పనులన్నీ ఒకే కాంట్రాక్టర్ దక్కించుకున్నట్లు సమాచారం. వరద కాలువ పనులను మధ్యలోనే వదిలేసిన సదరు కాంట్రాక్టర్, ప్రస్తుతం పెద్దచెరువు కట్ట అభివృద్ధి పనులను ప్రారంభించాడు. చెరువులో మట్టి తవ్వి కట్టపై పోస్తున్నాడని, వాస్తవానికి నీటిపారుదల శాఖ ఆధ్వర్యంలో జరగాల్సిన ఈ పనులు ప్రజారోగ్య శాఖ ఆధ్వర్యంలో జరుగుతుండటంతో నాణ్యతా ప్రమాణాలు గాలికి కొట్టుకుపోతున్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.


