వైభవంగా శ్రీచక్ర స్నానం
యాదగిరిగుట్ట : పాతగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. సోమవారం ఉదయం నిత్యారాధనల అనంతరం పారాయణీకులచే చతుర్వేద పారాయణం, యాజ్ఞీకులచే నిత్య హవనం, మూలమంత్ర, మూర్తి మంత్ర జపములు నిర్వహించారు. ఉదయం 9గంటలకు పూర్ణాహుతి మహోత్సవం వైభవంగా జరిపించారు. అనంతరం ఆలయ పురవీధుల్లో శ్రీచక్రాన్ని, స్వామి వారిని ఊరేగించి పుష్కరిణిలో చక్రతీర్ధ స్నానం చేయించారు. అంతకుముందు శ్రీచక్ర ఆళ్వారుడిని అలంకరించి, ప్రత్యేక పల్లకీపై అధిష్ఠింపజేసి పూజలు చేశారు. ఈ వేడుకల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పుష్కరిణిలో శ్రీచక్ర స్నానం అనంతరం ఆ నీటిని తీసుకెళ్లడానికి భక్తులు పోటీ పడ్డారు. పలువురు భక్తులు పుష్కరిణిలోనే స్నానాలు చేశారు. రాత్రి నిత్యారాధనల అనంతరం దేవతోద్వాసన, పుష్పయాగం, డోలారోహణం జరిపించారు.
నేటితో ఉత్సవాలు ముగింపు..
పాతగుట్ట వార్షిక బ్రహ్మోత్సవాలు మంగళవారంతో ముగియనున్నాయి. ఉదయం 10గంటలకు స్వామి వారి శతఘటాభిషేకం, మధ్యాహ్నం 1గంటలకు మహాదాశీర్వచనం, పండిత సన్మానంతో ఉత్సవాలను పరిసమాప్తం చేయనున్నారు.
భారీగా తరలివచ్చిన భక్తులు
ఉదయం పూర్ణాహుతి..
రాత్రి దేవతోద్వాసన
నేడు శతఘటాభిషేకంతో
ఉత్సవాల ముగింపు


