రామన్నపేట.. మారిందిట్టా..
నాడు మున్సిపాలిటీ.. నేడు గ్రామ పంచాయతీ
చిట్యాల : సాధారణంగా గ్రామ పంచాయతీలు కాలక్రమేణా జనాభా, ఓటర్లు, ప్రాంత అభివృద్ధికి అనుగుణంగా మున్సిపాలిటీలుగా మారుతుంటాయి. కానీ ఉమ్మడి నల్ల గొండ జిల్లాలో ఉన్న ఓ గ్రామం ఇందుకు భిన్నంగా చరిత్రలో నిలిచింది. ఒకప్పుడు మున్సిపాలిటీగా, తాలుకా కేంద్రంగా, శాసనసభ నియోజకవర్గ కేంద్రంగా కొనసాగిన ఆ గ్రామం ప్రస్తుతం మేజర్ గ్రామ పంచాయతీగా ఉంది. యాదాద్రి భువనగిరి జిల్లాలోని రామన్నపేట గతంలో మున్సిపాలిటీగా ఉండి డిగ్రేడ్ అయి ప్రస్తుతం గ్రామ పంచాయతీగా ఉంది. ఈ గ్రామం 1971 సంవత్సరం వరకు మున్సిపాలిటిగా ఉండేది. అనంతరం ఆ గ్రామాన్ని ప్రభుత్వం డిగ్రేడ్ చేస్తూ గ్రామ పంచాయతీగా మార్చింది. రామన్నపేట గతంలో తాలుకా కేంద్రంగా కూడా ఉండేది. 1985లో తాలుకాలను రద్దు చేసి మండల కేంద్రాలను ఏర్పాటు చేయటంతో రామన్నపేట మండల కేంద్రంగా మారింది. అంతేకాకుండా రామన్నపేట గతంలో శాసనసభ నియోజకవర్గ కేంద్రంగా ఉండేది. 2009లో జరిగిన శాసనసభ నియోజకవర్గాల పునర్విభజనతో రామన్నపేట నియోజకవర్గం రద్దు చేయబడింది. దీంతో రామన్నపేటను నకిరేకల్ శాసనసభ నియోజకవర్గ పరిధిలోకి చేర్చారు. ఎంతో ప్రాధాన్యత గల రామన్నపేట మున్సిపాలిటీ నుంచి గ్రామ పంచాయతీగా మారిన తీరు స్థానికుల్లో చర్చనీయాంశంగా మారంది.


